విజ్ఞాన్స్‌ లారాలో ఘనంగా ఫ్రెషర్స్‌ డే వేడుకలు

విజ్ఞాన్స్‌ లారాలో ఘనంగా ఫ్రెషర్స్‌ డే వేడుకలు

చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ లారా ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫ్రెషర్స్‌డే వేడుకలు వైభవంగా నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్ర కుమార్‌ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులకు నైపుణ్యంతో పాటు పరిశోధనాత్మక ఆలోచనలు కలిగిన విద్యా విధానం ఉండాలని తెలిపారు. కార్పొరేట్‌ ప్రపంచంలో యువతకు విస్తృత అవకాశాలున్నాయని, వాటిని సాధించేందుకు అవసరమైన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. వ్యవసాయం, రక్షణ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేసి అభివృద్ధి చేసేలా పరిశోధనలు చేయాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక విజన్‌తో ముందుకు వెళ్లాలని, క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని అన్నారు. ఒత్తిడి లేకుండా మంచి వాతావరణంలో బోధన చేస్తే మంచి ఆలోచనలు పుట్టుకొస్తాయని తెలిపారు.  ఎవరి జీవితం ఎలా ఉండాలనేది వారి కష్టంపైనే ఆధార పడి ఉంటుందని తెలిపారు. విద్యార్థులు వారి ఆలోచనలు, జ్ఞానాన్ని సహచరులతో పంచుకోవాలని సూచించారు. అంతకుమించి గొప్ప అధ్యయనం మరోటి ఉండదని తెలిపారు. పెద్ద పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని అందుకునేందుకు పరుగిడాలని చెప్పారు.
కట్టిపడేసిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆటపాటలు, సంగీత వాయిద్యాలతో వర్సిటీ ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.