విజ్ఞాన్స్‌లో సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ప్రారంభం

విజ్ఞాన్స్‌లో సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ప్రారంభం 

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో బుధవారం సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ప్రారంభం చేసామని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్లాంట్‌ను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీసీ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ఈ ప్లాంట్‌ను సివిల్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో కోటి రూపాయల వ్యయంతో ప్రతిరోజు 7 లక్షల లీటర్ల వ్యర్ధమైన నీటిని కన్‌స్ట్రక్టెడ్‌ వెట్‌ ల్యాండ్‌ టెక్నాలజీతో తక్కువ విద్యుత్‌ను వినియోగించి శుద్ధి చేస్తామని తెలిపారు. ఈ ప్లాంట్‌ ద్వారా వ్యర్ధ నీటిని గ్రీన్‌ టెక్నాలజీ సాయంతో శుద్ధి చేయడం వలన పర్యావరణ హితంతో కూడిన జల వనరులను ఆదాచేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వ్యర్ధ నీటిని శుద్ధిచేయడానికి ఈ గ్రీన్‌ టెక్నాలజీను వినియోగిస్తున్న మొట్టమొదటి యూనివర్సిటీ తమదేనని తెలియజేసారు. ఈ టెక్నాలజీ ద్వారా శుద్ధి చేసిన నీటిని గార్డెనింగ్, సామాన్య అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చన్నారు. గ్రీన్‌ టెక్నాలజీ ముఖ్య ఉద్దేశ్యమైన 3 ఆర్‌( రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్‌)లను పాటించడమే ఈ ప్లాంట్‌ ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ ప్లాంట్‌ ద్వారా స్వచ్ఛ భారత్‌ రెండో దశలో(2020–2025) ప్రధానంశమైన నీటి శుద్ధీకరణ ప్లాంటు ఏర్పాటు సఫలీకృతం కాబోతుందన్నారు.