ఆకలిని అక్షరాలతో అలంకరించిన జాఘవా

ఆకలిని అక్షరాలతో అలంకరించిన జాఘవా
౼౼౼ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

గుర్రం జుషువా మరణించి 50 ఏళ్ళు పూర్తయింది. అంతకు ముందు ఒక యాభై ఏళ్ళ నుంచి ఆయన కవిత్వం రాశాడు. ఈ వందేళ్ళల్లో మన దేశంలో చాలా మార్పులొచ్చాయి. పేదరిక నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు పాలకులు. ఎన్ని పథకాలను ప్రవేశపెట్టినా ఇంకా పాత బతుకులు కొనసాగుతూనే వున్నాయి. 'భిక్షవర్షీయసి' లు కనిపిస్తూనే వున్నారు. అందుకే గుర్రం జాషువా మారని నాణెంగా ఇంకా మారిపోలేదు. ఆయన ప్రాసంగికత చెదిరిపోలేదు. ఆకలి, పేదరికం, వివక్ష, అణచివేత, అస్పృశ్యత, అసమానత వంటి అసాంఘిక, అమానవీయ సాంఘిక ఆర్థిక రాజకీయ ధోరణులు కొనసాగినంత కాలం జాషువా కవిగా మనల్ని ప్రశ్నిస్తూనే వుంటాడు.
''కనుపింపరాదన్న కరకుటాకటదూలి
క్షుభితమౌ దీన భిక్షుక చయంబు'' (జాషువా- కాందిశీకుడు)
ఆర్థిక అసమానత, శ్రమ దోపిడి, పాలక నిర్లక్ష్యం వంటి కారణాల చేత ఆకలి వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ కారణాలతోనే తిరుగుబాట్లు కూడా వస్తాయి. బాధ్యత నెరిగిన రాజకీయ వ్యవస్థ ఆకలి లేని సమాజాన్ని నిర్మించుకోవాలి. ఆకలి ఏ దేశానికైనా తలవంపులు తెచ్చే సాంఘికార్థికాంశం. ఆకలి మానవ క్రౌర్యం ఫలితమే తప్ప, విధి రాత కాదు. 
ఆకలి ఎంత పని చేయిస్తుందో శ్రీనాథుడు 'కాశీఖండం'లో చిత్రించాడు. ఇంకా ప్రాచీన తెలుగు కవిత్వంలో అనేక సందర్భాలలో ఆకలి ప్రస్తావన వస్తుంది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఆకలి విస్తృతంగా చిత్రింపబడింది. 
అలా ఆకలిని కావ్య వస్తువుగా చేసిన ఆధునిక కవులలో గుర్రం జాఘవా ఒకరు. ''ఆకలి ముప్పైలు'' ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కాలంలో అభ్యుదయ సాహిత్యం పుట్టింది. జాఘవా 1934 లోనే 'అనాథ' కావ్యం నుంచే ఆకలిని కవిత్వీకరించడం మొదలు బెట్టి అనేక కావ్యాలలో దానిని కొనసాగించాడు.
'అనాథ' కావ్యంలో జాషువా ఒక దళిత పేదరాలి దైన్య జీవితాన్ని చిత్రించాడు. ఆ కావ్యంలో ఆయన వేసిన ప్రశ్నలు ఆకలి రాజ్యంపైన ఎక్కు పెట్టిన బాణాలు.
''ఎవడారగించు నమృతభోజనంబున
కలిసెనో యీలేమ గంజి బువ్వ
ఎవడు వాసముసేయు శృంగార సౌధాన
మునిగెనో యిన్నాది పూరిగుడిసె
ఎవని దేహము మీది ధవళాంబరములలో
ఒదిగెనో యిన్నాతి ముదుక పంచె
ఎవడు దేహము సేర్చు మృదు తల్పములలోన
నక్కెనో యీయమ్మ కుక్కి పడక
వసుధ పైనున్న భోగసర్వస్వమునకు
స్వామితవహించి మనుజుండు ప్రభవమందు
ఎవడపహరించె? నేమయ్యె నీమెసుఖము?
