బొల్లిముంత శివరామకృష్ణ జయంతి సందర్భంగా

💐💐🙏అభ్యుదయ రచయిత, ప్రజా కళాకారుడు, హేతువాది. మార్క్సిస్టు గాంధీ గా పిలవబడే సాహితీ మృత్యుంజయుడు
శ్రీ బొల్లిముంత శివరామకృష్ణ జయంతి సందర్భంగా🙏💐💐



మనిషి జీవితం అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుంది సామాజిక అస్తిత్వం-సామాజిక చైతన్యాన్ని ప్రభావితం చేస్తుంది అన్న దృక్పథంతో రచనలు చేసిన అగ్రశ్రేణి అభ్యుదయ రచయిత బొల్లిముంత శివరామకృష్ణయ్య. *ఉపాధ్యాయుడు, హార్మోనిస్టు,నటుడు, గాయకుడు,కవి, కథా రచయిత, నవలాకారుడు, బుర్రకథా రచయిత, హరికథా రచయిత, జర్నలిస్టు, సినిమా రచయిత, అభ్యుదయ రచయితల సంఘం నాయకుడు, రాజకీయ కార్యకర్త, ఉత్తమ కమ్యూనిస్టు బొల్లిముంత.*
*తెలుగు సాహితీ లోకంలో ఆయన నిశ్శబ్ద విప్లవం.*
*మార్క్సిస్టు గాంధీ అని కూడా అంటారు.*

*బాల్యం-విద్యాభ్యాసం:*

1920 నవంబరు 27వ తేదీన గుంటూరు జిల్లా వేమూరు మండలం, చదలవాడలో శ్రీమతి మంగమ్మ-, శ్రీ అక్కయ్య దంపతులకు పుట్టిన శివరామకృష్ణయ్య ప్రాథమిక, మాధ్యమిక విద్య తమ స్వగ్రామంలో కొనసాగించి, గుంటూరులో హయ్యర్‌గ్రేడ్‌ శిక్షణ పూర్తి చేశారు. సంస్కృతాన్ని, సంగీతాన్ని స్వయంకృషితో నేర్చుకున్నారు. చదలవాడలో ఆయన తండ్రి నెలకొల్పిన పాఠశాలలో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశారు. రైతులు, వ్యవసాయ కార్మికుల పిల్లలకు విద్యాబోధన చేశారు.13ఏళ్ల వయస్సులోనే నాటకరంగంలో ప్రవేశించించారు.

*కమ్యూనిస్టు ఉద్యమంలో:*

 బొల్లిముంత యువకునిగా ‘అమ్మ’ నవల చదివిన ప్రేరణలో కమ్యూనిస్టు ఉద్యమంలో కలిసి సాగారు.ఉత్తమ కమ్యూనిస్టు ఉత్తమ ప్రచారకుడు కావాలనే ఆదర్శానికి నిదర్శనగా బొల్లిముంత శివరామకృష్ణ తన అభిప్రాయాలను, లక్ష్యాలను ఏ మాత్రం దాచుకోకుండా తను ఆశించిన సమ సమాజ లక్ష్యంగా జీవించారు. జీవితకాలంలో కచ్చితంగా అటువంటి నికార్సయిన సాహిత్యాన్నే సృష్టించారు.
తెనాలి తాలూకా పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. భూపోరాటాల్లో పాల్గొన్నారు. జైలు శిక్షలు అను భవించారు. అజ్ఞాత వాస జీవితం గడిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఆదేశం మేరకు 1967లో బందరు పార్లమెంటు నియోజక వర్గానికి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అభ్యుదయ సాహితోద్యమంలో, ప్రజా సాంస్కృతిద్యోమంలో క్రియాశీలంగా వున్న బొల్లిముంత భీమవరంలో 1988 అక్టోబర్‌ 8, 9 తేదీలలో జరిగిన అరసం రాష్ట్ర 10వ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎంపికై గుంటూరులో 1992 నవంబర్‌ 14, 15 తేదీలలో జరిగిన 11వ మహాసభ వరకూ కొనసాగారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి ఉపా ధ్యక్షులుగా కూడా సేవలందించారు.
కమ్యూనిస్టుగా రాజకీయోద్యమాలలో క్రియాశీలంగా పాల్గొంటూ 
సాహిత్య రచనకు పక్రమించారు.నెహ్రూ ప్రభుత్వం కమ్యూనిస్టులపై క్రూర నిర్బంధకాండను అమలు జరిపిన కాలంలో అజ్ఞాతవాసంలో ఉంటూనే గుంటూరు నుంచి నగారా పత్రికను నడిపారు. ఆనాటి నెహ్రూ ప్రభుత్వం స్వదేశంలో కమ్యూనిస్టులపై దారుణమైన నిర్బంధకాండను, ఊచకోతను ప్రయోగిస్తూ, మరోవైపు విదేశీవ్యవహారాలలో సోషలిస్టు శిబిరంతో స్నేహసంబంధాల కోసం అర్రులు చాచే ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ బొల్లిముంత మొదళ్ళు నరికి చివుళ్ళకు నీరు పోస్తానంటాడు పండిట్‌ నెహ్రూ అనే వ్యాసం రాశారు. రాజకీయ రంగంలోనే కాదు, సాహిత్య రంగంలోని అవకాశవాదాన్ని, తిరోగమన విధానాలను అనేక సందర్భాల్లో నిర్ద్వంద్వంగా ఖండించారు.

