భారతీయ కమ్యూనిజం గురించి బాబాసాహెబ్

❄ *భారతీయ కమ్యూనిజం గురించి బాబాసాహెబ్*
           
సోహన్ లాల్ శాస్త్రి ( *బాబాసాహెబ్ సెక్రటరీ*) గారితో బాబాసాహెబ్ మాటలు:::


 బాబాసాహెబ్  ఒకరోజు చదువుకుంటుండగా ఆయన వద్దకు వెళ్లాను,  బాబా మీతో ఒక విషయం మాట్లాడాలను కుంటున్నాను అని... *"మన భారతదేశంలో కమ్యూనిస్టులు పేదరికాన్నినిర్మూలించాలి"అనే నినాదంతో పనిచేస్తున్నారు. దేశ సంపదను జాతీయం చేసి ప్రజలందరికీ పంచాలి అంటున్నారు. మరి మనం కమ్యూనిస్టులతో కలిస్తే మనకు లాభమే కదా! ఎందుకంటే మనం తిండి లేని కడుపేదవారము. ఆ పార్టీ పేదరికాన్ని నిర్మూలించాలనే విషయంలో కంకణబద్దురాలై ఉంది అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి బాబా"* అన్నాను. 


దానికి సమాధానంగా నాకు చాలా సుదీర్గమైన వివరణ ఇచ్చారు.
బాబాసాహెబ్ మాట్లాడుతూ... *పేదరికాన్ని జయించడంపై నాకెలాంటి బేధాభిప్రాయాలు లేవు. భారతీయ కమ్యూనిస్తులతో మాత్రం మనకు ఎలాంటి మేలు జరగదు. అన్నిటికంటే ముందుగా తెలుసుకోవాల్సింది ఏమంటే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులందరూ బ్రాహ్మణులు లేకుంటే సవర్ణ హిందువులు. వాళ్ళు వర్ణ వ్యవస్థ గురించి మాట మాత్రంగానైనా ఆలోచించరు. ఎందుకంటే వాళ్ల ఎజెండా కేవలం ఆర్థిక విప్లవం వరకే పరిమితమైనట్టిది. నేను కమ్యూనిజం మీద వచ్చిన ఎన్నో పుస్తకాలు చదివాను. కమ్యూనిజం గురించి ఎంతగానో ఆలోచించాను. నాకు తెలిసి కమ్యూనిస్టు నాయకులు ఎవరూ కూడా నేను చదివినన్ని పుస్తకాలు చదవటం గానీ దీని గురించి ఇంత ఆలోచించడం గానీ చేయలేదని నా గట్టి అభిప్రాయం. ఒకవేళ కారల్ మార్క్స్ ఈ దేశంలో కనుక పుట్టివుంటే ఈ దేశంలో కూర్చుని  దాస్ కాపిటల్ రాసి ఉంటే ఆ పుస్తకం వేరే విధంగా వ్రాయబడి ఉండేది. ఈ దేశంలో సామాజిక భిన్నత్వం ఉంది. ఈ దేశంలో నాలుగు వర్ణాలు, వాటి సంతానంగా వేలాది కులాలు సృష్టించబడి ఉన్నాయి. ప్రతి కులం ఇంకొ కులంతో వేరుగా విభజించబడి ఉంది.ప్రతి కులం మరొక కులం పట్ల అపనమ్మకంతో ఉంది. కులాలు, ప్రాంతాలు, ఎక్కువ తక్కువల తేడాలతో ఈదేశం నిండి ఉంది.ఈ దేశ ప్రజలకు, నాయకులకు తమ పేదరికం పట్ల ఏమాత్రం సీరియస్ నెస్ లేదు సరికదా కుల పరిరక్షణ పట్ల మాత్రం చాలా అప్రమత్తంగా ఉంటారు. ఈ దేశంలోని కమ్యూనిస్టులకు కూడా కుల కట్టుబాటు వుంది.కనుకనే ఈ దేశంలో రష్యా, చైనాల్లో లాగా ఎలాంటి విప్లవం రాదు. కేవలం కడుపునిండా తిండి దొరికిినంత మాత్రాన మనుషులకి సంతృప్తి కలగదు. వారికి సామాజిక ఐక్యత,సమానత్వం కావాలి. కమ్యూనిస్టులు వాటిపై దృష్టి సారించరు. ఆర్థిక విప్లవం తర్వాత సామాజిక విప్లవం దానంతట అదే వస్తుందని అంటారు. కాని వారి అభిప్రాయం తప్పు.ఈ దేశంలో లక్షాధికారి అయిన చమార్ ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ, శూద్రకులంలో పుట్టి న ఒక వ్యక్తి ఆర్ధికంగా ఎంత ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ పిడికెడు మెతుకులు కూడా పుట్టని బ్రాహ్మణ, వైశ్యల దృష్టిలో వీరిద్దరూ హీనంగానే చూడబడతారు.*
నేను ఇంతకుముందు చెప్పినట్టు కమ్యూనిస్టు నేతల్లో ఎక్కువ మంది బ్రాహ్మణులు లేక సవర్ణులు ఉన్నారు. కనుకనే వాళ్ళ దృష్టిలో ఇలాంటివి ఒక సమస్యలా కూడా కనిపించవు. ఎందుకంటే వారి సామాజిక స్థాయి మిగిలిన వారి కంటే ఉన్నతమైనదని భావిస్తారు.


