విజ్ఞాన్స్‌ వర్సీటీలో ఘనంగా సెమీ క్రిస్ట్‌మస్‌ వేడుకలు

విజ్ఞాన్స్‌ వర్సీటీలో ఘనంగా సెమీ క్రిస్ట్‌మస్‌ వేడుకలు


చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో విద్యార్థుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  లేమన్స్‌ ఎవాంజిలికల్‌ ఫెలోషిప్‌కు చెందిన డాక్టర్‌ జాషువా 
మాట్లాడుతూ జీవితంలో విద్యార్థులు భయానికి, ఆందోళనకు, ఒత్తిడికు గురికావద్దని పేర్కొన్నారు. కష్టకాలంలో దేవుడిని ప్రార్థించాలని, తొందరపడి క్షణికావేశంలో ఎటువంటి ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోరాదన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో కష్టసుఖాలనేవి సాధారణమని, జీవితంలో చీకటి తర్వాత వెలుగులు కూడా నిండుతాయని తెలియజేసారు. జీవితంలో దేవుడు ఎప్పడు మీకు తోడుగా ఉంటాడని, మిమ్మల్ని సమున్నత స్థానాలకు తీసుకెళ్తాడని తెలియజేసారు. ఏసుక్రీస్తు బోధనలు వర్తమాన సమాజానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. సత్యం, ధర్మం, శాంతి, సహనం అనే ఆయుధాలను ఏసుక్రీస్తు ప్రపంచానికి అందించారన్నారు. ధర్మం కోసం అడుగులు వేసే ఎవరైనా సత్యాన్ని నిర్భయంగా ప్రకటిస్తారనేది క్రీస్తు జీవితం ద్వారా మనకు తెలుస్తుందని, సత్యాన్ని మానవాళికి ప్రకటించడంతో శాంతి, సహనాలను ప్రభువు ఎప్పడూ విడిచిపెట్టలేదని చెప్పారు. క్రీస్తు అందించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి, ప్రపంచ శాంతికి సర్వమానవాళి సౌభ్రాతృత్వానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ లావు రత్తయ్య ఈ సందర్భంగా విద్యార్థులకు ముందస్తుగా క్రిస్మస్‌ శుభాకాంక్షలు చెప్పారు. ఏసుక్రీస్తు లోకరక్షకుడని, ఆయన పుట్టుకతోనే సమస్త మానవాళికి రక్షణ వచ్చిందని అన్నారు. ఏసుక్రీస్తు భూమి మీద పుట్టడమే మానవాళి చేసుకున్న గొప్ప భాగ్యమని, క్రీస్తు ప్రతి ఒక్కరి జీవితాలలో జన్మించటమే నిజమైన క్రిస్మస్‌ అని తెలిపారు. ఏసుక్రీస్తు వారు సమస్త మానవాళి పాపములను క్షమించుట కొరకే ఈ భూమ్మీద నరరూపిగా జన్మించాడని, ఆయన జననం ద్వారా లోకానికి  రక్షణ వచ్చిందన్నారు.