*రచయితగా:*

1936లో మద్రాసు నుంచి వెలువడే 'చిత్రాంగి' పత్రికలో తన తొలి కథ 'ఏటొద్దు' ప్రచురించారు. అప్పుడాయన వయసు పదహారేళ్లు!నగారా అనే పత్రిక నడిపారు. కొడవటిగంటి కుటుంబరావు రాసిన 'పిల్లి' అనే కథపై కొడవటిగంటి తిరోగమన యాత్ర అంటూ విమర్శ రాశారు. బెంగాల్ కరవుపై బుర్రకథ రాశారు. 'రైతుబిడ్డ' హరికథ రాశారు. సూక్ష్మంలో మోక్షం, అంతరాత్మ అంత్యక్రియలు, శివరామకృష్ణ కథలు బొల్లిముంతవే. ఏ ఎండకాగొడుగు, పత్రికా న్యాయం, తెలంగాణా స్వతంత్రఘోష, క్విట్ కాశ్మీర్, ధర్మసంస్థాపనార్థాయ... ఇలా ఎన్నో నాటికలు రాశారు. రాజకీయ గయోపాఖ్యానం, రాజకీయ కురుక్షేత్రం వంటి పద్యనాటకాలు రాశారు. దొంగ దొరికింది, భలేమంచి చౌకబేరం... వంటి రేడియో నాటికలు రాశారు. నేటి భారతం పేరుతో మూకీ నాటిక రాశారు. ప్రజానాట్యమండలి పునరుద్ధరణ సమయంలో బొల్లిముంత శ్రీకాంత్‌తో కలసి అందరూ బతకాలి నాటకం రాశారు. *దీన్ని రక్తకన్నీరు నాగభూషణం వందకు పైగా ప్రదర్శనలిచ్చారు.*
ప్రజాశక్తి పత్రికలో శివరామకృష్ణ రచించిన దేశం ఏం కావాలి కథ విశేష జనాదరణ సంపాదించింది.

*సినీ రచయితగా:*

1964లో ఆత్రేయ ప్రోత్సాహంతో బొల్లిముంత శివరామకృష్ణ ఆయనకు సహాయకుడుగా మద్రాసు వెళ్ళారు. మొదట్లో తమిళ సినిమాలకు అనువాదాలు చేస్తుండేవారు. ఆత్రేయ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ‘వాగ్దానం’కు బొల్లిముంత తొలిసారి స్వయంగా మాటలు రాశారు. ‘తిరుపతమ్మ కథ’కు సంభాషణలు రాసేసరికి ఆ కళలో మరింత పట్టు సాధించారు. ఆ రకంగా ‘మనుషులు మారాలి’ చిత్రం సంభాషణలో పెద్ద హిట్టయ్యింది. దాంతో బొల్లిముంత మద్రాసులో స్థిరపడాల్సి వచ్చింది. సుమారు నలభై ఐదు సినిమాలకు సంభాషణలు రాశారు. మధ్యలో కొన్ని పాటలు కూడా రాశారు.
ఆయన రాసిన దాదాపు యాభై సినిమాల్లో మనుషులు మారాలి, ప్రజా నాయకుడు వంటి సీరియస్ సినిమాలేకాక శారద, కళ్యాణమంటపం, మూగకు మాటొస్తే, విచిత్రబంధం వంటి సెంటిమెంట్ ప్రధానమైన చిత్రాలు కూడా ఉన్నాయి. నాటకాల్లో హార్మోనియం వాయించారు. స్త్రీ పాత్రలు ధరించారు.
 *'కాలం మారింది’కి రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, ‘నిమజ్జనం’కు జాతీయ అవార్డు లభించాయి.*

