తరలి వెళ్ళింది వసంతం తన దరికి రాని వనాలకోసం

తరలి వెళ్ళింది వసంతం 
తన దరికి రాని వనాలకోసం

జగమంత సినీ కుటుంబాన్ని 
ఏకాకిని చేసి
సంగీత సాగరాన్ని
శూన్యం చేసి

ఈ నేల
ఈ గాలి
నీ పాట విన్న ప్రతి వాళ్లు
నిగ్గదీసి ఎవరిని అడగాలి ?

మూడు దశాబ్దాల
నీ సాహిత్యసేవ
ఎవరు పూడ్చాలి ??

సిరివెన్నెల లేని వెండితెరను
విధాత మా తలపు కైనా రానివ్వలేదే

మరణమనేది
ఎవరికైనా ఖాయమే
ఒక్కడే రావచ్చు 
ఒక్కడై పోవచ్చు
కానీ కవివై
కవితవై
పాటవై
మాటవై
మాలో వుంటూ
మాట మాత్రమైనా చెప్పకుండా
ఇలా నిష్క్రమించ వచ్చా??

నీ బూడిదిచ్చిన 
ఆ ఆదిభిక్షువు వాడికి
చెప్పండి

మా మదిలో
మీ కలానికి
గళానికి
లేదు
మరణం
ఎన్నటికీ

- కొప్పుల వసుంధర