కాకీబతుకులు నవల రచయిత మోహనరావు మృతి

 కాకీబతుకులు నవల రచయిత మోహనరావు మృతి


తెనాలి: బానిసల తిరుగుబాటు నాయకుడు స్పార్టకస్ కలం పేరుతో పోలీసు వ్యవస్థలోని మరో కోణాన్ని 'ఖాకీబతుకులు "నవలగా సజీవంగా చిత్రీకరించి సాహితీలోకంలో, పోలీస్ శాఖలో సంచలనం రేపిన గంటేనపాటి మోహనరావు (68) ఇకలేరు. తెనాలి కొత్తపేటలోని పోలీస్ క్వార్టర్స్ లోని నివాసంలో ఆదివారం రాత్రి మృతిచెందారు. మధుమేహం కారణంగా గుండె బలహీనమై మరణానికి చేరువ చేసింది. ఆయనకు భార్య మేరీ, కుమార్తె ప్రత్యూష, కుమారుడు ప్రేమ్ చంద్ ఉన్నారు. సాయంత్రం అంత్యక్రియలు పూర్తిచేశారు. పలువురు సాహితీవేత్తలు, పట్టణ ప్రముఖులు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నాయకులు కనపర్తి రత్నాకర్, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

ఎస్టీ హెడ్ కానిస్టేబుల్ గా తెనాలిలో పనిచేస్తున్న సమయంలో మోహనరావు ఖాకీబతుకులు నవలను రాశారు. తనకన్నా ముందు 1940-75 మధ్య పోలీసుశాఖలో కానిస్టేబుల్ గా పనిచేసిన తన తండ్రి ప్రకాశం జీవితానుభవాలను తీసుకుని 1980-88 మధ్య రాసిన ఈ నవల, 1998లో పుస్తకరూపం దాల్చింది. పోలీస్ కానిస్టేబుల్ జీవితంలోని ప్రతి పార్శాన్నీ హృదయానికి హత్తుకునేలా అక్షరీకరించిన ఈ నవలకు ఆపూర్వమైన స్పందన లభించింది. ఏడాదిలోనే పునర్ముద్రణకు వచ్చింది. పాతికేళ్ల క్రితం వెలువడిన ఈ నవలపై అప్పటి పోలీస్ బాస్ కన్నెర్ర ఫలితంగా మోహనరావు ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఇందుకోసం ఆయన న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. న్యాయం జాప్యమవుతుందన్న భావనతో తన కేసును తానే వాదించుకున్నాడు. 18 ఏళ్ల సుదీర్ఘపోరాటం ఫలించి, 2011లో ఉద్యోగమైతే వచ్చింది. కేవలం 10 నెలలు హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసి రిటైరయ్యారు. 


సస్పెన్షనులో ఉన్న కాలాన్ని సర్వీసులో చేర్చకపోవటం, అప్పట్లో రావాల్సిన సగం వేతనం నిరాకరించటంపై న్యాయస్థానం తలుపు తట్టారు. మోహనరావుకు 18 సంవత్సరాల పెన్షనరీ ప్రయోజనాలను కల్పించమని కోర్టు తీర్పు వచ్చింది. దీనిపై 2012 చివర్లో అప్పటి జిల్లా ఎస్పీ హైకోర్టుకు వెళ్లి స్టే ఉత్తర్వులు పొందారు. దీనిపై 18 ఏళ్ల సర్వీసును తీసేసి 21 సంవత్సరాల సర్వీసునే పరిగణనలోకి తీసుకుని పింఛను ఇస్తున్నారు. అదే 18 ఏళ్లలో రావాల్సిన సగం జీతం పైనా ఆప్పీలు పెండింగులో ఉండిపోయింది. 


కానిస్టేబుల్ గా చేస్తూనే పీజీ, లా డిగ్రీలు చేసిన మోహనరావు కొత్తగా పోలీసుశాఖలో చేరే కానిస్టేబుళ్ల కోసం పోలీస్ చట్టాలు, న్యాయ అంశాలపై 12 పుస్తకాలు రాశారు. తన కుమార్తె ప్రత్యూష పబ్లికేషన్స్ పేరుతో తాను ముద్రించుకున్నారు. సుదీర్ఘ న్యాయపోరాట కాలంలో ఆ పుస్తకాలే ఆ కుటుంబాన్ని ఆదుకున్నాయి. ఎమర్జన్సీ తర్వాత పరిణామాలతో ఖాకీబడుకులు రెండో భాగం రాస్తానని అప్పట్లో ప్రకటించారు. మోహనరావు. దీనికి ముందు క్రైస్తవ సన్యాసిని (నన్స్)లపై పుస్తకం, ఓ సినిమా కథ రచనకు పూనుకున్నారు. అనారోగ్యంతో అవి పూర్తిచేయలేకపోయారు.