తెలుగు నాటక ప్రచురణలో విప్లవం

తెలుగు నాటక ప్రచురణలో విప్లవం

✍️ ప్రొఫెసర్ రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

ఆచార్య ఆత్రేయ మరణించినప్పుడు తెలుగులో నాటకం ఎందుకు బలహీనపడిందంటూ సుదీర్ఘమైన చర్చ జరిగింది. అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమైనాయి. నాటకాలు బలంగా రావడం లేదనీ, నాటకాలకు ప్రోత్సాహం లేదనీ, సినిమా ఆధిపత్యం ఎక్కువ కావడమనీ - ఇలా రకరకాల అభిప్రాయాలు వెలువడ్డాయి. 

ఇదలా ఉంచితే, తెలుగు సమాజంలో పఠన ప్రక్రియలకున్న ప్రాధాన్యం దృశ్య ప్రక్రియ - నాటకానికి లేదు. నాటక రచన తక్కిన ప్రక్రియలతో పోలిస్తే సంఖ్యలో పరిమితమే. మిగతా ప్రక్రియలకు రచన, ప్రచురణ అనే రెండు పనులే. నాటకానికి రచన, ప్రచురణ (అంతా కాకపోయినా) ప్రదర్శన అనే మూడో పని ఉంది. ప్రదర్శించకపోతే నాటకం ఎందుకు? అనే ప్రశ్న కలుగుతుంది. తెలుగులో నాటకాలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. వచ్చే నాటకాలను నాటక సంస్థలు పట్టించు కున్నంతగా సాహిత్య విమర్శకులు పట్టించుకుంటున్నారా? అన్నది ప్రశ్న.

తెలుగు నాటకాలు, నాటికలు, ఏకాంకికలు సంకలనాలుగా వచ్చింది చాలా తక్కువ. నాటికలు వచ్చాయి గానీ, సమగ్ర నాటకాలు సంపుటాలుగా సంకలనం కాలేదు. ఇదొక పెద్ద లోపం. ఆ లోపాన్ని సరిదిద్దుతూ వల్లూరు శివప్రసాద్‌, గంగోత్రి సాయి సంపాదకులుగా వంద నాటకాలను ఆరు సంకలనాలు గా తీసుకువచ్చారు. ఈ సంకలనాల ప్రచురణ తెలుగు నాటక ప్రచురణలో విప్లవమే.

తెలుగు నాటక ప్రియులకు పఠనవిందు పెట్టారు సంపాదకులు. సాహిత్య విమర్శకులకు చేతినిండా పని కూడా పెట్టారు. ఈ ఆరు సంకలనాలు చదివితే తెలుగులో నాటకం మిగతా ప్రక్రియలకన్నా వెనుకబడలేదు అనే అభిప్రాయం తప్పకుండా కలుగుతుంది. తెలుగు సమాజ పరిణామాలతో పాటు తెలుగు నాటకం తాను మారుతూ, సమాజం మారడానికి, సమాజాన్ని మార్చడానికి కృషి చేస్తున్నదని ఈ సంకలనాలు రుజువు చేస్తున్నాయి. ఈ వంద నాటకాలలోనూ మనకు ఒక రాజకీయ స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది. అనేక భావజాలాలకు, అనేక సామాజిక ఉద్యమాలకు స్పందించడం, ఎప్పటికప్పడు సామాజిక వాస్తవి కతను విమర్శనాత్మకంగా ప్రతిబింబించడం ఈ నాటకాల రాజకీయ స్వభావం.

ఆధునిక తెలుగు సాహిత్య ప్రక్రియలలో మొదట సాహిత్య విమర్శ పుట్టింది. ఆ తర్వాత పుట్టింది నాటకమే. కవిత్వం, నవల, కథానిక ఆ తర్వాత పుట్టాయి. 1860లో పుట్టిన తెలుగు నాటకానికి 160 ఏళ్ళ చరిత్ర ఉంది. సంపాదకులు 1880 - 2020 మధ్య 140 ఏళ్ళలో వచ్చిన నాటకాలలోంచి 100 ప్రసిద్ధ నాటకాలను ఎన్నిక చేసి ప్రచురించారు. ఈ వంద నాటకాలు నిస్సందేహంగా ఒకటిన్నర శతాబ్దం సమాజ చరిత్ర రచనకు విశ్వసనీయమైన ఆధారాలుగా నిలుస్తాయి. ఎన్నో సంవత్సరాలుగా కృషిచేసి ఈ సంకలనాలు చేసిన వల్లూరు, గంగోత్రిలకు అభినందనలు. ఈ ప్రచురణలో సహకరించిన అరవింద ఆర్ట్స్‌, తానా సంస్థలకు కృతజ్ఞతలు.