 *అసలు ఈ రోగానికి పునాదులు భారత సామాజిక చట్రంలోనే ఉన్నాయి. దరిద్రుడయిన  బ్రాహ్మణుడు, ధనికుడైన బనియా కంటే కూడా ఉన్నతుడననేి భావంతో ఉంటాడు. ఇదే భావంతో భారతదేశ త్రివర్ణాలు కులాలు ఉన్నాయి. బాధాకరమైన విషయమేమిటంటే కమ్యూనిస్టు నాయకులు ఈ విషయం పట్ల ఏమాత్రం దృష్టిపెట్టి ఆలోచించడం లేదు. ఈ వర్ణవ్యవస్థ గురించిన ప్రస్తావన అసలే చేయరు. వాటిపై తుపాకి మందుగుండు పేల్చరు. కానీ సంపదను మాత్రం పంపిణీ చేయాలని మాట్లాడుతున్నారు. నేను మానవుడిని తార్కిక జ్ఞానం కలిగిన ఆలోచనా పరునిగా, అర్థం చేసుకోగలిగిన ప్రాణిగా ఉండాలని భావిస్తాను. పేద, ధనిక వ్యత్యాసాలను నేను ప్రజాస్వామ్య పద్ధతిలోనే పరిష్కరించు కోవాలనుకుంటాను. ప్రపంచంలో అన్నింటి కంటే మేలైన పరిపాలన పద్ధతి ఏదైనా ఉందంటే అది ప్రజాస్వామ్యం మాత్రమే. కమ్యూనిస్టులతో ఇక్కడే నాకు పేచీ వస్తుంది. తిండి కోసం చేసే పోరాటాల కన్నా మానవత్వం కోసం, స్వేచ్ఛ కోసం చేసే ఆలోచనలని నేను ఉన్నతమైనవిగా భావిస్తాను అని*  బాబాసాహెబ్ ముగించారు. వెంటనే నేను బాబా సాహెబ్ తో ఇలా అన్నాను...


*" స్వతంత్ర భావాలు కలిగి ఉన్నంత మాత్రాన ఆకలి తీరదు. మనం నిరుపేదలుగా వున్న దరిద్రులం. ఒకవేళ సామ్యవాద ప్రభుత్వం ఏర్పడి సంపదంతా స్వాధీనమై ప్రతి పౌరున్ని ఆ సంపదలో భాగస్వాములను చేసి అందరికి ఉద్యోగాలు కల్పిస్తే ఎవరు నిరుద్యోగులు ఉండరు కదా. అలా జరిగితే ఈ కమ్యూనిస్టు ప్రభుత్వంలో నిరుపేదలుగా ఎక్కువ దరిద్రాన్ని అనుభవిస్తున్న మన ప్రజలకు మేలు జరుగుతుంది కదా!"* అని అన్నాను.


