Skip to main content

ప్రపంచ పుస్తక రోజు సందర్భంగా..

🚜🚲🏍️ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా... విజ్ఞాన సుగంధం


    అనుభవాన్ని...జ్ఞానాన్ని ఓ తరం నుంచి మరో తరానికి అందించే సాధనం పుస్తకం. 'మంచి పుస్తకాలు పఠించడం, గత శతాబ్దాల లోని ఉత్తమ వ్యక్తులతో సంభాషించడం వంటిది' అంటాడు ఫ్రెంచి తత్వవేత్త రీనీ డెకార్త్‌. 


దీనికి కొనసాగింపుగా 'కొన్ని పుస్తకాలు రుచి చూడాలి.. కొన్నింటిని మింగేయాలి, కొన్నిటిని నమిలి జీర్ణం చేసుకోవాలి' అంటాడు ప్రముఖ రచయిత బేకన్‌. మంచి పుస్తకం జ్ఞానాన్ని రంగరించి పెడుతుంది. దాన్ని జీర్ణం చేసుకొని నరనరానికి ఎక్కించుకోవడమే మనం చేయాల్సింది. 


ఆదిమ కాలం నుంచి అంతరిక్ష యానం వరకు మానవ మేధస్సు సృష్టించిన, సృజించిన మహత్తర విషయాలన్నీ పుస్తకాల్లో నిక్షిప్తమై ఉన్నాయి. మానవ చరిత్రలో సంభవించిన, సంభవిస్తున్న మలుపులన్నింటికీ అక్షరాలు సజీవ సాక్ష్యాలు. అందుకే 'మానవ జాతి పురోగమన యాత్రలో పుస్తకాలు మహత్తర పాత్ర పోషిస్తాయంటాడు’ ముల్కరాజ్‌ ఆనంద్‌. 


ప్రపంచ గతిని మార్చిన ఎందరో మహనీయుల జీవితాలను ప్రభావితం చేసిన శక్తి అక్షరం. 'ఫిరంగి వచ్చి ఫ్యూడల్‌ వ్యవస్థను నాశనం చేసింది. సిరా ఈనాటి సాంఘిక వ్యవస్థ రూపురేఖలు మార్చేస్తుంద'న్న నెపోలియన్‌ వ్యాఖ్యకు సజీవ రూపం, ప్రపంచ చరిత్ర గమనాన్నే మార్చేసిన కారల్‌ మార్క్స్‌ 'పెట్టుబడి' గ్రంథం.


       ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనంలో పుస్తక పఠనం తగ్గుతోంది. కొత్త పుంతలు తొక్కుతోన్న ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా- మన విలువైన సమయాన్ని మింగేస్తోంది. ఏది చదవాల్సివచ్చినా ఆన్‌లైన్‌ లోనే వెదుకుతున్నాం, పుస్తకాలను మర్చిపోతున్నాం. ఈ క్రమంలో చిన్ననాటి నుంచే పుస్తక పఠనం పట్ల ఆసక్తిని కల్పించాల్సిన అవసరం నేడు ముందుకొచ్చింది. 


ప్రపంచవ్యాప్తంగా 77.4 కోట్ల మంది పుస్తకాలు చదవట్లేదని యునెస్కో సర్వే చెబుతోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా పుస్తకాలు చదివేది భారతీయులేనని ఒక సర్వే తెలిపింది. టీవీ, ఇంటర్నెట్‌ల వినియోగం పెరుగుతున్న నేడు... పుస్తకాలు చదివే వారి సంఖ్య పెరుగుతుండడం ఆహ్వానించదగ్గ విషయమే.


 అయితే-విలువైన పుస్తకాలను భద్రపరచేందుకు డిజిటలైజ్‌ చేస్తున్నామని చెబుతున్నప్పటికీ అనేక పురాతన విజ్ఞాన గ్రంథాలు, తాళపత్రాలు డిజిటలీకరణకు నోచుకోడం లేదు. 'దేశ భాషలందు తెలుగు లెస్స' అని చాటిన శ్రీకృష్ణదేవరాయల విరచిత 'ఆముక్తమాల్యద' తాళపత్ర గ్రంథం ఇప్పటికీ తంజావూరు లోని సరస్వతి మహల్‌ గ్రంథాలయంలో ఉంది. ఈ తెలుగు గ్రంథాన్ని డిజిటలైజ్‌ చేయాలన్న స్పృహ ఇంతవరకూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు రాలేదు. 


