నేడు ప్రముఖ నటుడు, దర్శకుడు, ప్రయోక్త డి.ఎస్.దీక్షిత్ జయంతి

కళాదీపికాంజలి!
●●●●●●●●●●

ఈరోజు...
ప్రముఖ నటుడు, దర్శకుడు, ప్రయోక్త
డి.ఎస్.దీక్షిత్ గారి
28-7-1956  ◆ 18-2-2019
జయంతి.
●●●●●క●ళా●దీ●పి●క●●●●●
"న‌ట‌న కాదు..వ‌రం..!" -డి.ఎస్.దీక్షిత్
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
తెలుగునాటకం అనే మాట విన్నప్పుడు, అన్నప్పుడు ఎంత గాంభీర్యంగా ఉంటుందో.. అంతకుమించి సమాజం కోసం లెక్కలేనన్ని బాధ్యతల్నీ ఎన్నో ఏళ్ళుగా తెలుగునాటకం తన భుజాన మోస్తూ వస్తుందనేదీ అక్షర సత్యం. 
నాటకం అంటేనే సమ్మోహన కళ. ఆ సమ్మోహనంలో 
చైతన్యాన్ని నింపే సుగంధ కవనాలు, రసరమ్య గమనాలెన్నో. అందుకే 'నాటక కళ' సమాజాన్ని 
ప్రభావితం చేసే అత్యుత్తమమైన కళల్లో ఒకటయ్యింది. తెలుగు నాటకానికి ఇంతటి ఘనమైన చరిత్రే ఉంది. కళారూపంగానే కాదు, మనో, వైజ్ఞానిక, కళావికాసానికి గళమెత్తిన ఎందరో మేటి నటుల్ని, భవిష్యత్‌ దార్శనికుల్ని తెలుగు నాటకం ఈ సమాజానికి అందించింది. 

అలా నాటక కళ కోసం.. 
నాటకరంగం కళకళలాడటం కోసం.. 
తనంతట తానుగా, తనతో అనేకమందిగా, 
నటకులానికే వారథిగా, జీవితాంతం బతికినవాడే 
డిఎస్‌ దీక్షిత్‌ మాష్టార్‌.. 
అలియాస్‌ దీవి శ్రీనివాసా దీక్షిత్‌. 

డిఎస్‌ దీక్షిత్‌ నాటకరంగానికి చెందిన మనిషి.. 
అని ఆయన్ని ఒకరంగానికి మాత్రమే కుదించేసి, పరిమితం చేయడం అంటే పెద్ద సాహసమే. 
నాటకం మాత్రమేకాదు, సినిమా, టీవి,
సాహిత్యరంగాల్లోనూ ఆయన పాత్రోచిత ప్రయాణం అసామాన్యం. నాటకమే ధ్యాస, శ్వాస, ఊపిరి, 
జీవితం అనే ఉపమానాలన్నిటికీ దీక్షిత్‌ కళాజీవిత ప్రయాణమే.. ఓ ఉదాహరణ. నటనంటే ఎంత ప్రాణం పెట్టుకోకపోతే.. నటిస్తూనే తుదిశ్వాస విడుస్తారాయన! నటుడిగా సీరియల్‌లో ఓ పాత్ర పోషిస్తుండగా.. షూటింగ్‌ సమయంలోనే హఠాత్తుగా గుండెపోటు రావడంతో 2019 ఫిబ్రవరి 18 వ తేదీన 
హైదరాబాద్‌లో మరణించారాయన. 

