నిలువెల్ల పాటై పూసిన గోరటి వెంకన్న..!!

(గోరటి వెంకన్నకు  కేంద్రసాహిత్య అకాడెమీ 
 పురస్కారం లభించిన సందర్భంగా….)



*నిలువెల్ల పాటై పూసిన గోరటి వెంకన్న..!!

*గోరటి వెంకన్న"… ఈ పేరు వినగానే పల్లె కన్నీరు గుర్తొస్తుంది.

*గోరటి వెంకన్న అనగానే… జనం గుండె గోస వినిపిస్తుంది

*తెలంగాణ తల్లి అరచేతి గోరింట గోరటోడి పాట.!!

*గోరటి పాటల్లో స్వఛ్చమైన బతుకుంది.

*గోరటిపాటల్లో నేలతల్లి పడే పురిటి నొప్పుల  
 బాధ వుంది.

*గోరటి పాటల్లో కనుమరుగవుతున్న చేతివృత్తుల ఆర్తి వుంది.

*గోరటి పాటల్లో గొంతెండిపోతున్న వాగుల ఘోష 
 వుంది .

ఆ తాజ్ మహల్ అందాల కన్న.. నా వాగు పిచ్చుక గూళ్లే మిన్న”..

*గోరటి సామాజిక జీవి మాత్రమే కాదు.. సంచార జీవి కూడా.. !

*తోడేకొద్దీ ఊరే అనుభవాల మోట బావి 
 నీటి ఊట ఈ గోరటోడి పాట.

*గోరటి  నిస్సందేహంగా ఈ యుగపు అసలు
సిసలు ప్రాకృతిక కవి.!

*నగరీకరణ మోజులో కొట్టుకు పోతున్న లోకానికి గోరటోడు…. పల్లె అందాల్ని పరిచయం చేస్తాడు.

గోరటి వెంకన్న అనగానే.. అల సెంద్రవంక మన ముందు నిలుస్తుంది.

గోరటి వెంకన్న అనగానే… జనం గుండె గోస వినిపిస్తుంది

గోరటి వెంకన్న అనగానే… బతుకు పాట చిందులు తొక్కుతుంది.

పాటకు పర్యాయపదం గోరటి.. 

మాటకు నిలువెత్తు రూపం గోరటి.

*గోరటి పాటల్లో ఏముంది…..?

*గోరటి పాటల్లో స్వఛ్చమైన బతుకుంది.

"గోరటి పాటల్లో కొండలూ, కోనలూ, పారే సెలయేర్లున్నాయి.

*గోరటి పాటల్లో మేకలు, ఆలమందలున్నాయి.

*గోరటి పాటల్లో ఎగిసిన గోధూళి ఎర్రమబ్బులు
వున్నాయి‌.

*గోరటి పాటల్లో సంచారజనుల బతుకు 
సిత్రముంది.

*గోరటి పాటల్లో పరవళ్లు తొక్కే ప్రకృతి 
 పారవశ్యముంది.

*గోరటిపాటల్లో నేలతల్లి పడే నొప్పుల 
 బాధ వుంది.

 గోరటిపాటల్లో చిదిమేస్తున్న పచ్చదనం
 ఆక్రందన వుంది.

*గోరటి పాటల్లో కనుమరుగవుతున్న 
 చేతివృత్తుల ఆర్తి వుంది.

*గోరటి పాటల్లో గొంతెండిపోతున్న వాగుల 
ఘోష వుంది .

*గోరటిపాటలు… సహజంగా పండే  గోరింట.

*గోరటి పాటలు.. మోదుగ,గన్నేరు పూల 
గంధాలు.

*గోరటి పాటలు.. పల్లె బతుక్కి నిలువుటద్దాలు.

*గోరటోడి పాటలు పల్లెలంత స్వచ్ఛంగా.. 
 పచ్చంగా వుంటాయి.

గోరటి పాటల్లో పల్లె, పల్లె పలుకు, నదీ, సెలయేరూ, 
పిల్ల కాల్వలూ,చెట్టూ చేమలూ, పశువులూ పక్షులూ
పురుగూపుట్రా గంపగుత్తగా కనిపిస్తాయి. మనల్ని పలకరిస్తాయి. మనతో మమేకమవుతాయి. 