అందుకు ప్రతిస్పందిస్తూ బాబాసాహెబ్ ఇలా అన్నారు..
 *"రేపు కమ్యూనిస్టులు భారతదేశంలో అధికారంలోకి వస్తే వారికి పరిపాలనలో మూడు విషయాలు తప్పక అవసరమవుతాయి మొదటిది యంత్రాంగం (సివిల్ ఉద్యోగులు, అధికారులు) రెండవది సైనికశక్తి మూడవది శ్రమ మరియు శ్రామికులు.
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో పని చేస్తున్న అధికారిని ఒక ప్రశ్న అడగండి.మీరు కమ్యూనిస్టు ప్రభుత్వంలో కూడా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారా? అని వెంటనే అతను నేను బ్రిటిష్ వారి ఆజ్ఞలు నియమ నిబంధనల ప్రకారం వారి ప్రభుత్వంలో భయభక్తులతో మేలైన సేవలు చేశాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా వారి పద్ధతుల ప్రకారం పని చేస్తున్నాను. రేపు కమ్యూనిస్టు ప్రభుత్వం లో కూడా వారికి అనుకూలంగా పని చేస్తాను అంటాడు. 
కమ్యూనిస్టు ప్రభుత్వం కూడా ఇలాంటి అధికారులతో , తమ పరిపాలన పద్ధతి ప్రకారం పని చేయించుకోవడానికి సిద్ధంగానే ఉంటుంది


*ఇప్పుడు రెండవది సైన్యము మరియు సైనిక సేవలు వస్తాయి. సైన్యం నుంచి కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వానికి కూడా పైన చెప్పిన సమాధానమే వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వధికారులు, సైన్యాధికారులు సైన్యంలో ఎక్కువ భాగం అగ్రవర్ణాల వారితోనే నిండి ఉంటుంది. ఈ అగ్రవర్ణాల అధికారులు మొదట బ్రిటిష్ ప్రభుత్వంలో , తరువాత కాంగ్రెస్ ప్రభుత్వంలో రేపు కమ్యూనిస్టు ప్రభుత్వం లో కూడా ఉన్నతాధికారులుగా కొనసాగగలరు. కానీ భారతదేశంలోని అంటరానివారు , ఆదివాసీలు మరియు వెనుకబడిన కులాలు ఈ ప్రభుత్వంలో అధికారులే కారు. సైన్యాధికారులుగా లేరు.* ఆ సిస్టమ్ అలాగే కొనసాగి రేపు కమ్యూనిస్టు ప్రభుత్వంలో కూడా ఈ వర్గాలకు రవంత చోటు కూడా దక్కదు.


*ఇప్పుడు మూడవ శ్రేణిలో శ్రామికులు వస్తారు. వీరిలో రైతులు, వివిధ కర్మాగారాలలో పనిచేసే కార్మికులు, సేవకులు ఉంటారు. భారతదేశంలోని అంటరాని ప్రజలు ఆదివాసీ, బీసీ కులాలు కూడా వస్తారు. వారి పని రోడ్లను శుభ్రపరచడం, మురికి ఎత్తి పోయడం, పొలాల్లో పని చేయడం, చిన్న చిన్న పనులు చెయ్యడం. భవిష్యత్తు కర్మాగారాల్లో పని చేసే లేబర్ కూడా వీరే.*


