విజ్ఞాన్స్‌ లారాతో ఐఐడీటీ– బ్లాక్‌బక్‌ కంపెనీ అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ లారాతో ఐఐడీటీ– బ్లాక్‌బక్‌ కంపెనీ అవగాహన ఒప్పందం



చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలతో తిరుపతిలోని ఐఐడీటీ ( ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీస్‌) సౌజన్యంతో హైదరాబాద్‌లోని బ్లాక్‌బక్‌ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో బ్లాక్‌బక్‌ కంపెనీ ఎండీ, సీఈవో అనురాధ తోట, బ్లాక్‌బక్‌ ఇంజినీర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరక్టర్‌ రాజ్‌ కుమార్‌ బోనగిరికు విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను అందజేసారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన విద్యార్థులకు ఇండస్ట్రీ నిపుణల చేత ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, డేటా సైన్స్‌ కోర్సులలో శిక్షణ ఇవ్వటమే కాకుండా ఇండస్ట్రీ లైవ్‌ ప్రాజెక్ట్‌ల మీద అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. దీని వలన ఇండస్ట్రీకు–అకడమియాకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి విద్యార్థులను నేరుగా సంస్థల అవసరాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దే విధంగా కోర్సులను అందిస్తామన్నారు. ఈ కోర్సు వలన విద్యార్థులకు బహుళజాతి సంస్థలలో అత్యధిక వేతనంతో ఉద్యోగ అవకాశాలు పొందటానికి ఎన్నో అవకాశాలు లభిస్తాయన్నారు. అంతేకాకుండా ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు వర్చువల్‌ ల్యాబ్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, డేటా సైన్స్‌ కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఐఐడీటీ పరీక్షలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికెట్‌లను అందజేస్తారు. కార్యక్రమంలో డీన్‌ ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్స్, వివిధ విభాగాల అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.