సునీల్ గ‌వాస్క‌ర్ సాయం రూ. 59 ల‌క్ష‌లు!



కొవిడ్‌-19 వ్యాప్తిని అరిక‌ట్టేందుకు జ‌రుగుతున్న పోరాటంలో దిగ్గ‌జ బ్యాట్స్‌మ‌న్ సునీల్ గ‌వాస్క‌ర్  భాగ‌మ‌య్యాడు. మ‌హ‌మ్మారిపై పోరుకు ప్ర‌ధాని స‌హాయ నిధితో పాటు మహారాష్ట్ర ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి విరాళం అందించాడు. అయితే ఈ విష‌యాన్ని లిటిల్ మాస్ట‌ర్ నేరుగా ప్ర‌క‌టించ‌లేదు. ముంబై మాజీ కెప్టెన్ అమోల్ మ‌జుందార్  ట్విట్ట‌ర్ వేదిక‌గాఈ అంశాన్ని ధ్రువీక‌రించాడు. `బ్యాటింగ్ లెజెండ్ క‌రోనా వైర‌స్‌పై పోరుకు రూ. 59 ల‌క్ష‌ల ఆర్థిక సాయం చేశారు. అందులో రూ. 35 ల‌క్ష‌లు పీఎం కేర్స్ నిధికి.. మ‌రో రూ. 24 ల‌క్ష‌లు మహారాష్ట్ర ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి కేటాయించారు. హ్యాట్స‌ఫ్ స‌ర్‌` అని ట్వీట్ చేశాడు.


మ‌రోవైపు టీమ్ఇండియా టెస్టు స్పెష‌లిస్ట్ చ‌తేశ్వ‌ర్ పుజారా కూడా త‌న‌వంతు సాయం చేసిన‌ట్లు  వెల్ల‌డించాడు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప్ర‌తీ రూపాయి అవ‌స‌ర‌మొస్తుంద‌ని పుజ్జీ పేర్కొన్నాడు. `నేను, నా కుటుంబ సభ్యులం మాకు చేత‌నైనంత సాయం చేశాం. ప్ర‌ధాని స‌హాయ నిధితో పాటు, గుజరాత్ సీఎం స‌హాయ నిధికి విరాళం అందించాం. మీరు కూడా ఈ ప‌నిచేశార‌ని ఆశిస్తున్నా. క‌ష్ట‌కాలంలో ప్ర‌తీ రూపాయి అక్క‌ర‌కు వ‌స్తుంది. ప్ర‌స్తుతం మ‌నమంతా క‌లిసి ఈ మ‌హ‌మ్మారిని జయించాలి. ప్రాణాల‌ను కూడా లెక్క చేయ‌కుండా సేవ‌లందిస్తున్న వైద్య సిబ్బందికి స‌లాం చేస్తున్నా` అని పుజ‌రా అన్నాడు.