బ్రతుకు తెరువు ఇరకాటం  వలస జీవుల పోరాటం

బ్రతక కరువు కాటకం 
బ్రతుకు తెరువు ఇరకాటం 
వలస జీవుల పోరాటం 
వరుస  ప్రాణాలు కోల్పోవటం 


దేశమంతా తనదిగా  
దేహమంతా పనిదిగా 
ఒదిగి ఒదిగి కరిగి కరిగి 
ఎదిగే ప్రతి అణువులోను 
వదిలే తన ఊపిరేగా 
వలసకూలీలమనే   ముద్ర
వదలని దారిద్రమేగా 


స్వంత వూరు  వదలి 
వున్న గూడు వదలి
తట్ట నెత్తిన పెట్టి 
పొట్ట చేత పట్టి 
కులాన్ని పక్కనెట్టి 
కూలన్న పేరు  పెట్టి 
కండల్ని కుదవ బెట్టి 
బండల్ని పిండి చేసినారుగా 


దళారి మాటలకు దగా పడ్డా
దమ్మిడీ లేక  ఢీలా పడ్డా
ధనవంతులకు అతనే  అండా 
దరిద్రానికి అతనిదే అడ్డా


పనులు అతనివే 
పస్తులూ అతనివే 
ఘనులు ఎన్ని ఉన్నా 
మానధనులు సున్నా 


అతని నుండి పుట్టని రోగం 
అతనికి  అంతుపట్టని రోగం 
ఆతను  చెయ్యని పాపం 
అతని శ్రమకు కరోనా శాపం


ఊరికే ప్రాణం పోకూడదు 
పొతే వూరిలోనే పోవాలని 
ఆతను  ఉరుకుతున్న తీరు 
మనకు  ఉబుకుతుంది కన్నీరు


అతను  నిర్మించిన నగరాలు 
అతనికి  వీడ్కోలు చెపుతున్నాయి 
అతను వేసిన రహదారులు 
అతనికి స్వాగతం పలుకుతున్నాయి


అతనికి  విరామం లేదు అతని శ్రమకు విశ్రాంతి లేదు  
ఊపిరి జాగ్రత్తగా వూరికిచేరుకో వలస కూలన్నా ! 
  — ఆచంటి శ్రీనివాసరావు. తెనాలి