ఈ ప్రజలకు కమ్యూనిస్టు రాజ్యంలో కూలి బాగా దొరుకుతుంది . ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట దొరుకుతుంది . *కానీ ప్రభుత్వ పరిపాలనలో సైనిక  పాలనలో మాత్రం కనీస ప్రాతినిధ్యం గానీ ,భాగస్వామ్యం గానీ దొరకదు. వీరు ఈరోజు ఏ పని చేస్తూ ఏ వృత్తిలలో ఉన్నారో , రేపు కూడా అదే పని చేస్తూ ఉంటారు. అయితే వారి ఆర్థిక స్థితి మాత్రం ఇప్పటి కంటే కొంత ఉన్నతంగానే ఉంటుంది.ఈ శ్రామికుల పిల్లలకు అవసరమైన ఉన్నత విద్య, పరిపాలనలో, సైన్యంలో ఉన్నత పదవులు, అధికారాలు మాత్రం ఉండవు. వాళ్లు తమ పిల్లల చేతికి చీపుర్లు ఇచ్చి రోడ్డు ఊడ్చడానికి పొమ్మంటారు. ఎందుకంటే వారికి ఉద్యోగం అయితే తప్పకుండా దొరుకుతుంది కానీ పరిపాలనలో మాత్రం సమాన భాగస్వామ్యం, గౌరవం మాత్రం తప్పవు. ఎప్పుడైనా , ఎవరైనా చైతన్య వంతుడైన అంటరాని వ్యక్తి కమ్యూనిస్టులతో మా పిల్లలకు కూడా ప్రభుత్వ పాలనాధికారం కావాలని అడిగితే వారు దానికి సమాధానంగా, మన దృష్టిలో ప్రభుత్వాధికారిగా రోడ్లు ఊడ్చే వారైనా, పాకీపని చేసేవారైనా ఒకటే అని అంటారు. ఇంకా ఏమంటారంటే మీకు రోడ్లు ఊడ్వడం లో చాలా అనుభవం ఉంది కదా అందుకే రోడ్లు ఊడ్చే పనులు చేయండి అంటారు. తత్ఫలితంగా నేటి అంటరాని ప్రజలు, వెనుకబడిన వర్గాలు మూడో స్థానంలోకి అనివార్యంగా నెట్టబడతారు. అదే అగ్రవర్ణాలు మాత్రం పరిపాలకులుగా ఉంటారు. అంతేకాకుండా కమ్యూనిస్టు రాజ్యంలో మూడవ శ్రేణిలో వున్నఅంటరాని ప్రజలు ఆ శ్రేణిలో కూడా అత్యంత కింది మెట్టుకి నెట్టబడతారు. అంటరానివారి పైనున్న బీసీ వర్గాలు కూడా అగ్రవర్ణాల కాళ్లకిందనే ఉంటారు. వర్ణవ్యవస్థను పాటిస్తున్న సవర్ణుల చేతుల్లోనే పరిపాలన అధికారాలు శాశ్వతంగా ఉంటాయని* బాబాసాహెబ్ సుదీర్ఘ శ్వాస తీసుకుంటూ చెప్పారు.


బాబాసాహబ్ నాతో ఇంకా ఇలా అన్నారు... *"నీకు భారత ప్రభుత్వ ఉద్యోగిగా దొరుకుతున్న వేతనం కంటే రెట్టింపు వేతనం రోడ్లు ఊడ్చేందుకు ఇస్తే నువ్వు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి రోడ్లు ఊడ్చేందుకు ఒప్పు కుంటావా" అన్నారు. దానికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ oppukonu baba అన్నాను. ఎందుకు? అని బాబాసాహెబ్ అడిగారు. వెంటనే నేను "నాకు ఆత్మ గౌరవం కూడా కావాలి. నేను చదువుకుని ప్రభుత్వ పరిపాలనలో గౌరవప్రదమైన స్థానం పొందుతున్నాను. ఒకవేళ ప్రభుత్వం అంత డబ్బు ఇచ్చినా నేనేం చేసుకుంటాను? అందుకు నేను ఒప్పుకుంటే నా ఆత్మగౌరవం నశిస్తుంది* అని బదులిచ్చాను. బాబాసాహెబ్ దానికి బదులు ఇస్తూ *"నీ సమాధానం చాలా నిజమైనది విలువైనది నేను కూడా ఇదే కోరుకుంటున్నాను, ప్రజలు బాగా చదువుకుని సమాజంలో ఉన్నతమైన గౌరవప్రదమైన స్థానాన్ని పొందాలి.అది ప్రజాస్వామిక ప్రభుత్వంలోనే దొరుకుతుంది. నెమ్మదిగా జరిగినప్పటికీ ప్రణాళికాబద్ధంగా, ప్రగతిగ్రామిగాను ఉండగలగాలి . సోషలిస్ట్ ప్రభుత్వంలో అంటరాని వారికి కడుపునిండా తిండి మాత్రం దొరుకుతుంది ,కానీ ప్రభుత్వ పరిపాలనలో మాత్రం గౌరవప్రదమైన పదవులు పాలనాధికారం మాత్రం ఎప్పటికీ దొరకవు*"అని గట్టిగా చెప్పారు.


