డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్ జయంతి మన కర్తవ్యాలు

Dr. B.R. అంబేద్కర్ 130 వ జయంతి
మన కర్తవ్యాలు








— రేకా చంద్ర శేఖర రావు.

బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాసంగికత,
అవసరత సమాజానికి గత 35 సంవత్సరాల నుండి- 1985 కారంచేడు నుండి- పెరుగుతూ వస్తున్నది. ఈ రోజు ఏ శక్తులు అంబేద్కర్ ను కాదన గలిగిన పరిస్తితిలో లేవు. 

Dr. B.R. అంబేద్కర్ తన శతృవుగా భావించి
మను వాదంపై తీవ్ర పోరాటాలు చేశాడు. అలాటి మనువాద సిద్దాంత కర్తల పార్టీ నేడు అధికారంలో వుంటూ కూడా అంబేద్కర్ ని  మాటలలో తృణీకరించకుండా 
జయంతులు, వర్ధంతుల సందర్భంలో ఎక్కడా లేని ప్రేమను ఒలకబోస్తున్నారు.
అంబేద్కర్ లాగా తమ సిద్దాంతాలతో ఏ మాత్రం పొసగని షహీద్ భగత్ సింగ్ జయంతి , వర్ధంతులు కూడా అలాగే జరుపుతున్నారు.

అంబేద్కర్, భగత్ సింగులపైన వారు ప్రదర్శించే  ప్రేమలోని బూటకత్వాన్ని ఎండగట్ట వలసిన అవసరం నేడు ఎంతో వుంది.

అంబేద్కర్ ఒక దార్శనికుడు . కుల నిర్మూలన సిద్దాంత వేత్తగానే గాకుండా రాజ్యాంగ రచనలో కూడా కీలక పాత్ర నిర్వహించాడు. 

వయోజన ఓటింగు, భావ ప్రకటనా స్వేఛ్చ, రాష్ట్రాల అధికారాలు , న్యాయ వ్యవస్తకు అత్యున్నత అధికారాలు ఇవ్వడం , మహిళలకు సమాన హక్కులు, దళిత , ఆదివాసీ వెనకబడిన వర్గాలకు ప్రత్యేక హక్కులు , కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి తదితర అనేక విషయాలలో ప్రజలకు అనుకూల మైన విధంగా  అంబేద్కర్ చేశాడు. 

ఆయన మాటలలోనే
“ మనం రాజకీయంగా వయోజన ఓటింగ్ ద్వారా ప్రతి మనిషికి సమాన విలువను , 
ఒకే విలువను ఇచ్చాము.

వేరొక పక్క ఆర్థికంగా , సాంఘికంగా  అసమాన వ్యవస్తను కొనసాగిస్తున్నాము. ఈ అసమానతలను రూపుమాపక పోతే
మనం రాసుకున్న రాజకీయ సమానత్వం ఆచరణలో నిలబడదు. “

నేడు అదే పరిస్తితిని మనం ఎదుర్కొంటూ వున్నాము. పైగా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను నేటి మనువాద పాలకులు  పరోక్ష మరియు ప్రత్యక్ష పద్దతులలో రద్దు చేస్తున్నారు.

CAA/ NRC /NPR  తదితర చట్టాల ద్వారా మానవ హక్కులను రద్దు చేస్తున్నారు, 370 చట్టం రద్దు ద్వారా కాశ్మీర్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు రద్దు చేశారు.
కరోనాను అడ్డం పెట్టుకుని కార్మిక వ్యతిరేక చట్టాలను , 
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను  చేశారు, ఆ అక్రమ చట్టాలకు వ్యతిరేకంగా గత నాలుగు నెలల నుండి రైతులు పోరాడుతున్నారు. 

అంబేద్కర్ ఇచ్చిన మార్గదర్శకాల ద్వారా రూపొందిన , లాభాలలో వున్న LIC ని ప్రైవేట్ కార్పోరేట్లకు కట్టబెట్టేటందుకు తీవ్రంగా 
ప్రయత్నిస్తున్నారు. రైల్వేని పాక్షిక ప్రైవేటీకరణ, విశాఖ వుక్కును ప్రైవేటు పరం చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారు. 
వీరి ప్రైవేటీకరణ విధానాల వలన తీవ్రంగా నష్టపోయేది రిజర్వేషన్  పొందుతున్న అట్టడుగు ప్రజలే!
ఈ మనువాద ఫాసిస్టు పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు వ్యతిరేకంగా బ్రిటీషు వలస పాలకులు షుమారు 170  సంవత్సరాల క్రితం రూపొందించిన చట్టాలు- IPC ,CRPC  చట్టాలపైన , దేశ ద్రోహ చట్టాలపైన ఆధార పడి ప్రజా ఉద్యమ కారులను, ప్రజా ఉద్యమ సంస్తలను శిక్షలకు గురి చేస్తున్నారు. 

