//పునరావృతం// కోడె యామిని దేవి

//పునరావృతం//


నువొస్తావ్..
పలకరిస్తావ్.. కొన్ని పనూలూ చేస్తావ్
ఆ తర్వాత మాయమవుతావ్ 
ఫోన్లో గేములే ఆడతావో 
ఫేస్ బుక్ లో స్టేటస్ లే రాస్తావో 
నీ ఇష్టం నీదే కానీ.. 
నీ ప్రపంచం లో కాసేపు నన్ను చూడు 
నా ప్రపంచంలో కాసేపలా కాలుమోపు
నువొచ్చిన ఆ కాసేపూ 
నా చుట్టూతా నువ్వు తిరుగుతుంటే
పసిపాప(బాబు) నట్టింట మరలా పారాడినట్టే నాకు
ఏదేదో చెప్పాలనుంటుంది
ఏమేమో వినాలనుటుంది
ఇద్దరిమద్యనా మౌనం రాజ్యమేలుతుంది 
అయినా మాయదారి టెక్నాలజీ 
నీకూ నాకూ మధ్యన అడ్డుపడుతూనే ఉంటుంది.
నేను పిలుస్తాను - నువ్వు పలుకుతావు
నేను అరుస్తాను - నువ్వు విసుక్కుంటావు
నేను కేకలేస్తాను - నువ్వు బాధ పడతావు
నాపై నాకే కోపమొస్తుంది - నా తప్పు తెలుస్తుంది
మౌనాన్ని తొడుక్కుంటాను
నువ్వలకనుకుంటావు - నేనదేంకాదంటాను
అంతే అంతే అంటుంటావు - నేనదే తంతంటాను
వెళ్లొస్తుంటావు 
మరలా మామూలే
నీ లోకి నువ్వు - నిన్ను వెతుక్కుంటూ నేను 
ప్రహాసనాలెన్నో మిగిలి పోతూంటాయి 
పదే పదే పునరావృతమవుతూంటాయి.