వైసీపీ లో తీవ్ర విషాదం

వైసీపీ లో తీవ్ర విషాదం.. 

కడప జిల్లా బద్వేలు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్య(62) కన్నుమూత..

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ గుంతోటి వెంకట సుబ్బయ్య ఇక లేరు. కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఎమ్మెల్యే మృతి పట్ల వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

#ఆస్పత్రిలో_చికిత్స_పొందుతూ..

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన బద్వేలు నుంచి వైసీపీ తరఫున 35వేల పైచిలుకు మెజార్టీతో గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్యకు సౌమ్యుడిగా పేరుంది. కొద్ది రోజుల కిందట అనారోగ్యానికి గురైన ఆయనను హైదరాబాద్ తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత కడప జిల్లాలోని సొంత ఊరికి తరలించారు. తాజాగా మరోసారి పరిస్థితి విషమించడంతో ఆయనను కడప జిల్లాలోనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున ఎమ్మెల్యే కన్నుమూశారు.

#కుటుంబమంతా_డాక్టర్లే..

వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేలు నియోజకవర్గంతోపాటు కడప జిల్లా అంతటా విషాద ఛాయలు అలముకున్నాయి. వెంకటసుబ్బయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య సంధ్య కూడా డాక్టర్ కాగా.. కూతురు హేమలత, ఎంబీబీఎస్‌ చదువుతోంది. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారానే వెంకటసుబ్బయ్య రాజకీయ రంగప్రవేశం చేశారు. 2019 ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి గెలిచారు.

#ఎమ్మెల్యే_మృతిపై_జగన్_దిగ్భ్రాంతి..


కడప జిల్లా బద్వేలు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మృతిపట్ల పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మృతి సమాచారం అందిన వెంటనే తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం జగన్.. వెంకటసుబ్బయ్య కుటుంబసభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. సీఎం తోపాటు కడప, వివిధ జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు బద్వేలు ఎమ్మెల్యే మృతిపై సంతాపం తెలిపారు.