వందల ఏళ్లనాటి ఆ తాళపత్రాలను ఫొటో ప్రతులుగా రూపొందించాలన్న మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఎనిమిది దశాబ్దాల నాటి ఆకాంక్ష నేటికీ నెరవేరకపోవడం విడ్డూరం. అంతేకాదు తంజావూరు గ్రంథాలయం లోని 778 తెలుగు తాళపత్ర గ్రంథాల్లో ఇప్పటికీ 323 అముద్రితాలు తాళపత్రాల రూపంలోనే ఉన్నాయి. కాగితంపై రాసిన 44 ఒరిజినల్‌ గ్రంథాల్లో, 26 గ్రంథాలు ఇంకా పుస్తక రూపం లోకి రానే లేదు. అంతేకాదు-లండన్‌ లైబ్రరీలో దాదాపు 8 వేల పైచిలుకు తెలుగు పుస్తకాలున్నాయి. వాటిల్లో కొన్ని తెలుగు నేలపై లభించడమే లేదు. వాటిని సైతం డిజిటలైజ్‌ చేసే ఆలోచన లేకపోవడం విచిత్రం. 


కనుమరుగైపోతున్న పుస్తక సంపదను కాపాడుకోవడానికి, భవిషత్తు తరాలకు జ్ఞాన సంపదను అందుబాటు లోకి తేవడానికి యునెస్కో ఏప్రిల్‌ 23ను 'ప్రపంచ పుస్తక దినోత్సవం'గా ప్రకటించింది. ఈ ఆశయం నెరవేరాలంటే, తెలుగు భాషా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించినప్పుడే విలువైన పుస్తకాలు... జాతి సంపదగా మిగులుతాయి.


ఓ మంచి పుస్తకం చదవడంలో ఉన్న ఆనందం అనుభవించే వాళ్ళకే తెలుస్తోంది. ఒక పుస్తకాన్ని చదువుతున్నామంటే.. పరోక్షంగా ఆ పుస్తక రచయితతో మాట్లాడుతున్నామన్నమాటే. అందుకే పుస్తకం ఎన్ని నిర్బంధాలను ఎదుర్కొన్నా.. తరతరాలనూ అలరిస్తోంది.


 స్వాతంత్య్ర పోరాట కాలంలో ఉన్నవ లక్ష్మీనారాయణ 'మాలపల్లి' పుస్తకాన్ని నిషేధించారు. కమ్యూనిస్టు సాహిత్యంపై ఆంక్షలు విధించారు. సల్మాన్‌ రష్దీ 'శాటనిక్‌ వర్సెస్‌'ను నిషేధించారు. డావెన్సీ కోడ్‌ను అడ్డుకున్నారు. తమిళనాడులో ఒక సాంఘిక దురాచారాన్ని, మూఢనమ్మకాన్ని ఎత్తిచూపుతూ 'వన్‌ పార్ట్‌ వుమెన్‌' (అర్థనారి) పుస్తకాన్ని రాసిన పెరుమాళ్‌ మురుగన్‌పై సంఘ పరివార్‌ శక్తులు తీవ్ర దాడికి దిగడం తాజా పరిణామమే. 


ఎన్ని ఆంక్షలు, అడ్డంకులు ఎదురైనా అక్షరం..అక్షయం. ఛాందస, మూఢ విశ్వాసాల సంకెళ్ల నుంచి విముక్తి కలిగించి హేతువాద, సశాస్త్రీయ, ప్రగతిశీల చైతన్యాన్ని ఉద్దీపింపజేస్తూనే వుంటుంది. పుస్తక పఠనం ఒక వ్యాపకంగా, ఒక అలవాటుగా బాల్యంలోనే విత్తుకోవాలి. లేదంటే- 'చదువని వాడజ్ఞుండగునని..' పోతన చెప్పినట్లుగా... ఆ తరం అంతా అజ్ఞానంతో, మూఢ నమ్మకాలతో నిండిపోతుంది. 'చిరిగిన చొక్కా అయినా తొడుక్కో... కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో' అన్న కందుకూరి మాటలు మనందరికీ మార్గదర్శకం కావాలి.


Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...