ఉగ్గపట్టి

ఉగ్గపట్టి...


చాలాసార్లు చిన్నపిల్లనైపోవాలనుకుంటా
ముక్కు చీది
కళ్ళునలుపుకుంటూ ఏడ్చేద్దామని


నా గుండె బొమ్మపై రంగుగీతలు గీశారని
నా బ్రతుకు చిత్రాన్ని బొగ్గుతో మరకేసారని చాడీలు చెప్పేందుకు అద్దాన్ని అమ్మను చేస్తా


కళ్ళ అలమరాలో 
 ఇస్త్రీ చేసి 
జ్ఞాపకాలతో మడిచి 
దాచిపెట్టుకున్న 
కొన్ని కన్నీటి బొట్లని నుసిచేసి
బుగ్గలు కందేలా పూసుకోవాలనుకుంటా


గాజుల చేతికి నిలువునా చీరుకున్న నిన్నమొన్నటి ఉద్వేగాయాలు
కొత్తపట్టీలకు ఒరుసుకున్న 
కాలి అడుగుల శబ్దాలు
ఇంకా ఇంకా ఎన్నో


చెప్పేందుకు మాటలే కాదు భావాలు లేవు
ఎందుకంటే నేను చిన్నపిల్లనవ్వాలనుకుంటున్నా
ఎంతగా అంటే 
మరోసారి 
నాలోకి ఏ పెద్దరికం అడ్డొచ్చి
నా ఉగ్గబట్టే క్షణాలను చిదిమేయనంత....


సుభాషిణి తోట