అంబేద్కర్ రాజ్యాంగంలో కల్పించిన హక్కులను దొడ్డి దోవలో ఈనాడు వీరు హరిస్తున్నారు. 
ఈ పరిస్తితిలో రాజ్యాంగ హక్కుల పరిరక్షణకై విశాల ప్రజాస్వామిక వుద్యమాల ఆవశ్యకత ఎంతో వుంది.

నేటి దేశ పరిస్తితులలో మనం అంబేద్కర్ ఆలోచనల వెలుగులో కర్తవ్యాలను రూపొందించు కోవాలి.

కర్తవ్యాలు:

మనువాద శతృవు ఎత్తుగడలను తిప్పి కొట్టడం అనేది మనం నిరంతరం చేయవలసే వుంటుంది.

అంబేద్కర్ వాదుల ప్రధాన కర్తవ్యాలు నేడు నాలుగు కర్తవ్యాలు గా వున్నాయి. 

1. కులాంతర వివాహాలు:

ఈ మనువాద కుల వ్యవస్తను  బలహీన పరచాలి అంటే కులాంతర వివాహాలు చాలా అవసరం. 
రక్త సమ్మిశ్రితం కులాంతర వివాహాల ఫలితంగా జరుగుతుందని అంబేద్కర్ చెప్పారు.

ఈ సందర్భంగా అంబేద్కర్ 
కులాంతర సహపంక్తి భోజనాల కార్యక్రమం 
కుల నిర్మూలనకు  సమగ్రమైనది కాదు అని చెబుతూ 
ఇలా చెప్పారు.

** కుల నిర్మూలనకు వాస్తవిక పరిష్కారం కులాంతర వివాహాలేనని నేను నమ్ముతున్నాను. (కులాంతర వివాహితుల మద్య జరిగే) రక్త సమ్మిశ్రణ
(Fusion of blood)
ఒక్కటే  ఇరువురి మద్య అన్యోన్య అనుబంధ సంబంధ బాంధవ్యాన్ని  నెలకొల్పుతుంది. అలాంటి బాంధవ్య భావ ప్రభావం లేనిదే ఒకర్నించి మరొకర్ని వేరు చేస్తూ కులం కల్పించిన వేర్పాటువాద భావనని తొలగించలేం. 
(20 వ అధ్యాయం 
- కుల నిర్మూలన).**

కులాంతర వివాహాల సందర్భంలో కొందరు ఇలా మాట్లాడుతారు.

ఒక అగ్రకులం ఇంకో అగ్ర కులంలో గానీ, ఒక అగ్ర కులం మరో బిసి కులంలో గానీ వివాహం జరిగితే 
వారు పెదవి విరుస్తారు. ఒక అగ్రకులం మరో దళిత కులంలో మాత్రమే జరిగితే అవి సరయినవి అంటారు.

వేరొకరు అత్యంత 
కుల పీడనలకు గురయ్యే మాల - మాదిగల వంటి కులాలలో మొదట జరగాలి, అప్పుడే 
అంబేద్కరిస్టులు సరయిన దారిలో వున్నట్లు అనుకోవాలి మొదలయిన 
పలు తరహాలుగా మాట్లాడుతారు. 

ఇలాటి వారు తాము చెప్పేవి తప్ప మిగతా విషయాల పట్ల చులకనగా మాట్లాడుతూ వుంటారు.

కులాంతర వివాహాలు ఎవరి మద్య జరిగినప్పటికీ మనం ఆహ్వానించాలి.
“ స్వకుల వివాహాలు తప్ప”మిగతా అన్ని వివాహాలను అంబేద్కర్ వాదులు మరియు ప్రగతిశీల వాదులు తప్పక బలపరచాలి. కులాంతర వివాహాలను ఆచరించాలి, ప్రోత్సహించాలి.

మాల - మాదిగల మైత్రి: 

1985 లో కారంచేడు  మాదిగలపై జరిగిన మారణ కాండకు మాలలు అండగా నిలబడి పోరాడారు, 1991 లో చుండూరు మాలలపై జరిగిన హత్యా కాండకు మాదిగలు అండగా నిలబడి పోరాడారు. 

