ఐవోటీతో ఆరోగ్య రంగంలో పెనుమార్పులు

ఐవోటీతో ఆరోగ్య రంగంలో పెనుమార్పులు

  వారణాసిలోని షైబ్‌పూర్‌ ఐఐఈఎస్‌టీ డైరక్టర్‌ డాక్టర్‌ పీ.చక్రబర్తి


  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌

రాబోయే కాలంలో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ ( ఐవోటీ)తో ఆరోగ్య రంగంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని వారణాసిలోని షైబ్‌పూర్‌ ఐఐఈఎస్‌టీ డైరక్టర్‌ డాక్టర్‌ పీ.చక్రబర్తి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ‘‘ ఐఈఈఈ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఐవోటీ ఫర్‌ రూరల్‌ హెల్త్‌కేర్‌ ( సీఐఆర్‌హెచ్‌–2021)’’ అనే అంశంపై 3 రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వారణాసిలోని షైబ్‌పూర్‌ ఐఐఈఎస్‌టీ డైరక్టర్‌ డాక్టర్‌ పీ.చక్రబర్తి మాట్లాడుతూ విద్యార్థులు డిస్కవరీ, ఇన్వెన్షన్, ఇన్నోవేషన్‌ అనే మూడు అంశాలపై దృష్టిసారించాలన్నారు. ఐవోటీ సహాయంతో ఆరోగ్య రంగంలో సామాన్య ప్రజల ఆరోగ్య పర్యవేక్షణ, రక్తపోటు, హార్ట్‌ రేటులను మానిటరింగ్‌ చేయవచ్చునన్నారు. అంతేకాకుండా హాస్పిటల్‌ అడ్మిట్‌ అయిన రోగి కదలికలను కూడా గమనించవచ్చని తెలియజేసారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఇలాంటి కాన్ఫరెన్స్‌లు ఉపయోగపడుతాయని అన్నారు. ఉజ్వల భవిష్యత్‌ కోసం ఒకరికొకరు ప్రోత్సాహాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారానే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ సాధ్యమని అన్నారు. కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన సిలికాన్‌ ల్యాబ్స్‌ ఇంజినీరింగ్‌ సీనియర్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.వెంకటేష్‌ మాట్లాడుతూ ఐవోటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు సొంతం చేసుకోవాలనే విద్యార్థులు మెషిన్‌ లెర్నింగ్, ఎంబెడెడ్‌ సిస్టమ్స్, నెట్‌వర్కింగ్, ప్రోగ్రామింగ్, అనలిటిక్స్, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, ఎడ్జ్‌ కంప్యూటింగ్‌తో పాటు సాఫ్ట్‌స్కిల్స్‌ ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్‌ డివైస్‌ల డిజైనింగ్‌ కోసం ఆటోక్యాడ్‌ టెక్నాలజీ అవసరం ఎక్కువగా ఉంటుందన్నారు. అనంతరం అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌కు సంబంధించిన సీడీను ఆవిష్కరించారు. విజయవాడలోని ఎప్ఫాట్రానిక్స్‌ ఎండీ డీ.రామక్రిష్ణ మాట్లాడుతూ స్మార్ట్‌ డివైసెస్, స్మార్ట్‌ హోమ్స్, ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్, రోబోటిక్స్‌ వంటి రంగాలు వేగంగా విస్తరిస్తుండటం వలన ఐవోటీలో ప్రావీణ్యం పొందిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని వెల్లడించారు. డిజిటల్‌ యుగంలో టెక్నాలజీ రోజు రోజుకు సరికొత్త పుంతలు తొక్కుతుందన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం మన దైనందిన జీవితాలను మరింత సౌకర్యవంతం చేస్తుందన్నారు.