*గోరటి పాటల్లో లేనివి ఏమున్నాయి?

*గోరటి పాటల్లో అక్షరాలకు పైపూతల్లేవు.

*గోరటి పాటల్లో తాజ్ మహల్  తళుకుల్లేవు లేవు.

*గోరటి పాటల్లో నగరాల రణగొణ ధ్వనుల్లేవు.

*గోరటి పాటల్లో బడా బాబుల బతుకు గొప్పల్లేవు.

*గోరటి పాటల్లో తెచ్చి పెట్టుకున్న నగా నట్రా లాంటి
 కృత్రిమ అలంకారాలు లేవు.

నగరీకరణ మోజులో కొట్టుకు పోతున్న లోకానికి గోరటోడు…. పల్లె అందాల్ని పరిచయం చేస్తాడు. 
పల్లె బతుకు తీపిని నోటికందిస్తాడు.

*ఓ పుల్లా, పుడకా, ఎండుగడ్డి సిన్నకొమ్మ
సిట్టిగూడు పిట్ట బతుకే ఎంతో హాయి
సిగురుటాకు వగరు పూత లేత పిందె తీపిపండొ
నోటికంది సింతలేక కునుకు తీసె పక్షి  బతుకే స్వర్గమోయీ...ఆ తాజ్ మహల్ అందాల కన్న.. 
నా వాగు పిచ్చుక గూళ్లే మిన్న”.. అంటాడు గోరటి.

తన భాషకు కృత్రిమ సొగసులు అద్దలేదు. పౌడరు పూతలు పూయలేదు..కల్మషం లేక నిత్యం పారే స్వఛ్చమైన  వాగు నీటిలా గ్రామీణ జీవద్భాష
గోరటోడి నాలుకపై  జలజలా  జాలువారుతుంది. 
పాటై ఆటై ఇట్టే ఆకట్టుకుంటుంది.
 
“అస్సోయి.. ఇస్సోయి హైలెస్సా రంగోయీ
విసురోయీ.. గుంజోయీ వల విసిరి గుంజోయీ
ఎద్దుల నాపోయీ.. నీళ్లను దాపోయీ
గంతేసి దూకోయీ.. సెరువంత ఈదోయీ
పిట్టల సుట్టూతా.. పిల్లల పరుగోయీ
కట్టమీద కొంగ బావలూసులోయీ…

గోరటి భాషలో ఎక్కడా తెచ్చిపెట్టుకున్న పైపై మెరుగులుండవు.నిత్యం జనం నోట్లో నానే పల్లె పదాలు, జానపదుల పాటల్లోని పదబంధాల తియ్యందనాలూ కలిసి గోరటి పాటైపరిమళిస్తుం
ది.ప్రకృతికిమల్లే ..పరవశిస్తుంది. జీవ నదిలా
పొంగి, ఉప్పొంగి జనం గుండెల్ని తడిపేస్తుంది.

“పాల నురగల ఏరు పాట దారి చూపింది
గాలికెగసె రెల్లుగడ్డె దరువు నేర్పింది
నీటి తెప్పల ఇసుక తిప్ప వేదికయినది
ఊటసెలిమె పాటలకు తల ఊపి ఊగింది
నెలవంకయే కరుణించి నా తల నిమిరి తడిమింది
నేనల్లుకున్న గుడిసెలో కొలువయ్యి మురిసింది
సల్లంగ తనువెల్లల్లుకొని ఉయ్యాలలూపింది
నిలువెల్ల పాటైపూసినను లోకాన నిలిపింది.”…
.
*గోరటి పాటలు పైరగాలి వీచినట్లు 
లయాత్మకంగా వుంటాయి.

*పాల నురగల యేరు గోరటి పాటలకు దారి చూపుతుంది.

*గాలికెగిసి పడే రెల్లుగడ్డి పాటకు దరువు నేర్పుతుంది.