కానీ ఈనాటి పరిస్తితి చాలా అధ్వాన్నంగా మారింది, 
ఈ రెండు కుల సమూహాల మద్య విభేదాలు, వివాదాలు విద్వేష స్తితికి చేరడం చాలా విషాదకరం.

అంబేద్కర్ ఆలోచనలు - భావజాలం గత 35 సంవత్సరాల నాటి కంటే నేడు మన తెలుగు నేలలో  బాగా పెరిగింది. అదే పరిస్తితిలో ఆ భావజాల కారణంగా ఈ రెండు సమూహాల మద్య విభేదాలు తగ్గవలసింది పోయి , 35 సంవత్సరాల నాటి పరిస్తితితో పోలిస్తే వారి మద్య ఐక్యత ఎన్నో రెట్లు వెనక పట్టులో వుంది.  ఇది చాలా విచిత్రమైన పరిస్తితి. దీనిని సరిచేయ వలసిన బాధ్యత రెండు సమూహాల నాయకత్వాల పైన వుంది.

ప్రైవేటైజేషన్- రిజర్వేషన్లు:

మొత్తం పాలకులు ప్రైవేటైజేషన్ చేస్తూ రిజర్వేషన్ లను నిరాకరించే పరిస్తితి నేడు ఏర్పడి వుంది.
ప్రైవేటైజేషన్ ని వ్యతిరేకిస్తూ  రిజర్వేషన్ లను కాపాడుకునే పోరాటాన్ని చేయవలసిన పరిస్తితిలో నేడు మనం వున్నాము.
ఆ విషయం మీద రెండు సమూహాలు కేంద్రీకరించ వలసి వుంది. ప్రైవేటైజేషన్ వ్యతిరేక పోరాటాన్ని దళిత శక్తులు ఐక్యతా దృక్పథంతో , ఐక్యతను పెంచుకునేలా కలసి కృషి చేయాలి.

రెండు దళిత సమూహాలు యుద్ద విరమణ లేక వివాద విరమణ పాటించి తక్షణ వుమ్మడి సమస్యలపై కలసి పని చేయడం చాలా అవసరంగా వుంది. ఇతర ప్రగతిశీల , వామపక్ష శక్తులు 
“చోద్యం చూడడం”
మాని ఆ రెండు సమూహాల మద్య ఐక్యత అనేది సమాజ పురోగమనానికి చాలా  అవసరమని భావించి తగిన విధంగా తోడ్పాటు అందించేందుకు కృషి చేయాలి.

SC, ST అత్యాచార నిరోధక చట్టాన్ని షుమారు రెండు సంవత్సరాల నాడు  నేటి పాలకులు రద్దు చేయటానికి చేసిన ప్రయత్నాలను మిలిటెంటుగా పోరాడి , ప్రాణ  త్యాగాలతో తిప్పి కొట్టారు. అలాటి పోరాటాలే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా , రిజర్వేషన్ ల రక్షణ కొరకు చేయాలి.

2. బౌద్దం స్వీకరణ:

తాను హిందువుగా పుట్టడం తన చేతిలో లేదని, 
కానీ చనిపోవడం మాత్రం హిందువుగా  జరగదు అని అంబేద్కర్ చెప్పారు.
అందుకు అనుగుణంగానే 1956లో నాగపూర్ దీక్షా భూమిలో ఐదు లక్షల మంది పైగా అనుచరులతో కలసి బౌద్దాన్ని స్వీకరించాడు. ప్రతి
అంబేద్కర్ వాది
బౌద్దం తప్పక స్వీకరించాలని ఆయన చెప్పారు.
కానీ!
ఈరోజు అంబేద్కరిస్టులు అయిన వారు ఎక్కువ మంది క్రిష్టియన్లుగా చెప్పుకుంటూ వున్నారు. ఆచరణలో రిజర్వేషన్లు కోసం మరల 
హిందూ మాల, హిందూ మాదిగ, హిందూ ......
తదితర పేర్లతోనే రిజిష్టర్ లలో వున్న పరిస్తితి.  క్రిస్టియన్  పేరుతో కూడా రిజర్వేషన్ లు  తమ కుల సమూహాలకు అమలు చేసుకోలేక పోవడం జరుగుతున్నది. 
ఈ పరిస్తితి నుండి బయట పడి తాము బౌద్దులుగా మారాలి. ఇంకా తమ సామాజిక రిజర్వేషన్లు  
ఏ మతంలో  తాము వున్నప్పటికీ
కాపాడు కోవాలి, అందుకోసం పోరాడాలి.