కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు: మంత్రి ఈటల

కరోనా వైరస్‌(కోవిద్‌-19) నియంత్రణకు రాష్ట్రప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటున్నదని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్‌కు సంబంధించి వివరాలు వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు మాత్రమే కరోనా లక్షణాలు బయటపడ్డాయనీ, వారిని ఐసోలేషన్‌ వార్డుల్లో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలంతా పార్కులు, మాల్స్‌, వేడుకలకు దూరంగా ఉండాలని మంత్రి సూచించారు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలనీ, అనవసరంగా జనసమూహంలోకి వెళ్లకూడదని ప్రజలకు సూచనలు చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో శానిటైజర్స్‌ అందుబాటులో ఉంచాలని మంత్రి సూచించారు. 


రాష్ర్టానికి వచ్చే అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయాలని కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ను కోరినట్లు మంత్రి ఈటల ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 6 కరోనా కేసులు నమోదయ్యాయనీ,  ఇటీవల స్కాట్లాండ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ అని తేలినట్లు మంత్రి తెలియజేశారు. కరోనా సోకిన వారందరూ వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగా ఉన్నారన్నారు. అన్ని దేశాలు కరోనాపై హై అలర్ట్‌ ప్రకటించాయని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.