రంగస్థలాన.. బాహుబలి
●●●●●●●●●●●●●
నాటకాల గురించి తెలియని, పెద్దగా పరిచయంలేని వాళ్ళకు.. డి.ఎస్‌.దీక్షిత్‌ అంటే.. 'మురారి, అతడు, ఇంద్ర'లాంటి సినిమాల్లో కీలకసన్నివేశాల్లో
కనిపించినాయనే కదా..! అని అనుకోవచ్చు. 
నిజానికి నటుడుగానే కాకుండా .. మిగతా సినిమాలతోనూ ఆయనకు చాలానే అనుబంధం ఉంది. ఆయన సినిమాయేతర 
రంగస్థల విశేషాల్లోకెళితే నిజంగానే.. 
ఓ బాహుబలిలాంటివాడు. తెలుగునాటక రంగాన ప్రసిద్ధులైన పద్మశ్రీ ఏ.ఆర్‌. కృష్ణ శిష్యుడిగా, 
డా.అక్కినేని అభినయ గురుకుల పాఠశాల వ్యవస్థాపకునిగా, నటునిగా, నాటకదర్శకునిగా, ప్రయోక్తగా ఇలా ఆయన సుదీర్ఘకాలంగా తెలుగు నాటకరంగాన పోషించిన పాత్ర, చేసిన సేవలు శిఖరాయమానం. అయితే, వీటన్నిటికంటే మిన్ననైంది ఆయనలోని మానవీయ గుణం. బతికినంత కాలం ఏదో ఒక గ్రూపునకు పరిమితం కాకుండా.. అందరితో మెలిగారు. ప్రాంతాలకు అతీతంగా శిష్యగణ సంపదనూ
పోగేసుకున్నారాయన. 
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. దీక్షిత్‌ మాష్టారి ఆత్మీయ పలకరింపునకు, కరస్పర్శకు పులకించని రంగస్థల నటులు లేరంటే అతిశయోక్తి కాదేమో! 
ఒకరా.. రెండా.. ఆయన శిష్యగణం వందల్లోనే. 

సంప్రదాయ నాటకరంగాన పౌరాణిక నాటకం, 
సాంఘిక నాటకం కోసం ఆయన చేసిన సేవలు ప్రత్యేకమైనవి, అంతే వైవిధ్యం గలవి.  

పౌరాణిక నాటకరంగ నటుడు గుమ్మడి గోపాలకృష్ణ శ్రీకృష్ణ పాత్రలో దీక్షిత్‌ మాష్టారు దర్శకత్వంలో రూపొందించిన 'శ్రీకృష్ణరాయబారం' తెలుగు రంగస్థలాన ఓ సంచలనమైంది. 
ఆధునిక రంగాలంకరణ, భారీ సెట్టింగులు, 
అంతే భారీ తారాగణంతో నేటితరాన్ని సైతం ఆకర్షించేలా, ఆకట్టుకునేలా రూపొందించిన 
ఆ నాటకం అమెరికా వంటి ప్రవాసవేదికలపైనా తారాడింది. ఇక 'నాన్న సూక్తం' వంటి పలు సాంఘిక నాటకాల్లో దీక్షిత్‌ మాష్టారు చూపించిన వైవిధ్యం 
అంతా ఇంతాకాదు. నాటకం ఒక్కటే కాదు, 
సినిమా రంగానికి చెందిన నటులకు సంభాషణలు (డిక్షన్‌) నేర్పించడంలో ఈ మాష్టారి శిక్షణ పరిశ్రమలో ఓ ప్రత్యేకం. నటుడు పవన్‌కల్యాణ్‌, సునీల్‌, అల్లరి నరేష్‌, ఆర్యన్‌ రాజేష్‌, ఉత్తేజ్‌ వంటి వందలాది నటులు దీక్షిత్‌ నటశిబిరం నుంచి తర్ఫీదు పొందినవారే! 

నటన వరం కాదు
●●●●●●●●●●
"నటన.. అనేది వారసత్వంగా అబ్బే కళ కాదు. 
అదేదో.. జన్మతా వచ్చే బ్రహ్మపదార్థం 
అంతకన్నా కాదు." అనేది దీక్షిత్‌ మాష్టారు 
ఎప్పుడూ నమ్మే, చెప్పే మాట. అందుకే... ఆయన నిత్యజీవితంలో ఎక్కడ ఏ వేదికపైన మాట్లాడినా 
'నటన కాదు వరం.. అది కృషి సాధనల స్వయంవరం' అంటూ మొత్తం నటన అనే కళలోని అంతర్లీన సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పేవారు.
 
ఇదే.. ఆయన జీవితాంతం అనుసరించిన, ఆచరించిన సిద్ధాంతం కూడా.

మాష్టారి గురుకుల శిక్షణనటనపై ఆసక్తి ఉన్న వారి కోసం, వారిలోని ఔత్సాహిక నటనాభిరుచిని 
పరిణితిగా మలచడం కోసం నిత్యం తపనపడేవారు 
దీక్షిత్‌ మాష్టారు. 

అలా సుదీర్ఘకాలంపాటు ఓ యజ్ఞంలా.. నటశిక్షణా రంగంలో అభినయ విద్యను తనదైన శైలిలో, 
శాస్త్రీయంగా రూపొందించి, పదిమందికి పంచిపెట్టినవాడు ఆయన. అందుకే నాటకరంగం ఆయన్ని 'అభినయ విద్యావాచస్పతి'గా 
కొనియాడింది. 