*మృత్యుంజయులు:*

జనంలోంచే వస్తారు 'మృత్యుంజయులు'.......
*ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ వ్యవస్థలోనైనా పాలకవర్గం పాలితవర్గం నడుమ పోరాటమంటూ ప్రారంభమయితే నాటి పరిస్థితుల అనుకూల్యతను అనుసరించి అంతిమ విజయం ఉంటుంది. ఇది చారిత్రక సత్యం. అలాటి సత్యావిష్కరణకు సృజన రూపం 'మృత్యుంజయులు' నవల.పోరాటానికి తొలి అక్షరరూపం ఈ నవల. రచనా కాలానికి రచయిత బొల్లిముంత శివరామకృష్ణ వయసు 27 ఏళ్ళు. యువకుడుగా తన కాలంలో తన సమీప ప్రాంతం తెలంగాణలో ప్రారంభమైన ప్రజాపోరాట నేపథ్యాన్ని అవగాహన చేసుకొని, దాని ఆంతర్యాన్ని అర్థం చేసుకొంటూ, ఆ పోరాటం జరుగుతున్న తీరుతెన్నుల్ని గమనిస్తూ, ప్రజలపక్షమే అంతిమ విజయమని వైతాళిక గీతికగా ఆవిష్కరించిన కథా కథనం 'మృత్యుంజయులు' నవల.*
తెలంగాణా సాయుధ పోరాటం గూర్చి రాసిన ‘మృత్యుంజయులు’ నవల ప్రజలందరికి తెలుసు. ఎన్నో వేల ప్రతులు అమ్ముడు పోయాయి.
1947 అక్టోబరు 25న విడుదల చేశారు. ఒక రకంగా కవుల కంటే కూడా తన నవలాయుధంతో ఆయన ముందు నిలిచారు.తెలంగాణా భూస్వామ్య వర్గాల దోపిడి, దౌర్జన్యాలను కళ్లకు కట్టినట్లు చిత్రించిన మృత్యుంజయులు నవల ఒక ప్రత్యేక స్థానాన్ని పొందింది. రాజకీయంగా సమరశీల ఉద్యమాల్లో పాల్గొన్నారు. తెలంగాణా విమోచనోద్యమ నవలల్లో ఇదే తొలి నవల. నిజాం నిరంకుశత్వానికీ, భూస్వాముల దౌర్జన్యాలకూ వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలర్పించిన అమరవీరులను మృత్యుంజయులుగా చిత్రించారు.పేద ప్రజల హక్కుల కోసం అహరహం పోరాడిన కర్మవీరుడు. తెలంగాణ పోరాట కాలంలో వెలువడిన తొలి నవలగా, ఒక చారిత్రక అవసరాన్ని గుర్తించి, ప్రజా పోరాటాన్ని నమోదు చేసిన నవలగా తెలుగు సాహిత్యంలో మృత్యుంజయులు నవలకు సుస్థిర స్థానం ఉంటుంది. నాటి కమ్యూనిస్టు నాయకులు చంద్రం ఈ నవలను బొల్లిముంతతో ఆరు సార్లు తిరగరాయించారట.*రావి నారాయణ రెడ్డి ఈ నవలకు ముందు మాట రాశారు.*

*సంపాదకత్వం:*

బొల్లిముంత ‘ప్రజాపక్షం’ అనే మాసపత్రికకు సంపాదకత్వ బాధ్యతలు స్వీకరించారు. తెలుగు అకాడెమీ పక్కన పత్రిక ఆఫీసు కూడా ఏర్పాటు చేశారు.  ఆంధ్రప్రదేశ్‌లో అరసం నిర్మాణంలో ఒకరు. ‘అభ్యుదయ’ పత్రిక కోసం కృషి, అరసంతో ఆయన జీవితం చివరికంటా ముడిపడి ఉంది. విశాలాంధ్ర దినపత్రిక వారి పత్రికలు ‘ప్రతిభ’ ‘ప్రగతి’లలో సంపాదక వర్గంలో పనిచేశారు.

