కళాకారులుగా జన్మించరు, తయారు చేయబడతారు

కళాకారులుగా జన్మించరు, తయారు చేయబడతారు 
  -సినీ నటి డా. శ్రీజ సాదినేని

కళాకారులు అంటూ స్వతహాగా తల్లి గర్భంలో నుండి వచ్చేయరని, సరైన గురువు చేతిలో పడితే మామూలు మనుషులు సైతం మహానుభావులు కాగలరు అని ప్రముఖ సినీ,టీవీ,రంగస్థల నటి డా. శ్రీజ సాదినేని తెలిపారు.
ఆదర్శ కళా నిలయం 25వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాదులోని నాంపల్లిలో గల పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోనీ నందమూరి తారక రామారావు ఆడిటోరియంలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ ఉత్సవాలలో ఆమె పాల్గొన్నారు. నటిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, యాక్టింగ్ ఫ్యాకల్టీ గా, యాంకర్ గా.. విభిన్న రంగాలలో విశేష ప్రతిభ కనబరుస్తూ కళారంగంలో ధృవ తారగా వెలుగొందుతున్న ఆమెను ఆదర్శ కళానిలయం సంస్థ ఆదర్శ కళా ప్రతిభా అవార్డుతో ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా డా.శ్రీజ సాదినేని మీడియాతో మాట్లాడారు. చిన్నతంలోనే హరికథా కళాకారిణిగా కళారంగం లోకి ప్రవేశించిన తనకు తొలి గురువు తన తండ్రి,కీ. శే. సాదినేని నాగేశ్వర రావు అని, ఆ తర్వాత సంగీతంలో, నాట్యంలో, నటనలో, రచనలో, దర్శకత్వంలో ఎందరో గురువులు ఎన్నో మెళకువలు నేర్పారని, ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణమైన తమ గురువులని మరోసారి గుర్తు చేసుకుని వారికి నమస్సులు తెలిపారు.
2003 నుండి శ్రీ జయా ఆర్ట్స్ మరియు శ్రీజా మీడియా అకాడమీ సంస్థలను స్థాపించి,. ఎంతో మంది విద్యార్థులకు యాక్టింగ్, యాంకరింగ్, న్యూస్ రీడింగ్, డబ్బింగ్, వాయిస్ ఓవర్, స్టోరీ,స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్ రైటింగ్, డైరెక్షన్ వంటి కోర్సులతో పాటు థియేటర్ ఆర్ట్స్ కోర్సులో కూడా శిక్షణ ఇచ్చి  మీడియా,టీవీ, రంగస్థలం మరియు సినిమాలలో అవకాశాలు ఇప్పించిన తాను గురువుగా ఎంతో గర్వ పడుతున్నాను అని ఈ అవార్డు కూడా ఆ విభాగంలో వచ్చినందుకు సంతోష పడుతున్నాను అని శ్రీజ తెలిపారు.ఈ కార్యక్రమంలో సినీ ,టీవీ నటులు 
శ్రీ కోట శంకర్ రావు, కెప్టెన్ చౌదరి, ఆదేష్ రవి, అరుణా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.