విజ్ఞాన్స్‌లో వైభవంగా త్యాగరాజ ఆరాధన

విజ్ఞాన్స్‌లో వైభవంగా త్యాగరాజ ఆరాధన

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకరైన త్యాగరాజ  175వ ఆరాధన సందర్భంగా విద్యార్థులు త్యాగరాజ కీర్తనలు ఆలపించారని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాదోపాసన ద్వారా భగవంతున్ని తెలుసుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారుడని పేర్కొన్నారు. ఆయన కీర్తనలు శ్రీరామునిపై అతనికి గల విశేషభక్తిని, వేదాలు, ఉపనిషత్తులపై అతనికున్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయన్నారు. అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజును కర్ణాటక సంగీతానికి మూలస్తంభంగా పిలుస్తారని పేర్కొన్నారు. త్యాగరాజు జన్మదినాన్ని జాతీయ సంగీత దినోత్సవంగా నిర్వహిస్తారని విద్యార్థులకు తెలియజేసారు. రామేతి మధురం వాచం అన్నట్లు 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించి, స్వీయానుభవ భావనలే కృతి రూపంలో మలచి గాంధర్వగాన మధురానుభూతిగా లోకానికి అందించిన ఘనత ఒక్క త్యాగరాజుకే దక్కుతుందన్నారు. త్యాగరాజు దాదాపు 800 కీర్తనలు రచించాడని విద్యార్థులకు తెలియజేసారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆలపించిన త్యాగరాజ కీర్తనలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి.