జానకమ్మకు జన్మదిన శుభాకాంక్షలు

:: Happy Birthday to Janakamma 
నరుడా ఓ నరుడా.. 
ఏమీ.. కోరికా!?
---------------------------
ఎట్టకేలకు...
మనం చేసిన తపస్పుకి మెచ్చి 
''నరుడా నరుడా ఏమి కోరికా..'' అంటూ దేవుడు 
మాంచి ఆఫర్‌ ఇచ్చారనుకోండి.. ఏంటీ తపస్సు గిపస్సు.. ఛాదస్తం మాటలు అనకండీ. జస్ట్‌.. ఫర్‌ ఫన్‌ మాత్రమే అనుకోండి.. అలా ఆఫర్‌ వస్తే మాత్రం.. 
మనలో చాలామంది.. ''స్వామీ.. జానకమ్మ పాట ఒకటి వినిపించండీ.. మీకు పుణ్యముంటుంది'' అనిగానీ.. '' ప్రియాతి ప్రియమైన నా దేవుడా.. నాకు మణులు వద్దూ.. మాణిక్యాలు వద్దుగానీ..ఆ జానకమ్మ పాడిన పాటల సీడీలు నాలుగు ప్రసాదించండి స్వామీ.. '' అని అడుగుతామేమో..?? 
ఇట్టాంటి వీరాధివీర,, సంగీతాభిమానుల్ని సంపాదించుకున్నారు మన జానకమ్మ.
***
జానకమ్మ పాటతో అసలు నేస్తంకట్టని మహానుభావులు ఎవరైనా ఉన్నారా? అని వెదికే సాహసం చేయడం కూడా తప్పే. ఎందుకంటే జానకమ్మ.. తెలుగు సినీగీతానికి వెన్నముద్దలు అద్దిన బంగారు తల్లికదా?! 
బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమానాటి.. పంచెకట్టు సీతారామయ్యగారి నుంచి.. ఆ తర్వాత.. నెత్తిన చంద్రవంక కొప్పులు పెట్టుకున్న పార్వతమ్మ దాకా..
.. కిట్టీ పార్టీలు చేసుకునే కాంతామణుల వరకూ.. ఆనక మిడ్డీలు, జీన్లు, పంజాబీలు వేసుకునే పరువం పిల్లలదాకా జానకమ్మ పాట ఏమాత్రం వదల్లేదు.
***
నాడు.. జరీచీర.. పెద్ద బార్డర్‌ అంచుగల ఆడాళ్ళతో ''పగలే వెన్నెలా..'' అంటూ.. పలకరించినా..ఆ తర్వాత.. పదహారేళ్ళ వయసు పిల్లల్ని 'సిరి మల్లె పువ్వా..'' అంటూ కలవరించేలా చేసినా.. ఇంకా ఆ తర్వాత ''తొలిసారి మిమ్మల్నీ చూసింది మొదలు..'' అంటూ కాలేజీ అమ్మాయిల్ని లవ్వు లెటర్స్‌ రాయిమని తొందరపెట్టినా.. జానకమ్మ పాటకే చెల్లింది. 


అసలు సంగీతాభిమానుల్ని కట్టిపడేయడం అంటే ఏమిటో తెలియాలంటే జానకమ్మ పాటలు విని తీరాల్సిందే. 
ఈ గొంతుకు సంగీతాభిమానుల నాడీ తెలుసు, వాడీ తెలుసు.
ఆ జనరేషన్‌ లేదు.. ఈ జనరేషన్‌ లేదు.. కాలం గిరా గిరా తిరుగుతూనే ఉందిగానీ జానకమ్మ పాట మాత్రం..అప్పుడే పుట్టిన పిల్ల గొంతుకే అయ్యింది. అవుతూనే ఉంది. 


''గోవులు తెల్లనా.. గోపయ్య నల్లనా..'' అంటూ.. బుంగమూతిపెట్టి వెండితెరపై 
క్విజ్‌ ప్రశ్నల ట్రెండ్‌కు తెరతీసినా? ''నీ ఇల్లు బంగారం కానూ''....''ఆ బుగ్గమీద ఎర్రముద్దు ఏందబ్బా..'' అంటూ ర్యాంప్‌ వాకిట ముగ్ధమనోహరంగా సయ్యాటలాడినా..''నీ కౌగిలిలో తలవాల్చీ..'' అంటూ అనుబంధపు లోకాల్లో విహరింప జేసినా.. జానకమ్మ తీరేవేరు. ఆపాటతో సంగీత ప్రియులు ముడిపడ్డ జ్ఞాపకాల విహరింపే వేరు.
***
జానకమ్మ పాడిన పాట..
మనలో చాలమందికి.. ఉగ్గుపాలతో నేర్చిన, కావాలని దక్కించుకున్న ..
ఓ అందమైన అనుభూతి
జానకమ్మ పాడిన పాట... 
చాలమందిని తీర్చిదిద్దిన.. ఓ సంగీత పాఠం
మరికొందరికి.. జీవితానికి సరిపడేంత భవిష్యత్తు.
ఇంకొందరికి.. 
జీవితాంతం హాయిగా బతికేంత 
సారీగామా.. పదనిసల టానిక్‌
అందుకే.. జానకమ్మ పాటంటే
గుండెలోతుల కలవరింతల గానం !
వెన్నెలద్దిన పాటల పరవశం !
నిత్యనూతన స్వరతరంగం !!
ఒక్కమాటలో చెప్పాలంటే..
జానకమ్మ.. తెలుగు పాటకు 
పర్యాయపదం !!
- గంగాధర్‌ వీర్ల
(ఏప్రిల్‌ 23, గాయని ఎస్‌.జానకమ్మ పుట్టినరోజు)