కలుషమెరుగని దీని కొడుకుల సుఖంబు?'
(జాషువా :అనాథ)
ఈ కావ్యంలో పేదరికం, అస్పృశ్యత కలిసి ఒక దళిత కుటుంబాన్ని ఆకలి కూపంగా మార్చిన తీరును జాఘవా వాస్తవికంగా ఆవిష్కరించాడు. ఆర్థిక అసమానత అతి సహజమైనదిగా భావించే సామాజిక సూత్రాన్ని కవి ''సుఖ మొక్కచోట కడగండ్లొక చోటగదా వసుంధరన్‌'' అని అధిక్షేపించాడు.
'గబ్బిలం' కావ్యంలో ఒక దళిత అభాగ్యుని మూర్తిని కళ్ళకు కట్టించాడు జాఘవా. ఆయన కూడా ఆకలి మూర్తే. 'పరమ గర్భ దరిద్రుడు' అన్నాడు జాఘవా. అతని శ్రమ ఔన్నత్యాన్ని,అతని జీవిత పరాయీకరణను ఒక చిన్న పద్యంలో ఆవిష్కరించాడు.
'వాని రెక్కల కష్టంబు లేనినాడు
సస్యరమ పండి పులకింప సంశయించు
వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు
భోజనము బెట్టు: వానికి భుక్తి లేదు'
ఈ కావ్యంలోనే జాఘవా 'విగ్రహాల పెళ్ళిళ్ళు చెయడానికి వందలు, వేలు ఖర్చు పెడతారుగాని, పేదల పాత్రలలో మెతుకు విదల్చరు' అని దెప్పి పొడిచాడు. ఆకలిని శాశ్వతం చేయడం కోసం కర్మ సిద్ధాంతాన్ని సృష్టించిన ఒకనాటి దుర్మార్గాన్ని కూడా జాషువా ఎత్తి చూపాడు.
'కర్మ సిద్ధాంతమున నోరు కట్టివేసి
స్వార్థ లోలురు నాభుక్తి ననుభవింత్రు''
ఆకలి ముప్పైలలో ప్రజా దృక్పథంతో కావ్య రచన చేసిన జాఘవా సమాజంలో ధనిక, పేద వర్గాలు వుండడాన్ని అనేక పర్యాయాలు ప్రస్తావించాడు. అరుంథతి తనయుడు 'గబ్బిలం'లో ఢిల్లీ సుల్తానుల వైభవాన్ని చెప్తూ నిజ రాష్ట్రం బాకటదూల పేదల నోరూర భుజించినారచట ముక్తారత్న పాంత్రంబులన్‌' అన్నాడు.
'కాందిశీకుడు' కావ్యంలో రెండో ప్రపంచ యుద్ధకాలంలో బర్మా నుంచి బైటకు వచ్చిన యోధునికి, శ్మశానంలో కాలికి తగిలిన ఒక బౌద్ధ భిక్షువు కపాలం, అక్కడ వుండే పుర్రెలు ఎవరెవరివో వివరిస్తాడు. అందులో ఒకటి
''బిట్టు టాకటి సొదకు నగ్గంబైన కడుపేదరాలి కంకాళయష్టి' అని ఆకలి చావును ప్రస్తావించాడు జాషువా. 
అలాగే
'వెలితిచే శుష్కించు పేదసాదల డొక్క
ముప్పూటలనువుగా పూడుచోటు' అని
పరలోకాన్ని వర్ణించాడు. ఈ కావ్యంలోనే ఆకలి లేకుండా వుండాలంటే సంపద కేంద్రీకృతం కారాదని చెప్పాడు జాషువా. సంపద కొందరి చేతుల్లో ఉండిపోవడమా సకల సమస్యలకూ మూలమని జాషువ అభిప్రాయపడ్డాడు. 
అందుకే 'ధనము ధాన్యంబు నొకని పెత్తనము క్రింద
కట్టువడి వ్యర్థముగ తుప్పు పట్టరాదు' అన్నాడు.
