విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ డీఎస్టీ–ఎస్టీఐ హబ్‌ ప్రాజెక్టు పనులు ప్రారంభం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ డీఎస్టీ–ఎస్టీఐ హబ్‌ ప్రాజెక్టు పనులు ప్రారంభం


చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకి న్యూఢిల్లీ నుంచి మంజూరైన డీఎస్టీ–ఎస్టీఐ హబ్‌ ప్రాజెక్టు పనులను గుంటూరు జిల్లాలోని క్రోసూరు మండలంలో ప్రారంభించామని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా క్రోసూరులో ఏర్పాటు చేసిన ప్రాజెక్టు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి న్యూఢిల్లీలోని ఐసీఏఆర్‌ ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఓ.ఎన్‌.తివారీ, క్రోసూరు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ వి.జ్వాలా లక్ష్మి నరసింహారావు, జిల్లా ఫార్మర్స్‌ అసోసియేషన్‌ మెంబర్‌ అనుముల శ్రీనివాస రెడ్డి  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ ఓ.ఎన్‌.తివారీ మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ మరియు న్యూఢిల్లీలోని డీఎస్టీ–ఎస్టీఐ హబ్‌ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని షెడ్యూల్డ్‌ కులాల ప్రజల ఆదాయ అభివృద్ధిని, జీవనోపాధి మెరుగుదల కోసం ఈ ప్రాజెక్టును  ప్రారంభిస్తున్నామని తెలియజేసారు. ఈ ప్రాజెక్టు ద్వారా పరిసర ప్రాంతాలలోని ప్రజలకు సాంకేతికతను అలవాటు చేయడంతోపాటు అధిక విలువలు కలిగిన ఔషధ, సుగంధ మొక్కల పెంపకం వాటి పరిరక్షణ గురించి అవగాహన కల్పిస్తామన్నారు. అంతేకాకుండా వరి, కూరగాయల పంటల పెంపుదలకు బయో–ఇనాక్యులెంట్‌ ఆధారిత ఎరువుల ఉత్పత్తికి కావలసిన మెరుగైన సాంకేతికత గురించి తెలియజేస్తామన్నారు. వ్యవసాయ వ్యర్థాలు, పశువుల ఎరువును వాయు రహితంగా జీర్ణం చేయడం ద్వారా స్థిరమైన బయోగ్యాస్‌ ఉత్పత్తికి తోడ్పడుతుందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా క్రోసూరు, సత్తెనపల్లి, చేబ్రోలు,  పొన్నూరు మండలాల్లోని ఎంపిక చేసిన పలు గ్రామాల్లోని రైతాంగానికి నూతన సాంకేతికతను అందజేస్తామన్నారు.