ఈ సంకలనాల్లో తొలి నాటకం 1880 నాటి వావిలాల వాసుదేవశాస్త్రి 'నందకరాజ్యము'. చివరిది గిడుతూరి సూర్యం 'కన్నబిడ్డలు'. మొదటిది ఒక కులంలోని రెండు శాఖల మధ్య తగాదాలను చిత్రించగా, చివరిది ఒకే కుటుంబంలో కన్నవాళ్ళకు, పిల్లలకు మధ్య సంఘర్షణను చిత్రించింది. ఈ వంద నాటకాల్లోనూ మన సమాజంలో సంభవిస్తున్న అనేక రకాల సంఘర్షణే వస్తువు. పెత్తందార్లకు పేదలకు, ఆధిపత్య కులాలకు అణచివేయబడ్డ కులాలకు, పురుషులకూ స్త్రీలకూ, పాలకులకు పాలితులకూ, శాస్త్రీయతకు మౌఢ్యానికీ - వంటి ద్వంద్వాల మధ్య జరిగిన జరుగుతున్న సంఘర్షణను అధిక సంఖ్యలో నాటకాలు చిత్రించాయి. మన సమాజంలోని ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సాంస్క ృతిక, తాత్విక పార్శ్వాలను ఈ నాటకాలు వాస్తవికంగా ఆవిష్కరిస్తున్నాయి.

ఆధునిక భారతదేశ చరిత్రలో సంఘ సంస్కరణోద్యమం తొలి ఉద్యమం. మూఢ విశ్వాసాలను, మూఢాచారాలను ఈ ఉద్యమం నిర్మూలించే ప్రయత్నం చేసింది. దాని ప్రభావంతో వచ్చిన నాటకాల్లో వృద్ధవివాహం వల్ల కలిగే అనర్థాలను ప్రతిబింబించింది పానుగంటి వారి 'వృద్ధవివాహం'. ఆ తర్వాత వచ్చింది భారత స్వాతంత్య్రోద్యమం. ఈ ఉద్యమాన్ని ప్రతిబింబిస్తూ దామరాజు పుండరీకాక్షుని 'పాంచాల పరాభవము', కాళ్ళకూరి నారాయణరావు 'మధుసేవ' వంటి నాటకాలు వచ్చాయి. స్వాతంత్య్రోద్యమ కాలంలోనే ఆంధ్రోద్యమం, తెలంగాణా రైతాంగ పోరాటం కొనసాగాయి. వాటిని ప్రతిబింబిస్తూ గుళ్ళపల్లి నారాయణమూర్తి 'ఆంధ్రజ్యోతి', వేదాంతకవి 'తెనుగుతల్లి', సుంకర వాసిరెడ్డి 'ముందడుగు' వంటి నాటకాలు వచ్చాయి.