బాబా సాహేబ్ అభిప్రాయం ప్రకారం *భారతీయ కమ్యూనిస్టులు కులం గురించి ఏమాత్రం ఆలోచించరు. ఎందుకంటే వారు అగ్రవర్ణాలుగా పుట్టారు కనుక, భారతదేశ విప్లవ నాయకులు తమ తాత తండ్రులకు పిండం పెడుతూ, శ్రద్ధ లని పాటిస్తారు. బొట్టు పెట్టుకోవడం లాంటి మతాచారాలను పాటించడానికి ఎలాంటి సంకోచాన్ని వ్యక్తపరచరు. మను ధర్మం ప్రకారం నాలుగు వర్ణాలకూ ప్రాప్తించిన గోత్రనామాలను పేర్ల వెనక పెట్టుకోవడానికి కూడా వెనుకాడరు. గోత్రనామాలను తమ రచనలకు కూడా తగిలిస్తారు. జోషి, నంబూద్రిపాద్ dange, శర్మ, వర్మ ,గుప్తా ,das లాంటి చిహ్నాలను పేర్ల వెనుక తొలగించుకుంటారు. ఇవి సవర్ణ చిహ్నాలు. ఈ నామ చిహ్న తరంలో లను తమపేరు వెనకాల తగిలించుకుంటారు. ఆ పేర్లతో వారి కులం, వర్గం చెప్పకనే మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. భారతదేశ కమ్యూనిస్టులు చాతుర్వర్ణాల పై తిరగబడాలనిగానిిి వాటిని నిర్మూలించే చర్యల గురించి ఆలోచించరు. అసలు వాటిని నిర్మూలించాలనే ఆలోచనే చెయ్యరు. రష్యా, చైనాలో విప్లవం విజయవంతం కావడానికి గల ప్రధానమైన కారణం ఆ దేశాల్లో సామాజిక మతపరమైన వివక్షలు లేకపోవడమే .అందుకే వాళ్లు కేవలం ఆర్థిక వివక్షత నిర్మూలనే ధ్యేయంగా పని చేస్తారు. కనుకనే అక్కడ విప్లవం విజయవంతం అయింది .కానీ ఈ దేశంలో బ్రాహ్మణుడు ఆకలితో ఉండడానికైనా ఇష్టపడతారు కానీ తన బ్రాహ్మణత్వాన్ని మరియు పుట్టుకతో సంప్రాప్తించిన ఔన్నత్యాన్ని ఎప్పుడూ వదులుకోవడానికి సిద్ధపడడు. అతను పరమ భయంకరమైన దారిద్ర్యాన్ని అయినా సహిస్తాడు కానీ ఈ భూమిపై తానే అత్యంత ఉన్నతమైన పూజనీయున్ని అనే బ్రమల్ని మాత్రం వదులుకోవడానికి సిద్ధపడడు*


చతుర్వర్ణాల్లో తాను శిరోమణి బ్రాహ్మణునిగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తా డు. ఆకలి ,దప్పికలను కూడా సహించి కేవలం బ్రాహ్మణత్వం తో సంతృప్తి చెందుతాడు. ఒకవేళ కమ్యూనిస్టు ఆకలి పోరాటాల్లో అతను దరిద్రుడైన bhangi , chamar తో కలిసి ఆకలిపై పోరాటం చేసినా కూడా, పోరాటం తర్వాత లభించిన ధనాన్ని పంచుకున్నాక భంగి, చమర్ ల కంటే తనను తాను ఉన్నతమైన వాడిగా అనుకుంటాడు. కమ్యూనిస్టు బ్రాహ్మణుడు మాత్రం చమార్లతో కంచం పొత్తు మంచం పొత్తుకు మాత్రం ఇష్టపడడు.


