కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా కమిషన్‌ ఏర్పాటు చేయాలి

కేంద్రం రద్దు చేసిన చట్టాలను పునరుద్ధరించండి
అవసరమైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేర న్యాయపోరాటం
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు త్వరలో ప్రభుత్వ విధాన నిర్ణయం
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా కమిషన్‌ ఏర్పాటు చేయాలి
జాతీయ,రాష్ట్ర ఫెడరేషన్‌ నేతల డిమాండ్‌


విశాఖపట్నం,డిసెంబర్‌20: దేశ వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించిన నాలుగు కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగిందని, అయితే వాటిని తక్షణమే తిరిగి పునరుద్దరించాలని కోరుతున్నామని ఏపీ వర్కింగ్‌ .జర్నలిస్టుల ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. అంజనేయులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబులు డిమాండ్‌ చేశారు. సోమవారం డాబాగార్డెన్స్‌ విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దేశ, రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించిన అనేక అంశాలను వీరు వెల్లడించారు. కేంద్రం రద్దు చేసిన నాలుగు కార్మిక చట్టాల పునరుద్దరణ కోసం జాతీయ స్ధాయిలో అనేక ప్రాంతాల ప్రెస్‌క్లబ్‌లతో కలసి కృషి చేస్తున్నామన్నారు. పార్లమెంటరీ కమిటీ నివేదిక రాగానే ఆయా చట్టాలకు సంబంధించి స్ఫష్టత రాకపోతే గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం న్యాయ పోరాటం చేసే అంశాన్ని తమ యూనియన్‌లు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రభుత్వం విధానపరమైన ప్రకటన చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చి ఉన్నందున దాని కోసం తాము ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే సానుకూలంగా  ప్రకటన వెలువడుతుందని తాము భావిస్తున్నామన్నారు. అక్రిడేషన్లుకు సంబంధించి దశల వారీగా జారీ చేస్తున్నారని, చిన్న పత్రికలకు, కేబుల్‌టీవీలకు సైతం అక్రిడేషన్లు జారీ అవుతున్నాయని,ఈ ప్రక్రియలో ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. దేశంలో, రాష్ట్రంలో మీడియా కమిషన్‌లు ఏర్పాటు చేస్తే జర్నలిస్టులకు సంబంధించిన విధివిధానాల ప్రకారం అందరూ ఒకే రీతిన పనిచేయడానికి అవకాశం కలుగుతుందన్నారు. దీంతో పాటు శరవేగంగా పెరుగుతున్న డిజిటల్‌ మీడియాకు సంబంధించి కూడా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన మేర మార్గదర్శకాలు జారీ చేయాలని వీరు కోరారు. కేంద్రం విధివిధానాల బట్టి రాష్ట్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫెడరేషన్‌,బ్రాడ్‌కాస్ట్‌ యూనియన్లును మరింత బలోపేతం చేస్తామన్నారు. ఇప్పటికే ఈ రెండు యూనియన్లుకు ఏపీ ప్రభుత్వం నుంచి అధికారికంగా గుర్తింపు లభించిందని వివరించారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి తమ పరిధి మేరకు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దలతో చర్చించి ఆయా సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ అర్భన్‌ యూనిట్‌ అధ్యక్షుడు పి. నారాయణ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు జాతీయ, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. ఈ నెల 23న రాష్ట్రస్ధాయి సమావేశం జరగనుందని, అందులో పలు అంశాలను చర్చించేందుకు నివేదిక అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో ఫెడరేషన్‌ జాతీయ సభ్యుడు జి.శ్రీనివాసరావు, అర్భన్‌ యూనిట్‌ కార్యదర్శి అనురాధ, బ్రాడ్‌కాస్ట్‌ సంఘం ప్రతినిధులు రామకృష్ణ, ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, పాల్గొన్నారు. తదుపరి పలువురు జర్నలిస్ట్ లు ఆంజనేయులు ను ఘనముగా సత్కరించారు...