విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో ఘనంగా ముగిసిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌

విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలో ఘనంగా ముగిసిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌


  విజ్ఞాన్‌ ఫార్మసీ– యూఎస్‌ఏలోని అవెనిద ఇన్నోవేషన్స్‌ల మధ్య అవగాహన ఒప్పందం

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ ఫార్మసీ కళాశాలలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఫార్మసీ ప్రాక్టీస్, యూఎస్‌ఏలోని అవెనిద ఇన్నోవేషన్స్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ ది చేంజింగ్‌ వరల్డ్‌ ఆఫ్‌ హెల్త్‌ కేర్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను ఘనంగా ముగించారు. ఈ కార్యక్రమాన్ని ‘‘ఇంటర్న్‌షిప్‌ టు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌– దేర్‌ ఈస్‌ సమ్‌థింగ్‌ ఫర్‌ ఎవిరివన్‌’’అనే ఇతివృత్తంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యూఎస్‌ఏ–కాలిఫోర్నియాలోని కార్డియోజెనిక్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ అశ్విని ధార్‌ మాట్లాడుతూ విద్యార్థులకు మెడికల్‌ ఇన్ఫర్మేటిక్స్, ఫార్మసీ ఇన్ఫర్మేటిక్స్‌ అనేది సరికొత్త అధ్యయన రంగమని, ఇందులో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీతో పాటు కంప్యూటర్‌ సైన్స్‌ ఫార్మసీ పరిజ్ఞానాన్ని మిళితం చేయవచ్చునని పేర్కొన్నారు.  హెల్త్‌కేర్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌ను మిళితం చేయడం వలన  రోగుల ఆరోగ్య సంరక్షణతో పాటు మెరుగైన సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవచ్చన్నారు. అంతేకాకుండా క్లినికల్‌ డెసిషన్‌ సపోర్ట్‌ సిస్టమ్‌లను రూపొందించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చన్నారు. ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న  డేటా మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్‌ రంగాల పైన దృష్టిసారించి, వాటిపై పట్టు సాధించినట్లైతే అపార అవకాశాలతో పాటు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం విజ్ఞాన్‌ ఫార్మసీ– యూఎస్‌ఏలోని అవెనిద ఇన్నోవేషన్స్‌ల మధ్య అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య యూఎస్‌ఏ–కాలిఫోర్నియాలోని కార్డియోజెనిక్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ అశ్విని ధార్‌కు అందజేసారు. ఈ అవగాహన ఒప్పందం వలన విద్యార్థులకు ప్రత్యేకమైన శిక్షణను ఇవ్వడంతో పాటు ప్రముఖ బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారని  వెల్లడించారు. మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో లీడర్‌షిప్‌ స్కిల్స్‌ అండ్‌ ఫార్మసీ ఇన్ఫార్మాటిక్స్‌ వర్క్‌షాప్, రోల్‌ ఆఫ్‌ ఫార్మాసిస్ట్‌ ఇన్‌ చేంజింగ్‌ వరల్డ్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్, హెల్త్‌కేర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రామ్, వరల్డ్‌ ఆఫ్‌ ఆపర్చునిటీస్‌ ఫర్‌ క్లినికల్‌ ఫార్మాసిస్ట్స్‌ అనే నాలుగు అంశాలపై ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు, కాన్ఫరెన్స్‌ కన్వీనర్, డీన్‌ అకడమిక్స్‌ జీ.సతీష్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.