ఆటోలో టాయ్ లెట్ -ప్రపంచం దృష్టికి ఆకర్షిస్తున్న హైదరాబాద్ మహిళ

ఆటోలో టాయ్ లెట్
 -ప్రపంచం దృష్టికి ఆకర్షిస్తున్న హైదరాబాద్ మహిళ

ఆటో అంటే ప్యాసింజర్స్ కోసం వాడటం చూశాం.. చెత్త తీసుకెళ్లే ఆటో చూశాం.. ట్రాన్స్ పోర్ట్ ఆటో చూశాం.. బిజినెస్ కోసం ఉపయోగించటం చూశాం.. ఆటోలో టాయ్ లెట్ ఏర్పాటు చేయటం ఎప్పుడైనా చూశాం.. ఇప్పటి వరకు చూడలేదు.. ఇప్పుడు దీన్ని సాధ్యం చేసింది హైదరాబాద్ కు చెందిన మహిళ. షీ టాయ్ లెట్ పేరుతో.. ఆటోలో క్లీన్ టాయ్ లెట్ ఏర్పాటు చేసి హైదరాబాద్ నగర వీధుల్లో తిరుగుతున్నాయి ఇప్పుడు. ప్రపంచంలోనే ఫస్ట్ టైం.. సృజనాత్మకంగా తయారైన ఈ టాయ్ లెట్ ఆటో విశేషాలు తెలుసుకుందాం…
సుష్మ కల్లెంపూడి అనే మహిళ.. 2017లో అమెరికా నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చింది. హైదరాబాద్ లో మహిళలు బయటకు వెళ్లినప్పుడు టాయ్ లెట్ కోసం ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆవిష్కరణ చేసింది. ఓ ఆటోను మొబైల్ షీ టాయ్ లెట్ మార్చింది. ఈ ఆటోను జీహెచ్ఎంసీ, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చూపించింది. మొబైల్ షీ టాయ్ లెట్ వల్ల రద్దీ ప్రాంతాల్లో మహిళలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని.. పర్యావరణ హితంగా పని చేస్తాయని గుర్తించిన ప్రభుత్వాలు.. ఇలాంటి ఆటోలను మరిన్ని ఏర్పాటు చేయటానికి ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో 25 ఆటోలు వీధుల్లో తిరుగుతున్నాయి.
ఒక్కో ఆటో తయారీకి 4 లక్షల రూపాయలు ఖర్చవుతుందని వివరించారు సుష్మ. మొబైల్ షీ ఆటోలో 100 లీటర్ల కెపాసిటీ వాటర్ ట్యాంక్, అద్దం, హ్యాంగర్, వాష్ బేసిన్, ఫ్లెష్, డ్రైనేజ్ సిస్టమ్ ఉంటాయి. అదే విధంగా చంటి పిల్లలకు డైపర్స్ మార్చుకోవటానికి అనువుగా స్థలం ఉంది. మహిళలకు అత్యవసరంగా కావాల్సిన శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా ఉంటాయి. శానిటరీ న్యాప్కిన్స్, సెల్ ఫోన్ ఛార్జింగ్ పాయింట్ ఉన్నాయి. ప్రతి ఆటోకు జీపీఎస్ కనెక్టెవిటీ ఉంది.
పాత ఆటోలను ఈ విధంగా మార్చటం జరిగిందని.. మంచి స్పందన వస్తుంది అంటున్నారు సృష్టి కర్త సుష్మ. స్వచ్ఛభారత్ తో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహం అందిస్తే.. వందలాది వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ మహిళ క్రియేటివిటీకి ప్రపంచం మొత్తం ఔరా అంటోంది. చాలా దేశాలు ఈ ఆలోచనను స్వాగతిస్తున్నాయి.