భారతీయ సమాజాన్ని చిరకాలంగా పట్టిపీడిస్తున్నవి స్త్రీ సమస్య, కుల సమస్య. ఈ వంద నాటకాల్లో కుల సమస్యలో అత్యంత ప్రధానమైన దళిత జీవితాన్ని ప్రతిబింబించేవి బోయి భీమన్న 'పాలేరు', నగ్నముని 'మాలపల్లి', అరవేటి శ్రీనివాసులు 'ఈ కథ
మార్చండి', పాటిబండ్ల ఆనందరావు 'నిషిద్ధాక్షరి', పెద్దింటి 'తెగారం'. స్త్రీపురుష సంబంధాల గురించి, ప్రత్యేకించి స్త్రీల బాధల గురించి తెలుగు నాటకం ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు ఈ సంకలనాలు రుజువు చేస్తున్నాయి. స్త్రీ పునర్వివాహాన్ని సమర్థిస్తూ బళ్ళారి రాఘవ 'సరిపడని సంగతులు' రాశారు. స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రతిపాదిస్తూ ఒద్దిరాజు సోదరులు 'మగ సంసారం' రాశారు. మల్లాది అవధాని 'గాలివాన', మల్లాది వెంకటకృష్ణశర్మ 'స్త్రీ', కళారంగంలో స్త్రీల స్థితిని గురించి గన్పిశెట్టి 'బలే పెళ్ళి', భర్తల అనుమాన రోగానికి బలయ్యే స్త్రీల గురించి అవసరాల సూర్యారావు 'పంజరం', పనికిరాని పోకిరి భర్తతో హింస భరించే భార్యను గురించి దాసం గోపాలకృష్ణ 'చిల్లరకొట్టు చిట్టెమ్మ', పురుషాధిక్యతలోని అమానుషత్వాన్ని ఇసుకపల్లి మోహనరావు 'తర్జని', వంటి నాటకాలు రాశారు.
భారతీయ గ్రామాల్లోని పెత్తందారీ దుర్మార్గాలను ఖండిస్తూ అనేక నాటకాలు వచ్చాయి. కోడూరు అచ్చయ్య 'పెత్తందారు', కణ్వశ్రీ 'ఇదా ప్రపంచం', గ్రామాల రాజకీయ వ్యవస్థ మీద చెరబండరాజు 'గ్రామాలు మేల్కొంటున్నాయి', మధ్య తరగతి రైతుల మీద పెత్తందార్ల దౌర్జన్యాలను పూసల 'మండువా లోగిలి', గ్రామీణ రాజకీయాల్లో సంపన్నుల ఆగడాలను పి.వి. రమణ 'చలిచీమలు' మొదలైన నాటకాల్లో విమర్శనాత్మకంగా ప్రతిబింబించారు. 'సైసై జోడెడ్లా బండి' (కందిమళ్ల) వంటి రైతు చైతన్య ప్రబోధాత్మక నాటకాలు మనల్ని ఆకర్షిస్తాయి.

రాజకీయరంగంలోని అనారోగ్యకర ధోరణులను చాలా నాటకాలు ఎండగట్టాయి. కొర్రపాటి గంగాధరరావు 'యథారాజా తథా ప్రజా', కె.వి. రమణారెడ్డి, డా|| వేణుల 'అన్నపూర్ణ', రావిశాస్త్రి 'నిజం', ఎన్‌.ఆర్‌. నంది 'మరో మొహెంజొదారో', వడ్లమూడి వారి 'శ్రీరంగనీతులు', పరుచూరి వెంకటేశ్వరరావు 'సమాధి కడుతున్నాం చందాలివ్వండి', అనంత్‌ హృదయరాజ్‌ 'అంఅ:', డి.విజయభాస్కర్‌ 'కుర్చీ' మొదలైన అనేక నాటకాలు ఈ సంకలనాల్లో ఉన్నాయి. ఈ సంకలనాల్లో మహాత్మాగాంధీ, అల్లూరి సీతారామరాజు, కందుకూరి వీరేశలింగం, సర్దార్‌ పాపన్న, బుడ్డా వెంగళరెడ్డి, టంగుటూరి ప్రకాశం, కన్నెగంటి హనుమంతు వంటి నాయకులు, ఉద్యమకారుల మీద కూడా నాటకాలుండడం ఆసక్తి గొలిపే విషయం.

