రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు 

రైట్..రైట్ ..
రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు                         50 శాతం మందితో జర్నీ.. ఆన్ లైన్ లో టికెట్ బుకింగ్


కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం విధించిన లాక్‌డౌన్‌తో మార్చి 22 నుంచి ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. ఇక ఇంతకాలం డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు త్వరలోనే రోడ్డెక్కనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కేసులు పెరుగుతున్నా సరే ఇంకా ఎక్కువ రోజులు లాక్ డౌన్ విధిస్తే జనజీవనం అస్తవ్యస్థంగా మారుతుందని భావించి లాక్ డౌన్ విధించినా కొన్నిటికి సడలింపు ఇవ్వడంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రజా రవాణా కొనసాగేలా ఆర్టీసీ అధికారులు బస్సులు తిప్పాలని నిర్ణయించినట్లు తెలిసింది.


18వ తేదీకల్లా బస్సులను తిప్పేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ


ప్రజా రవాణా శాఖ అధికారులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు బస్సులు నడపనున్నారు.
అయితే బస్సుల్లో సామాజిక దూరం పాటించేలా సీట్ల సర్దుబాటు చేసేలా ఆలోచన చేస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ పీటీడీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఆర్‌ఎంలకు 18వ తేదీకల్లా బస్సులను తిప్పేందుకు సిద్ధంగా ఉండాలని సర్క్యులర్‌ జారీ చేశారు. దీంతో అన్ని రీజియన్‌లలో ఉన్నతాధికారులు వివిధ డిపోల్లోని డీఎం, తదితరులను అప్రమత్తం చేశారు. బస్సులను కండీషన్ లో పెట్టుకోవటానికి సన్నాహాలు చేస్తున్నారు.


భౌతిక దూరం ఉండేలా బస్సుల్లో సీటింగ్ అరేంజ్మెంట్ మారుస్తున్న అధికారులు


ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు కరోనావ్యాప్తి జరగకుండా ఉండేలా అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్న ఆర్టీసీ అధికారులు రంగంలోకి దిగారు . మొదటి దశగా రీజియన్‌లో 635 బస్సులు తిప్పాలని అధికారులు నిర్ణయించారు. అంతేకాదు బస్సుల్లో, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో సీటింగ్‌ ఏవిధంగా ఏర్పాటు చేయాలని గ్యారేజ్‌ సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీటింగ్ భౌతిక దూరం ఉండేలా చూడాలని భావిస్తున్నారు. దీంతో ప్రయాణీకులు భౌతిక దూరం పాటిస్తే కరోనా వ్యాప్తి జరగకుండా ఉంటుందని ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక సీటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.


50 శాతం మాత్రమే ప్రయాణాలు .. ఆన్ లైన్ బుకింగ్


గతంలో 100 శాతం ప్రయాణికులు ప్రయాణాలు చేస్తే ఇక నుండి బస్సులో కేవలం 50 శాతం మందే ప్రయాణించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక టికెట్లు కూడా కండక్టర్ బస్సుల్లో కొట్టి ఇవ్వటం వల్ల కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉండటం తో టికెట్లు కూడా ఆన్‌లైన్‌ ద్వారానే బుక్‌ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక వేళ బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉంటే బస్టాండ్లలో కండక్టర్లు ఫోన్‌ పే, గూగుల్‌ పే, ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేస్తారు తప్ప చేతికి టికెట్ ఇచ్చే అవకాశం లేదు .


గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ లావదేవీలు తెలీని ప్రజలు ... ఆన్ లైన్ బస్ బుకింగ్ అంటే తిప్పలే


ఇక ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని బస్సులను నడపాలని సర్కార్ భావిస్తుంది కానీ అది ఆర్టీసీకి నష్టం చేకూరుస్తుంది అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది . ఇప్పటికే ఎప్పుడెప్పుడు బస్సులు తిరుగుతాయ అని చూస్తున్న వారికి ఏపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం కాసింత ఊరట కలిగించినా , ఆన్ లైన్ బుకింగ్ మాత్రం కాసింత ఇబ్బందే. గ్రామీణ నేపధ్యం ఉన్న ఎంతో మందికి ఇంకా చాలా చోట్ల డిజిటల్ ట్రాన్జాక్షన్ తెలీదు . వారు బస్సు టికెట్లు కొనుగోలు చెయ్యాలంటే ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే వారికి తిప్పలే మరి.