అమ్మ

అమ్మ ....❤️❤️❤️


గుండె లయలో
అమ్మ పాటలు
లోలకమై జ్ఞాపకాల గానమౌతాయి


గాయాలెన్ని ఓదార్చిందో అమ్మ ఒడి
తలనిమిరిన అమ్మ చేతి అనురాగం
నిత్యం నాకు నడక నేర్పుతూనే వుంటుంది


దూరంగా వున్నా ధ్యాస అమ్మౌతుంది
మమతను
అనుభూతి స్పర్శలో అల్లుకుంటాను


ముక్కలైన రెక్కలు
ఇపుడు నొప్పితో మాట్లాడుతుంటాయి


అరిగిన అరచేతిలో
రేఖలు గజిబిజిగా
గతాన్ని గుర్తుచేస్తుంటాయి


పరిగెత్తి పనులు చక్కబెట్టి
అందరి అవసరాలకు 
అంకితమైన ఆ పాదాలే
మూడోకర్ర ఆసరాతో తప్పటడుగులేస్తున్నాయి


మ్రొక్కని దేవుడు లేడు
మొర పెట్టుకోని సందర్భమూ లేదు
మనసు మంత్రమై సంచరించిందానాడు


ఒక్కోసారి తెరపై బిడ్డను చూసిన
వెలుతురు దరహాసం
వెంటాడే ఆత్మస్ధైర్యమౌతుంది 


అమ్మ ప్రేమ అంతులేనిదై
అల్లుకుంటుంది తెరను తాకుతూ
నిండైన ఆనవ్వు
నిలువెత్తు నమ్మకమై 
నిలబెడుతూనే వుంటుంది


కాంతి నిండిన కన్నుల్లో
నా పసితనాన్ని అమ్మ చూసినట్టుగా
నాకేమో పొత్తిళ్ళలో పరిశించిన ఊహ


గుండెల్లో అమ్మ
బ్రతుకు జాగరూకత నేర్పుతూనే వుంటుంది


అమ్మ పసిపాపైయ్యిందిపుడు
బోసినవ్వుతో పలుకరిస్తూ ...!!                      -వాణి కొరటమద్ది