కమ్యూనిస్టు విప్లవం తేవడానికి ముందు మొదటి గొడ్డలి దెబ్బ వర్ణ వ్యవస్థపై వేయాలి. దాని నుండి ఉత్పన్నమైన కులంపై వీటన్నింటికీ ఆధారభూతమైన మతగ్రంధాల పై వెయ్యాలి .భారతదేశంలో ఉచ్ఛనీచాలకు మూలమైన కులాల దొంతరలు అంతమవుతాయి. అప్పుడు కమ్యూనిస్టులు అందరికీ సమానమైన హక్కులు సాధించే దిశలో సామ్యవాద నాయకుడు ఆర్థిక రాజకీయ పోరాటానికి ఆహ్వాన గీతం ఆలపించగలడు. తదనుగుణంగా విజయం లభిస్తుంది.కానీ వారు అలా చేయడానికి ఇష్టపడరు.
భారతదేశం లో అందరికన్నా మొదటగా లోకమాన్య బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యమే నా జన్మహక్కు అని సమరశంఖం ఊదాడు. అప్పుడు సమాజ సంస్కర్తలు కొందరు తిలక్ ని ఇలా ప్రశ్నించారు భారతదేశంలో అంటరానితనానికి , ఆకలికి తరతరాలుగా గురవుతున్న పేదవారికి వారి జన్మహక్కు సామాజిక సమానత్వం అవుతుంది కాని స్వరాజ్యం ఎట్లా అవుతుంది ?అని . కాబట్టి సవర్ణుల చేతుల్లో ఉన్న సామాజిక , మతపరమైన సమానత్వాన్ని భారతీయులందరికీ సమానంగా ముందు అందించాలి .తరువాత విదేశీయుల నుండి స్వాతంత్య్రాన్ని పొందవచ్చు అని అన్నారు. అప్పుడు దానికి సమాధానంగా తిలక్ అది మా ఇంటి సమస్య, స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత ఈ విషయాల గురించి ఆలోచిస్తాం  అన్నాడు. అదే విధంగా నేటి భారతదేశ కమ్యునిస్ట్ నాయకులు ఆర్థిక విప్లవం మా జన్మహక్కు అంటున్నారు. వర్ణ వ్యవస్థ గురించి అడిగితే తిలక్ భాషలోనే వీళ్ళు మాట్లాడతారు. ఆర్థిక విప్లవం తర్వాత ఈ అంతరాలు వాటంతట అవే తొలగిపోతాయంటారు.


బాబాసాహెబ్ కు సామ్యవాద రాజకీయ విప్లవంపై నమ్మకం లేదు. ప్రజాస్వామిక ప్రణాళిక పద్దతిలో మాత్రమే రాజకీయ, సామాజిక, ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయని బలంగా నమ్మేవారు.


సామ్యవాద విప్లవ కారులు తమ లక్ష్యాన్ని సాధించేందుకు అనేక త్యాగాలకు కూడా సిద్ధపడతారని , నేను అనేక సందర్భాలలో babasaheb తో అనేవాణ్ణి .దానికి బదులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా అన్నారు.... "బుద్ధుని అనుచరులైన బౌద్ధ భిక్షువులు ఎంత త్యాగపూరితులంటే వాళ్లకు ప్రపంచంలో ఇలాంటి సంపద ఉండదు. వారి జీవిత గమనాన్ని సాధించడానికి అవసరమైనవి... శరీరం కప్పడానికి 3 వస్త్రాలు 1 భిక్షాపాత్ర క్షవరం చేసుకోవడానికి ఒక కత్తి, బట్టల కుట్టుకోవడానికి ఒక సూది.ఇంతవరకే వారికి అనుమతి ఉంది .పెద్ద సుసంపన్న ఉన్నత కుటుంబాల నుంచి వచ్చి బౌద్దం తీసుకున్న బిక్షువులు కూడా ఈ ఆజ్ఞల్నిపాటించక తప్పదు. సాంసారిక సుఖాలని త్యజించి ఎండకు ఎండుతూ చలికి వణుకుతూ "బహుజన హితాయ బహుజన సుఖాయ" అంటూ ప్రజల్లో ప్రజ్ఞ శీల సమతలను ప్రచారం చేస్తూ అనేక ప్రదేశాలు సంచరిస్తూ బౌద్ధాన్ని ప్రచారం చేస్తారు. ప్రజల్ని ప్రజ్ఞా శీలురుగా, జ్ఞానవంతులుగా మార్చేందుకు ప్రచారం చేసేందుకు బౌద్ధ భిక్షువులు ఆకలి దప్పికలతో పర్వతాల్ని నదుల్ని లోయల్ని దాటుకుంటూ ఎన్నో కష్టనష్టాలను ఓర్చుకుంటూ ముందుకు సాగుతారు. ఈ త్యాగాలను అత్యంత విలువైన త్యాగాలుగా భావిస్తాను తప్పా కమ్యూనిస్టు త్యాగాలను కాదు అని babasaheb ambedkar చాలా స్పష్టంగా కమ్యూనిస్టుల మీద తన  అభిప్రాయాన్ని  చెప్పారు.


.హిందీ నుండి అనువాదం


డా.జి.వి.రత్నాకర్..