*రచనలు:*

*అంతరాత్మ అంత్యక్రియలు [కధా సంపుటి].
*మృత్యుంజయులు [నవల].
*సూక్ష్మంలో మోక్షం [కధా సంపుటి].
*పత్రికా న్యాయం
*తెలంగాణ స్వతంత్ర ఘోష.
*కాశ్మీర్ విడిచిపెట్టండి.
*ధర్మసంస్థాపనార్థాయ
*రాజకీయ గయోపాఖ్యానం.
*రాజకీయ కురుక్షేత్రం.
*దొంగ దొరికింది.
*కలసి అందరు బతకాలి.
&నేటి భారతం.
*భలే మంచి చౌకబేరము.


*పురస్కారాలు:*

తెలుగు సాహితీ లోకంలో ఆయన నిశ్శబ్దవిప్లవం, మార్క్సిస్టు గాంధీ అని కూడా అంటారు.
1988లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి సాహితీ సత్కారం అందుకున్నాడు.

*బొల్లిముంత సాహితీపురస్కారం,నాటక పోటీలు:*

బొల్లిముంత ఆదర్శాలను కొనసాగిస్తున్న ప్రగతిశీల రచయితలను సముచిత రీతిలో గౌరవించడానికి తెనాలి సాహితీమిత్రులు బొల్లిముంత బతికున్నప్పుడే, ఆ మహారచయిత పేరిట బొల్లిముంత సాహితీపురస్కారం నెలకొల్పారు.
బొల్లిముంత శివరామకృష్ణ పేర నాటక పోటీలు, వర్ధంతులు నిర్వహిస్తున్న బొల్లిముంత ఫౌండేషన్ తెనాలి పట్టణానికి కీర్తి కిరీటం. శివరామకృష్ణ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయులు.

85 సంవత్సరాల పరిపూర్ణమైన సామాజిక, సాహిత్య, రాజకీయ జీవితం గడిపిన బొల్లిముంత శివరామకృష్ణయ్య 2005 జూన్‌ 7నఅస్తమించారు.

రాజకీయ రంగంలోనే కాదు, సాహిత్య రంగంలోని అవకాశవాదాన్ని, తిరోగమన విధానాలను అనేక సందర్భాల్లో బొల్లిముంత శివరామకృష్ణయ్య నిర్ద్వంద్వంగా ఖండించారు. ఆయన అభ్యుదయ సాహిత్యోద్యమంలోనూ, ప్రజా నాట్యమండలి సాంస్కృతికోద్యమంలోనూ క్రియాశీలంగా కొనసాగారు. నిగర్వి, నిరాడంబరజీవితం గడిపిన ఉదాత్త మానవుడు, నమ్మిన సిద్ధాంతాల పట్ల జీవితాంతం నిబద్ధత కలిగిన ఉత్తమ మానవతావాది బొల్లిముంత జీవితం, వ్యక్తిత్వం, సాహిత్యం నేటి తరానికీ, రానున్న తరాలకూ స్ఫూర్తిదాయకం.
ఉపాధ్యాయుడిగా, ఉద్యమకారుడిగా, అరసం నేతగా, కమ్యూనిస్టు కార్యకర్తగా, నవలా రచయితగా, సినీ రచయితగా, సంపాదకుడిగా బహుముఖ ప్రతిభను కనబరిచిన బొల్లిముంత శివరామకృష్ణ సాహిత్య ప్రపంచంలో మృత్యుంజయుడిగా నిలిచారు.
🙏🙏🌷🌺🌹🙏🙏
Collected by
A.Srinivasa Reddy
9912731022
Zphs Munugodu
Amaravathi mandal
 Guntur district.