'ఓటు' అనే కవితలో ఎన్నికల సమయంలో ఆకలితో బాధ పడే పేద ప్రజల ఓట్లను డబ్బుతో కొనడాన్ని జాషువా వ్యతిరేకించాడు. 'భిక్ష' అనే కవితలో కృష్ణానది మీద ప్రాజెక్టులు కట్టి ప్రజల ఆకలిని నిర్మూలించాలన్నాడు.
పేదరికం, అస్పృశ్యత అన్నవి తన గురువులని చెప్పిన జాఘవా 'స్పప్న కథ' కావ్యంలో పేదరికం, ఆకలి ఎలాంటివో చిత్రించాడు. ఆ కావ్యంలో ఒక పేద స్త్రీ భిక్షమెత్తుతుంది. అప్పుడు జరుగుబాటున్న కుటుంబాల స్త్రీలు ఎలా ప్రవర్తస్తారో వర్ణించాడు.
'ఒక లేమ కసరి కుక్కకుబోలి పులిసిన
పిడికెడెంగిలి కూడు విసిరివేయ'
ఆ స్త్రీ ఒక పూట తిని, మరో పూట పస్తుండి బతుకుతూ వుంటుంది. ఆమె పేదరికం ఎలాంటిదో కవి చెప్పాడు.
'పేదరికము పెద్ద వింత చదువుల బడి
దానిలోన లజ్జగానబడదు
ఉదరమొజ్జయగుచు నోరంతప్రొద్దులు
ఓర్మి విద్దె నేర్పుచుండు''
పేదరికం, అంటరానితనం తనకు సహనం నేర్పాయని చెప్పుకున్న జాషువా వ్యక్తిత్వం ఇక్కడ ప్రతిబింబిస్తున్నది.
గుర్రం జుషువా మరణించి 50 ఏళ్ళు పూర్తయింది. అంతకు ముందు ఒక యాభై ఏళ్ళ నుంచి ఆయన కవిత్వం రాశాడు. ఈ వందేళ్ళల్లో మన దేశంలో చాలా మార్పులొచ్చాయి. పేదరిక నిర్మూలన కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు పాలకులు. పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు కొంత వరకు ప్రయోజనాన్ని సాధించాయి. ఆకలి తగ్గింది. అయితే తగ్గవలసినంతగా తగ్గలేదు. పేదరిక నిర్మూలనా కార్యక్రమం ఒకప్పుడు ఎగతాళికి కూడా గురైంది. 'గరీబీ హఠావో' కాదు 'గరీబివోంకీ హఠావో'' అన్నారు. పేదరిక నిర్మూలన కాదు. పేదల నిర్మూలన అని అర్థం.
ఎన్ని పథకాలను ప్రవేశపెట్టినా ఇంకా పాత బతుకులు కొనసాగుతూనే వున్నాయి. 'భిక్షవర్షీయసి' లు కనిపిస్తూనే వున్నారు.
''హెచ్చిన యాకట బ్రతికియు
చచ్చిన గతి చూపరుల కసహ్యముగ బురిన్‌
బిచ్చం బెత్తెడు ననుగని
పిచ్చిదనుచు బేరుపెట్టి పిలిచిరి ఆ పౌరుల్‌''
(జాషువా : స్వప్న కథ)
ఇలాంటి సన్నివేశాలు మన సమాజంలో ఇంకా కనిపిస్తూనే వుంటాయి. అందుకే గుర్రం జాషువా మారని నాణెంగా ఇంకా మారిపోలేదు. ఆయన ప్రాసంగికత చెదిరిపోలేదు. ఆకలి, పేదరికం, వివక్ష, అణచివేత, అస్పృశ్యత, అసమానత వంటి అసాంఘిక, అమానవీయ సాంఘిక ఆర్థిక రాజకీయ ధోరణులు కొనసాగినంత కాలం జాషువా కవిగా మనల్ని ప్రశ్నిస్తూనే వుంటాడు.
 /వ్యాసకర్త ప్రజాశక్తి బుకహేౌస్‌ గౌరవ సంపాదకులు