కేవలం నటన పట్ల ఆసక్తి ఉంటే సరిపోదు.. 
అందుకు కావాల్సినవి చాలానే ఉంటాయి. 
అందుకు సమాయత్తమైతేనే.. నటనారంగంలో నిలబడగలరనే ఓ దృక్పథాన్ని విద్యార్థుల మెదళ్ళలో నాటడంలో మాష్టారి ఒరవొడి వేరు. 

అభిరుచి కంటే.. వ్యక్తిగత క్రమశిక్షణ ముఖ్యమంటూ దశాబ్దాలుగా.. గురుకుల పద్ధతిలో నటశిక్షణా శిబిరాలను నిర్వహించి మరెందరికో మార్గదర్శకంగా, 
ఆదర్శంగానూ నిలిచారు. 

నటశిక్షణా సంస్థలతో పెద్దగా అనుబంధం పెట్టుకోవడానికి ఏమాత్రం ఇష్టపడని నటులు 
అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా దీక్షిత్‌ మాష్టారి నటశిక్షణ శిబిరంలో శిక్షణ పొందే విద్యార్థులతో 
తన నటనానుభవాలను పంచుకునేవారు. 
ఇలా డా౹౹ అక్కినేనికే కాదు, దీక్షిత్‌లు మాష్టారి శిష్యులు అంటే చిత్రపరిశ్రమలోనూ ఓ ప్రత్యేకమైన గౌరవం. తేజలాంటి దర్శకులు ఈయన శిష్యుల ప్రదర్శనలు చూశాక ఆడిషన్‌ జరపకుండా పలు సినిమాల్లో నటులుగా తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. 

పిల్లలకీ.. నాటకం కావాలి
●●●●●●●●●●●●●●
మాష్టారంటే.. సినిమా, నాటకరంగంలో చేసిన 
సేవల గురించి మాత్రమే చెప్పుకుంటారు చాలామంది. 
కానీ, ప్రారంభంలో "పిల్లలూ నాటకాల్లోకి రావాలి. 
వారికి నాటకం నేర్పాలి.. అది వారి విద్యా, మనోవికాసానికి ఎంతో దోహద పడుతుందంటూ.."
బాలల కోసం ప్రత్యేక నటశిక్షణా శిబిరాలనూ 
నిర్వహించారు.రచయిత 'పనసాల' నిర్వహణలో 
దశాబ్దకాలం పాటు నడిచిన చిల్డ్రన్‌ ఆర్ట్‌ థియేటర్‌ కార్యక్రమాలకు, బాలల సాహిత్య ముద్రణలకూ 
దీక్షిత్‌ మాష్టారు వెన్నుదన్నుగా నిలిచారు.

పదవులకు పాకులాడని మనిషి
●●●●●●●●●●●●●●●●●
నిజానికి లలితకళల్లో ఏదో ఒక అకాడమీకి ఛైర్మన్‌గానో,సాంస్కృతికశాఖలో ముఖ్యమైన హోదాలోనో ఉండాల్సినంత కళాసేవ చేశారు దీక్షిత్‌ మాష్టారు. 
 
అయితే, మాష్టారు ఏ రోజూ పదవుల కోసం 
ఎవరి చుట్టూ తిరగలేదు. ఎవరి ముందూ చేతులు కట్టి నిలబడలేదు. 

తన వెలుగుతో ఓ వెలుగు వెలుగుతున్న కళాకారులు.. 
ప్రభుత్వంలో వివిధ పదవుల్లో వెలుగుతున్న తీరునూ 
తను చూశారుగానీ, తనకోసం తన కుటుంబం కోసం ఎప్పుడూ ఎవర్నీ అడగలేదు. ఏమీ మిగుల్చుకోలేదు. 
కళను నమ్మారు.. చుట్టూ ఉన్న మనుషుల్నీ 
అంతే నమ్మారు.. 
 
మాష్టారూ.. మీరు అన్నట్టే... 
"నటన కాదు వరం
అది కృషి సాధనల స్వయంవరం'!!
●●●●●
                              @@ గంగాధర్‌ వీర్ల @@🙏

                             -రత్నాకర్, పాత్రికేయులు🙏
                               గారికి 
                               మరియు
                               చిత్రకారులకు
                               ధన్యవాదములతో...🙏

●●●●●●●●●●●●●●●●
🙏క🙏ళా🙏దీ🙏పి🙏క🙏
●●●●●●●●●●●●●●●●