*ఊట సెలిమె గోరటి పాటలకు తలూపి ఊగుతుంది

గోరటి పాటలు ప్రాకృతిక సందర్భాలతో పెనవేసుకొని  వుంటాయి.

మన కళ్లముందు  కనిపించే సాధారణ సన్నివేశాలే 
పాటలై ఊపిరి పోసుకుంటాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే  తోడేకొద్దీ ఊరే అనుభవాల నాటుబావి నీటి ఊట ఈ గోరటోడి పాట.

*మరి ఈ పాటగాడికి సంగీత జ్ఞానం
ఎలా అలవడింది..?

"రాగఛాయలు మన్మథరావు నుంచి నేర్చుకున్నాను.
పాడడంలోని మెళకువలు పీర్ అహమ్మద్ నుంచి 
నేర్చుకున్నాను.మంద్ర స్థాయిలో పాడితే పాట మాధు
ర్యం ఎలా వుంటుందో ఆయనే నేర్పాడు.వడ్ల వెంకయ్య దగ్గర పద్యం పాడడాన్ని నేర్చుకున్నాను.అలాగే జనార్దన్,
కనిగిరి వెంకట‌రమణలు దగ్గర చాలా మెళుకువలు నేర్చుకున్నాను.దుర్గి మండలం ధర్మాలను కోటేశ్వర రావు దగ్గర చాలా కాలం శిష్యరికం చేసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.శ్రీకాకుళం భాస్కర్ వద్ద కూడా కొన్ని
విషయాలు తెలుసుకున్నాను." అంటారు గోరటి.!!

*సంచార జీవి." గోరటి"!!.

గోరటి సామాజిక జీవి మాత్రమే కాదు.. సంచార జీవి కూడా.. గోరటోడు  కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే…… భౌగోళికంగా, భాషాపరంగా తెలంగాణపై ఎంత పట్టుందో, ఆంధ్రా, రాయలసీమ, ఉత్తరాంధ్ర  ప్రాంతాలపై, అక్కడి వాడుక భాషపై కూడా గోరటికి అవగాహన వుంది. కవి ప్రాకృతిక, ప్రాపంచిక అనుభవాలతోప్రయాణించినపుడు కవిత్వం సారవంతమవుతుంది. గోరటి దేశ సంచారి. వివిధ ప్రాంతాల్ని సందర్శించి, అక్కడి పరిస్థితుల్ని ఆకళింపు చేసుకున్నాకే గొంతు సవరిస్తాడు. పాటకు ప్రాణం పోస్తాడు

*సంచారమంటే…?

"సంచార మెంటే కేవలం కాళ్ళతో తిరగడమే కాదు.
ఎవరైనా ఒక చోట ఆగకూడదు. చాలానే శీలమైన జగత్తులో నిరంతరం ప్రయాణించాలి.మార్క్సిజం,
దళితవాదం,మైనారిటీ వాదం ..ఇవన్నీ ప్రయాణాలే.
నిత్యంచలనం వుండాలి.ప్రయాణం ఎక్కడా ఆగ
కూడదు.మనిషెప్పుడూ నిత్యం ప్రయాణీకుడిలా
వుండాలంటారు " గోరటి.

" సంచారమంటే “ గోరటికి ఎంత ఆనందమో 
 ఈ కింది పాటను చూస్తే తెలుస్తుంది.

“సంచారమే ఎంతో బాగున్నది
దీనంత ఆనందమేదున్నదీ
ఇల్లు పొల్లు లేని, ముల్లె మూటలేని
వెంబడించే వెర్రి జ్ఞాపకాలు లేని
సేద తీర సెరువు కట్టున్నది
నీడ కోసం సింత సెట్టున్నది
జోలనూపె  గాలి పిట్టున్నది
గుర్తులేని గుడ్డి నిదరున్నది
బరువు దిగిన గుండె బలె ఉన్నది
సంచారమే సంతసంగ  వున్నది “

