విజ్ఞాన్స్‌ లారాతో ఇంటర్నేషనల్‌ రివేచర్‌ కంపెనీ అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ లారాతో ఇంటర్నేషనల్‌ రివేచర్‌ కంపెనీ అవగాహన ఒప్పందం


చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలతో చెన్నైలోని ఇంటర్నేషనల్‌ సంస్థ అయినటువంటి రివేచర్‌ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో రివేచర్‌ కంపెనీ హెచ్‌ ఆర్‌ డైరక్టర్‌ ఒఫిలియా అశోక్, క్యాంపస్‌ హైరింగ్‌ హెడ్‌ జేమ్స్‌ స్టీఫెన్‌లకు విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను అందజేసారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్‌ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన విద్యార్థులు మూడో సంవత్సరంలో ఉండగానే కార్పొరేట్‌ ఎమ్‌ఎన్‌సీల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన తర్ఫీదును అందించి ఇన్ఫోసిస్, యూఎస్‌టీ గ్లోబల్, హెక్సా వేర్‌ వంటి కంపెనీలలో అత్యధిక వేతనం రూ.8 లక్షలతో నియామకం చేయటం జరుగుతుందన్నారు. ఈ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ అవగాహన ఒప్పందం వలన విద్యార్థులకు మాత్రమే కాకుండా అధ్యాపకులకు కూడా అత్యాధునిక టెక్నాలజీల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. రీవెచర్‌ సంస్థ నిపుణులు ఇండస్ట్రీ లైవ్‌ ప్రాజెక్టులను విద్యార్థులకు ట్రైనింగ్‌ ఇవ్వటం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు అత్యధిక ప్యాకేజీతో ఉద్యోగాలు సాధించటానికి అవకాశం ఉందన్నారు. రెవేచర్‌ కంపెనీ హెచ్‌ ఆర్‌ డైరక్టర్‌ ఒఫిలియా అశోక్‌ మాట్లాడుతూ విద్యార్థులకు మేము అందించే ప్రత్యేక శిక్షణ ద్వారా ఇండస్ట్రీకు– అకడమియాకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించవచ్చని తెలియజేసారు. రీవేచర్‌ కంపెనీ క్యాంపస్‌ హైరింగ్‌ హెడ్‌ జేమ్స్‌ స్టీఫెన్‌ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణతో పాటు అదనంగా ఫుల్‌స్టాక్‌ జావా, బిగ్‌డేటాపై కూడా శిక్షణ ఇస్తామన్నారు.