మన రాజ్యాంగం మహోన్నతం

మన రాజ్యాంగం మహోన్నతం

  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్‌ యూ.దుర్గా ప్రసాద్‌రావు

  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా నేషనల్‌ లా డే వేడుకలు

ప్రపంచ దేశాలలోని రాజ్యాంగాలలో మన దేశ రాజ్యాంగం మహోన్నతమైనదని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్‌ యూ.దుర్గా ప్రసాద్‌రావు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లా డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో నేషనల్‌ లా డేను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్‌ యూ.దుర్గా ప్రసాద్‌రావు మాట్లాడుతూ విద్యార్థులు న్యాయ శాస్త్రాన్ని అభ్యసించి సమాజంలోని ప్రతి ఒక్కరికీ న్యాయం దక్కేలా కృషి చేయాలన్నారు. న్యాయశాస్త్రాన్ని అభ్యసించే విద్యార్థులు ప్రతి రోజు కొత్త విషయాలను, సరికొత్త టెక్నాలజీలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు.  భారత పౌరులు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలను కాపాడుటకు రాజ్యాంగంలో సమానత్వపు హక్కు, వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్య్రపు హక్కు, దోపిడీను నిరోధించే హక్కు, మత స్వాతంత్య్రపు హక్కు, విద్య, సాంస్కృతిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచి వీటి పరిరక్షణ బాధ్యతలను న్యాయస్థానాలకు అప్పగించిందన్నారు.  విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్స్, స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి అన్ని రంగాలు కూడా ప్రైవైటేజేషన్‌ చెందుతుండటం వలన ప్రతి ఒక్క కంపెనీ వారికి సంబంధించిన క్లైంట్లతో అగ్రిమెంట్లు, చట్టాలు చేసుకుంటున్నాయన్నారు. ఈ నేపథ్యంలో న్యాయశాస్త్రం చదివిన విద్యార్థులకు విపరీతమైన డిమాండ్‌ పెరిగిందన్నారు. న్యాయశాస్త్రమంటే కోర్టులో వాదన చేసేవారు మాత్రమే కాదని ప్రతి పరిశ్రమ, కంపెనీలలో న్యాయశాస్త్రం చదివిన లీగల్‌ డిపార్ట్‌మెంట్‌ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.