ప్రకృతి పరిమళాలు వెదజల్లుతున్న ప్రసన్న జ్యోతి చిత్రాలు

ప్రకృతి పరిమళాలు వెదజల్లుతున్న ప్రసన్న జ్యోతి చిత్రాలు
 - కుంచెతో అద్భుత చిత్రాల సృష్టి
 - వైవిధ్యం, సృజనాత్మకత ఆమె చిత్రాల సొంతం 
- చిత్ర కళలో రాణిస్తున్న యువ   చిత్రకారిణి 


టాలెంట్ ఎక్స్ ప్రెస్: పరిశీలన, పరిశోధన, అణ్వేషణతో అమె కుంచెకు రంగులు అద్ది అద్భుత కళాకండాలను చిత్రిస్తారు. విభిన్నంగా ఆలోచన చేసి చిత్ర రచన చేసి వహవా అనిపించుకుంటారు. ప్రత్యేకంగా ప్రకృతిపై, పర్యావరణం పై రూపొందించిన కోట ప్రసన్న జ్యోతి చిత్రాలు ఆలోజింపచేస్తాయి. హైదరాబాద్ కు చెందిన ప్రసన్న జ్యోతి ఏడో యేటనుంచే చిత్రకళపై మక్కువ పెంచుకుంది. తల్లి సుమలత ప్రోత్సాహంతో చిత్రకళలో ఫైన్ ఆర్ట్స్ పూర్తిచేసి చిత్రకళా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అలవోకగా ప్రకృతి రమణీయత ఉట్టిపడే, చూడగానే రెప్పలార్పకుండా చూడాలనిపించే లాండ్ స్కేప్ లు, భక్తిపరవశంలో ముంచెత్తే దేవతా మూర్తుల చిత్రాలు, పోర్టెట్స్, మాతృప్రేమ మూర్తీభవించే తల్లి, 
పిల్లల చిత్రాలు తన కుంచెలతో పురుడుపోసుకుంటాయి. 

సహజత్వంతో ఈ చిత్రకారిణి రూపొందించిన చిత్రాలన్నీ అందమైన దృశ్యకావ్యాలే. తొలినాళ్ళలో లైన్ డ్రాయింగ్ తో మొదలైన చిత్రరచన నేడు ఆయిల్ కలర్స్, ఆర్కిలిక్, వాటర్, పోస్టర్ కలర్స్ వినియోగిస్తూ తనదైన శైలిలో కాన్వాస్ లను మలుస్తూ చెరగని సంతకం చేస్తున్నారు. 

జాతీయ స్థాయి, రాష్ట్రస్థాయి చిత్రకళా పోటీల్లో, ప్రదర్శనల్లో పాల్గొని అనేక అవార్డులను, రివార్డులను అందుకున్నారు. ఎస్వీ విశ్వ విద్యాలయంలో ఫైన్ ఆర్ట్ పూర్తిచేసిన ప్రసన్నజ్యోతి కొంతకాలం చిత్రకళా ఉపాద్యాయినిగా పనిచేసారు. ఉన్నత విద్యలు చదవకపోయానని ఏనాడు ఆలోజించలేదని, తనకు ఇష్టమైన చిత్రకళలో తృప్తిని పొందుతూనే ఉపాధి కూడా కల్పించుకుంటున్నారు. తను చిత్రించిన పెయింటింగ్ లు ఐదువేల నుంచి యాబైవేల వరకూ అమ్మకాలు జరిగాయన్నారు. విద్యతో పాటు కళారంగాల్లోనూ మహిళలు రాణించాలని, చిత్రకళ ద్వారా త్వరిత గతిన ఉపాధికూడా పొందవచ్చునని చెబుతున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలోని ఆర్ట్ గ్యాలరీలో, ఢిల్లీ, బెంగుళూర్, చెనై తదితర ప్రాంతాల్లో, గ్రూప్, సోలో ఎగ్జిబిషన్లో తన చిత్రాలు ప్రదర్శితమయ్యాయని చెప్పారు. 

చిత్రకళా రంగ ప్రవేశం గురించి ప్రసన్నజ్యోతి మాటల్లోనే... 


నాలోని చిత్రకళను మొదటిగా మా లైబ్రేరియన్ గుర్తించారు. అందరూ చదువూతూ ఉంటే నేను మాత్రం రఫ్ నోట్ బుక్ తీసుకుని పత్రికల్లో వచ్చిన, నచ్చిన చిత్రాలను గీస్తూ ఉంటాను. అవి ఆమె చూసి నన్ను అభినందించింది. తర్వాత మా అమ్మ గారు నన్ను ప్రోత్సహించింది. దీంతో నచ్చినవి గీస్తూనే జవహర్ బాల భవన్ లో చిత్రకారుడు కిషన్ గారి దగ్గర శిక్షణ తీసుకున్నాను. తర్వాత బీఎఫ్ ఏ ఎంట్రన్స్ వ్రాసి సీటు తెచ్చుకుని బీఎఫ్ఏ పూర్తిచేసాను. ముఖ్యంగా అనుకరణ నాకు ఇష్టం ఉండదు. నాదైన శైలిలో చిత్రించడం ఇష్టం. చిత్రకళలో ఎంతో స్వేచ్ఛ ఉంది. ఊహల్లో కలిగిన అనేక అంశాలను ఎలాంటి హద్దులు లేకుండా చిత్రంద్వారా చెప్పవచ్చు. వేల మాటల్లో చెప్పలేని భావాలను దృశ్యంలో చెప్పవచ్చు. చిత్రకళారంగంలో మరింత గుర్తింపు తెచ్చుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తాను. పేపర్స్ తో అందమైన క్రాఫ్ట్ తయారు చేయండం కూడా ఇష్టం.