గోరటి జీవితమే సంచారం. ప్రాకృతిక,ప్రాపంచిక అనుభవాల సమాహారం. కాళ్ళూ, కళ్ళూ ఓ చోట నిలువవు. మనసుతో పాటు అదే పనిగా ప్రయాణిస్తూ వుంటాయి. నల్లేరు నడకలో కాళ్లకు పల్లేరు గుచ్చుకున్నా.. గోధూళి ఎగిసి కళ్లలో పడినా…., పారే వాగు వంకలు, పచ్చనాకు రెమ్మలు, సరస్సులు, కోనేటి కొలను కాల్వలు, ఊరేటి ఊట సెలిమెలు, సిందాడె నీటి మువ్వలు, సిన్నారి సినుకు గవ్వలు కనిపించినా., పాటవ్వా
ల్సిందే.. గోరటోడి గొంతులో చిందేయాల్సిందే..!

గోరటి వెంకన్న సంప్రదాయ కవి కాదు.. ప్రకృతిలో సహజంగా మొలకెత్తిన కవిత్వ చెట్టులాంటి వాడు. 

"గోరటి వెంకన్న వాగ్గేయకారుడు.జనపదాల తాత్త్విక 
 గోసాయి సాంప్రదాయానికి చెందిన కవి .నిజానికి  
 అతని గొంతులోని జీర గొంతులోనిది  కాదు..ఆది
 అతని హృదయావేదన..".అంటారు వరవరరావు
 గారు.

సహజ కవి. వాగ్గేయకారుడు. ఆధునిక తెలుగు కవిత్వంలో నెల్లూరు రామానాయుడు, గద్దర్, కాళోజి 
ఈ కోవకు చెందిన వారే. రామానాయుడు, కాళోజి, 
గద్దర్ సామాజిక, రాజకీయ పాటలకు, కవిత్వానికి ప్రాధాన్యమిస్తే.. గోరటి మాత్రం ప్రాకృతిక, సామాజిక, సహజ వనరులకు ప్రాధాన్యమిచ్చి పాటలల్లాడు. 
కవిత్వం రాశాడు. ఈ కోణంలో చూస్తే గోరటి ప్రత్యేకంగా కనిపిస్తాడు. వినిపి‌స్తాడు.

“ఏరు గుండ్లకమ్మేరు తాను.. 
పరుగెత్తెటి నడక తీరెంత జోరు “
(ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ యేరు)

ఏటిపాట…పేరుతో గుండ్లకమ్మ పుట్టుపూర్వోత్త
రాలు… అది ప్రవహించే దారి, తీరుల ముచ్చట్లను ఈ పాటలో విశదపరిచిన విధం ఎంత చెప్పినా తక్కువే!

“పిట్ట బతుకు ఎంతో హాయి”…ఈ పాటలో పిట్టబతుకు గురించి గోరటి రాసిన తీరు నభూతో 
న భవిష్యతి!

‘పూటకుంటె అంతె సాలు రేపు ఎట్లన్న ధ్యాసలేదు/ లోభితనం ఎరుక లేదు దాసుకునేటి గుణం లేదు’…

పిట్టతో పోల్చి స్వార్ధపరుడైన మానవ నైజాన్ని అన్యాపదేశంగా ఎత్తి పొడిచిన గోరటి పాట రోకటి 
పోటు కంటే ఫ్రభావవంతమైనది.

*‘గోరువంక రామసిలుక పావురాయి పాలపిట్ట నరుడు పెట్టిన పేర్లు తప్ప తనకు ఊరు పేరు లేదు 
ఊరు పేరు ఉనికి కోసం ఈసమంత ఆరాటం లేదు.!

ఇది మనుషులపై, వారి మెరమెచ్చుల తాపత్రయంపై గోరటి విసిరిన విసుర్రాయి.ప్రకృతిలో చెట్టూ, పుట్టా, పిట్టా వంటి వాటి నుంచి నేర్చుకోవల్సింది ఎంతో వుందంటాడు‌ గోరటి. ఆ రకంగా మనిషి కంటే ప్రకృతే గొప్పదన్న నిజాన్ని సైంటిస్ట్ లా నిరూపిస్తాడు.

