1000 మంది విజ్ఞాన్‌ విద్యార్థులకు ఉద్యోగాలు

1000 మంది విజ్ఞాన్‌ విద్యార్థులకు ఉద్యోగాలు




గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన 1000 మంది విద్యార్థులకు 1600 ఉద్యోగ అవకాశాలు లభించాయని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ప్రాంగణ ఎంపికల్లో  ప్రతిభ చూపిన విద్యార్థులకు గురువారం విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ ఒక్కొక్క విద్యార్థి రెండు నుంచి మూడు ఉద్యోగ అవకాశాలు సాధించటంతో పాటు రూ.15లక్షల వరకు వార్షిక వేతనం పొందనున్నారని వెల్లడించారు. యూనివర్సిటీలోని 75 శాతం మంది విద్యార్థులు నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో ఉండగానే ఉద్యోగ అవకాశాలు సాధించారని పేర్కొన్నారు. ఉద్యోగాలు సాధించిన వారిలో 200 మందికి రూ.6.75 లక్షల నుంచి 15 లక్షల వార్షిక వేతనం, 600 మందికి రూ.4 లక్షల నుంచి రూ.6.75 లక్షల వార్షిక వేతనం, 800 మందికి రూ.3 లక్షల నుంచి 4 లక్షల వార్షిక వేతనంతో కూడిన ఉద్యోగ అవకాశాలు సాధించారని తెలియజేసారు. ప్రముఖ బహుళజాతి సంస్థలైన టీసీఎస్, సీటీఎస్, అసెంచర్, ఐబీఎమ్, హెచ్‌సీఎల్, ఐటీసీ, పీడబ్యూసీ, సిస్కో, హెక్సావేర్, అకోలైట్, కేకా వంటి కంపెనీలతో పాటు జాతీయ సంస్థలైన ఎస్‌బీఐ, జీఐ కంపెనీలలో ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. నాలుగో సంవత్సరంలోని రెండో సెమిస్టర్‌ కోసం ఇంటర్న్‌షిప్, ట్రైనింగ్‌లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపినట్లైతే వార్షిక వేతనం కూడా పెరుగుతుందన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన వారిలో చాలా మంది ఎంసెట్‌లో అర్హత కూడా సాధించలేదని, ఇంటర్మీ డియట్‌లో సాధారణ మార్కులు సాధించిన వారిని అత్యుత్తమ ఉద్యోగాలకు ఎంపికయ్యేలా తీర్చిదిద్దామన్నారు. నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌లో ఉండగానే ఒకేసారి 1000∙మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికవడం తమకు గర్వకారణమన్నారు. ఈ ఏడాది మరో 50కు పైగా కంపెనీలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ డ్రైవ్‌లు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామని  పేర్కొన్నారు. ఈ కరోనా సమయంలో కూడా ఇటువంటి మైలురాయిని అధిగమించడం అధ్యాపకుల కఠోర శ్రమ వలనే సాధ్యమయ్యిందని పేర్కొన్నారు.