‘రాగల 24 గంటల్లో’ మూవీ రివ్యూ

వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరించే క్రేజీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి ఈ సారి క్రైమ్‌ బాట పట్టాడు. అదేనండి సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమాను తెరకెక్కించాడు. ఈషా రెబ్బా లీడ్‌ రోల్‌లో సత్యదేవ్, శ్రీరామ్, ముస్కాన్‌ సేథీ, గణేశ్‌ వెంకట్రామన్‌ ముఖ్య పాత్రల్లో నటించిన 'రాగల 24 గంటల్లో'చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కథా బలం ఉండి కాస్త సస్పెన్స్‌, ఎంటర్‌టైన్‌ తోడైతే  క్రైమ్‌ స్టోరీ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. మరి సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మదిని దోచిందా? తన పంథా మార్చుకుని తొలిసారి క్రైమ్‌ బేస్డ్‌ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు విజయవంతం అయ్యాడా? చూద్దాం. ఇండియాలోనే నంబర్‌ వన్‌ యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ రాహుల్‌(సత్య దేవ్‌) ఎవరూ లేని అనాథ అయిన విద్య(ఈషా రెబ్బ)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అయితే వివాహ బంధంతో ఒక్కటైన మూన్నాళ్లకే వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభం కావడం.. రాహుల్‌ ప్రవర్తనతో విద్య విసిగిపోతుంది. అయితే అనుకోని పరిస్థితుల్లో రాహుల్‌ హత్యకు గురవుతాడు. అది ఎవరు చేశారు? ఆ మిస్టరీని ఏసీపీ నరసింహం(శ్రీరామ్‌) చేధించాడా? విద్య, గణేశ్‌, అభిల మధ్య ఉన్న పరిచయం ఏంటి? ఈ మిస్టరీ కేసుకు​ దాస్‌(రవివర్మ), పుణీత్‌, వినీత్‌, అద్వైత్‌, మేఘన(ముస్కాన్‌ సేథీ)లకు ఏంటి సంబంధం? అనేదే మిగతా కథ.


ప్రస్తుత కుర్ర హీరోలు కెరీర్‌ ఆరంభంలోనే నెగటీవ్‌ రోల్స్‌కూ సై అంటున్నారు. మొన్న కార్తికేయ.. నేడు స​త్యదేవ్‌. ఇప్పటివరకు సత్యదేవ్‌ను పాజిటివ్‌ యాంగిల్లోనే చూసిన అభిమానులు తొలిసారి విలన్‌గా చూస్తారు. సత్యదేవ్‌ నటన చూశాక సైకోయిజం, కన్నింగ్‌, అనుమానం ఇలా ఏదనుకున్న యాప్ట్‌ అవుతుంది. తొలిసారి నెగటీవ్‌ షేడ్‌లో కనిపించిన సత్యదేవ్‌ విలనిజంలో పూర్తిగా లీనమవుతాడు. సినిమాలో లీనమైన వారు అతడు బయట కనిపిస్తే అసహ్యించుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రేంజ్‌లో నటించాడు. సారీ జీవించాడు. ఇక ఈషా రెబ్బ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.