బతుకమ్మ గురించి రాసినా,సెరువు గురించి తపించినా, ఉగ్గుపాలలో అమ్మతనాన్ని చూపినా, సంత గురించి చెప్పినా, ఏటిపాటను ఆలపిచినా, వాగు గురించి కలవరించినా, అది గోరటికే చెల్లింది. మనసుతో రాసే కవి.. మమకారంతో రాసే కవి,….. వాగు వంకల్లా.. పిల్లగాలిలా..సెట్టు సేమలా సుట్టూ గిరిగీసి మరీ తన పాటతో మనల్ని మమేకం చేస్తాడు. గోరటి నిస్సందే
హంగా ఈ యుగపు అసలు సిసలు ప్రాకృతిక కవి.

*సహజపరిమళమే మిన్న..!!

ఎవరైనా తమ పాటకు గుర్తింపు వఛ్చి..తాము
సెలబ్రిటీగా మారాలనుకుంటారు.గోరటి మాత్రం 
ఇందుకు ససెమిరా!అంటాడు.

"నా వరకు పాపులారిటీ నరకమనిపిస్తుఃది.సెలబ్రిటీ
అయోతే నెను అసహ్యంగా తయారవుతానేమోనని
భయమేస్తుంది.నాదైన లోకంలో నన్ను వుండనిస్తే 
చాలు.." అంటారు గోరటి వెంకన్న.అయితే ఆయన 
వద్దన్నా ఆయన పాటకే కాదు ….గోరటికి కూడా పాపులారిటీ వచ్చేసింది.గోరటి ఇప్పుడు సెలబ్రిటీ అయ్యాడు.కానీ..ఆ సెలబ్రిటీ ఛాయలు ఆయన
వ్యక్తిత్వంలో ఎక్కడా తొంగి చూడక పోవడం 
గమనార్హం.

*పాటలు కాకుండా ఇంకా ఏం రాశారు..?

" పాటలు కాకుండా కొన్ని కీర్తనలు రాశాను.ఒకటీ
రెండు వచన కవితలు రాశాను.నవల రాద్దామని మొదలుపెట్టాను కానీ..యింకా పూర్తి చేయలేదు.
ఛందస్సు నేర్చు కొని  వేమనలా ఆటవెలది లో
 పద్యాలు రాయాలని వుంది.మన మనసు చేసే
ఇంద్ర జాలం పైన ఓ నవల రాయాలని వుంది.."
అంటారు గోరటి.

*సినిమా పాటలు రాయొచ్చా?

"గోరటి వెంకన్న సినిమాలకు పాటలు రాయకూడద
న్న ఓ వింత వాదనొకటి బయలుదేరింది.సినిమాకు
పాటలు రాయడం తప్పైతే..మరి పెట్టుబడిదారుల పత్రికలకు కవితలు కూడా రాయకూడదు కదా..అది
తప్పయితే..ఇది కూడా తప్పే కదా? మీడియా ఏదైనా ఉపయోగించుకోవడంలో తప్పులేదని తనది నా అభిప్రాయం.".అన్నారు గోరటి.!!

గ్లోబల్ విధ్వంసం లో ప్ర్రాకృతిక  పాటను బతికించే
పల్లె కోయిల..గోరటి వెంకన్న.దిగుళ్ళతో..హృదయం
లోపలి పగుళ్ళతో బీటలు వారిన మనిషి జీవితానికి
పాట ద్వారా మలాం పూసి గాయాలు నయం చేసే 
సంగీత వైద్యుడు గోరటి..అందు గోరటి సమ్ థింగ్
స్పెషల్.‌

ప్రభుత్వ అవార్డులూ, రివార్డులూ ఆయన పాటకు గుర్తింపు కాదు… కేవలం గౌరవం మాత్రమే .గోరటి పాట ప్రజల నాలుకలపై పలకడమే గోరటికి నిజమైన గుర్తింపు. 
గోరటి వెంకన్నకు ఆ గుర్తింపు ఎప్పుడో వచ్చేసింది!!   

*ఎ.రజాహుస్సేన్.
 నంది వెలుగు.