తెనాలి లో ఘనంగా జాతీయ జెండా పండుగ ...

 ప్యారిస్ లో వాడవాడలా జాతీయ జెండా పండుగ ...


టాలెంట్ ఎక్స్ ప్రెస్:
కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా దేశం మొత్తం పండుగలా జరుపుకునే రోజే మన ఈ స్వాతంత్ర్య దినోత్సవం. ఆదివారం 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆంధ్రాప్యారిస్ గా పేరుగాంచిన తెనాలి పట్టణం లో వాడ వాడలా ఘనంగా జరిగాయి. వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో, రాజకీయ పార్టీల కార్యాలయాలలో దేశభక్తి మరియు జాతీయ భావాలతో మువ్వన్నెల త్రివర్ణ పతాకాలు ఆవిష్కృతమయాయి. పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొని ఉంది.

న్యాయస్థానప్రాంగణంలో:
కొత్తపేటలోని న్యాయస్థానాల ప్రాంగణంలో 75వ  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పదకొండవ అదనపు ప్రిన్సిపల్ జిల్లా న్యాయమూర్తి జి.మాలతి మరియు తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్రీధర్ లు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఎన్ సి సి క్యాడెట్ల గౌరవ వందనాన్ని స్వీకరించారు. న్యాయదేవత విగ్రహానికి పూలమాలలు వేశారు. సీనియర్ సివిల్ న్యాయమూర్తులు గీత, శ్రీరామచంద్రుడు, జూనియర్ సివిల్ న్యాయమూర్తులు రహమతుల్లా, అబ్దుల్ షరీఫ్,సీత మరియు బార్ అసోసియేషన్ కార్యదర్శి విజయ్ కుమార్, కార్యవర్గ సభ్యులు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

సబ్ కలెక్టర్ కార్యాలయం:
సబ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా జాతీయ జెండాను ఆవిష్కరించారు. చిన్నతనం నుండే పిల్లలలో జాతీయ భావం దేశభక్తి పెంపొందించేందుకు పెద్దలుగా మనం కృషి చేసి వారిని బాధ్యత కలిగిన భావి పౌరులుగా తీర్చి దిద్దాలని అన్నారు. హాజరైన విద్యార్థులు వందేమాతరం, జనగణమన గీతాలను ఆలపించారు. సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. తెనాలి తహసిల్దార్ రవిబాబు, మండల విద్యాశాఖాధికారి మేకల లక్ష్మీనారాయణ, పలువురు రెవెన్యూ సిబ్బంది, ఆరాధ్యుల కన్నా, కే. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

పురపాలకసంఘకార్యాలయం:
పురపాలక సంఘ కార్యాలయం లో చైర్ పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీం జాతీయ జెండాను ఆవిష్కరించారు.నాటి త్యాగమూర్తుల నిస్వార్ధ త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్య స్వేచ్ఛావాయువులు అని ఖాలేదా నసీం పేర్కొన్నారు. నేటి తరాన్ని సన్మార్గం వైపు నడిపే బాధ్యత తల్లిదండ్రుల దేనని అన్నారు. కమిషనర్ ఎం జశ్వంతరావు, అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, మేనేజర్, కౌన్సిలర్లు, పలు శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

వైఎస్ఆర్ సీపీ కార్యాలయం:
వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. బాపూజీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని కొనియాడారు. నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛావాయువులు వీరుల త్యాగఫలమేనని, భావితరాలు లాభపడే లా మనం నడుచుకోవాలని అన్నారు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు,నాయకులు కౌన్సిలర్లు,పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం:
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం కాంగ్రెస్ పార్టీ తెచ్చిందేనన్నారు. నవ భారతాన్ని నిర్మాణం చేసినా, దేశంలో కరువు లేకుండా చేసినా అది కాంగ్రెస్ పార్టీ ఘనతేనని పేర్కొన్నారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగ సూర్య శశిధర్ రావు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో:
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శాంతి మార్గం ద్వారా దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత ప్రపంచంలో ఒక్క భారతదేశానికే దక్కిందని పేర్కొన్నారు. అనంతరం స్థానిక రణరంగ చౌక్ వద్ద నున్న అమరవీరుల స్థూపాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి క్విట్ ఇండియా ఉద్యమం లో అసువులు బాసిన వీరులకు ఘన నివాళులు అర్పించారు.పలువురు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.