కోవిడ్ థర్డ్ వేవ్ ను సమర్థంగా ఎదుర్కొంటాం.

కోవిడ్ థర్డ్ వేవ్ ను సమర్థంగా ఎదుర్కొంటాం...

... డిప్యూటీ ఎం హెచ్ ఓ జె. నరసింహ నాయక్.

తెనాలి : కోవిడ్ థర్డ్ వేవ్ ప్రభావం చిన్నపిల్లలపై ఎక్కువగా ఉంటుందని శాస్త్రీయంగా నిర్ధారణ అయిన దృష్ట్యా ఎటువంటి పరిస్థితినయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు డిప్యూటీ ఎం హెచ్ ఓ నరసింహ నాయక్ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని అన్ని వైద్యశాలలో బెడ్స్ పెంచుతున్నట్లు, ఆక్సిజన్ తదితర సౌకర్యాలను మెరుగు పరుస్తున్నట్లు తెలిపారు.పిల్లల వయసును బట్టి మందుల డోసులు ఇవ్వాల్సి ఉంటుందని అందుకోసం వైద్యాధికారులకు సిబ్బందికి శిక్షణా తరగతులు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.డివిజన్ పరిధిలో 45 సంవత్సరాలు నిండిన వారికి, గర్భిణీలకు,పిల్లల తల్లులకు, మరియు ఉపాధ్యాయులకు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ చేయడం జరిగిందన్నారు. అంతేగాక విదేశాలకు చదువు, ఉద్యోగం నిమిత్తం వెళుతున్న వారికి కూడా వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు పట్టణ పరిధిలో మూడు కేంద్రాలలో వ్యాక్సిన్ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.కోవిడ్ 19 ప్రోటోకాల్ లో భాగమైన మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడడం, తరచూ చేతులు శుభ్రం చేసుకుంటూ సామాజిక దూరం పాటించాలని ప్రజలనుద్దేశించి సూచనలు చేశారు.