కుటుంబ సంబంధాల్లో మార్పులు వచ్చి వృద్ధులు, తల్లిదండ్రులు నిరాదరణకు గురవుతున్న వాస్తవాన్ని 'వానప్రస్థం' (వల్లూరు), 'జీవితార్థం' (కావూరి) వంటి నాటకాలు ప్రదర్శించాయి. నిజానికి ఈ వంద నాటకాల్లో అభ్యుదయ సాహిత్యోద్యమ ప్రభావం బలంగా కనిపిస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థను నిరసిస్తూ నాజర్‌ 'ఆసామి', కె.చిరంజీవి 'నీలిదీపాలు', పినిశెట్టి 'పల్లెపడుచు' మొదలైన నాటకాలు అభ్యుదయ భావజాలంతో, సామాజిక పరివర్తన లక్ష్యంతో రాయబడ్డాయి. ఆదివాసీల జీవితం వస్తువుగా వచ్చిన 'తూర్పురేఖలు' (అత్తిలి కృష్ణారావు), చేనేత కార్మికుల జీవితం వస్తువుగా వచ్చిన 'వస్త్ర నిర్మాత' (పింజల సోమశేఖరరావు) వంటివి కూడా ఇందులో భాగాలు. మధ్య తరగతి జీవితాలను చిత్రిస్తూ వచ్చిన ఎన్‌.జి.వొ. (ఆత్రేయ) మొదలైనవి ఈ సంకలనాల్లో అనేకం ఉన్నాయి. ఇంకా అనేక సామాజికాంశాలు వస్తువులుగా ఈ నాటకాల్లో మనకు దర్శనమిస్తాయి. మానవ మనస్తత్వ లోగిళ్ళనూ గాలించిన నాటకాలున్నాయి.

'ముందడుగు' వంటి నాటకాలు పాలకుల నిషేధానికి గురవ్వడం తెలుగు నాటకం సాధించిన విజయానికి సంకేతం. ఈ నాటకాల్లో ఆంధ్రనాటక కళాపరిషత్తు వంటి సంస్థల ద్వారా పురస్కారాలు, బహుమతులు పొందినవి ఎక్కువ. కుందుర్తి ఆంజనేయులు 'ఆశ' నాటకం వచన కవిత రూపంలో వచ్చింది. అనిసెట్టి సుబ్బారావు, ప్రేక్షకులను కూడా పాత్రలుగా చేస్తూ 'గాలిమేడలు' నాటకం రాయటం ఒక మంచి ప్రయోగం.

ఈ సంకలనాల్లోని నాటకాలు పొందిన పరివర్తనలు ఆసక్తికరంగా ఉన్నాయి. నగ్నముని 'మాలపల్లి' నాటకం ఉన్నవ 'మాలపల్లి' నవలకు పరివర్తనే, కొ.కు రాసిన 'బకాసుర' కథే తారక రామారావు 'బకాసుర' నాటకం. కామేశ్వరరావు 'ఈ మంటలార్పండి' నాటకం 'వందేమాతరం' సినిమాగా వచ్చింది. పరుచూరి వెంకటేశ్వరరావు 'సమాధి కడుతున్నాం చందాలివ్వండి' నాటకం, అదే పేరుతో సినిమాగా వచ్చింది. ఎల్‌.బి.శ్రీరామ్‌ 'ఒంటెద్దుబండి' నాటకం, 'అమ్మో ఒకటో తారీఖు' పేరుతో సినిమాగా వచ్చింది. దాసం గోపాలకృష్ణ 'చిల్లరకొట్టు చిట్టెమ్మ', రాచకొండ వారి 'నిజం' అవే పేర్లతో చలనచిత్రాలుగా వచ్చాయి. గొల్లపూడి మారుతీరావు 'సత్యంగారి ఇల్లెక్కడీ' నాటకం ఇబ్సెన్‌ 'ఎనిమీ ఆఫ్‌ ద పీపుల్స్‌'కు అనుకరణ. ఈ నాటకాల అధ్యయనంలోకి దిగితే మనం నివసించే సమాజం తీరుతెన్నులు మన కళ్ళముందు ప్రత్యక్షమౌతాయి. ఈ వంద నాటకాల ప్రచురణ అభినందించ దగ్గగొప్ప ప్రయత్నం.

(ఈనెల 19వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు
హైదరాబాద్‌ స్టేట్‌ ఆర్ట్స్‌ గ్యాలరీలో ఉప రాష్ట్రపతిచే ఈ సంకలనాల ఆవిష్కరణ)

@ప్రజాశక్తి దినపత్రిక నుండి సేకరణ