విజ్ఞాన్‌లో మెగా రక్తదాన శిబిరం

విజ్ఞాన్‌లో మెగా రక్తదాన శిబిరం


చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం విద్యార్థులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ తెలిపారు. వర్సిటీలోని ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం వారు గుంటూరులోని నీడ్స్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో యూనివర్సిటీలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతి రెండు సెకన్లకు ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరికి రక్తం అవసరం అవుతూనే ఉన్నదని తెలిపారు. విద్యార్థులు తాము రక్తదానం చేయడంతోపాటు మిత్రులను కూడా ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కోరారు. ఇంచార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పీఎంవీ రావు మాట్లాడుతూ రక్తదానం చేశాక శరీరం తాను కోల్పోయిన రక్తాన్ని 48 గంటల్లోగా తిరిగి భర్తీ చేసుకుంటుందని వెల్లడించారు. రక్తాన్ని కృత్రిమంగా తయారుచేయలేమని, ఎవరైనా దానం చేస్తేనే లభిస్తుందని వెల్లడించారు. ప్రమాదాల సమయంలో బాధితులకు రక్తం అవసరం ఎంతో ఉంటుందని చెప్పారు. రక్తదానం వల్ల నేడు ఎంతో మందిని వైద్యులు బతికించగలుగుతున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకి చెందిన 326 మంది విద్యార్థులు రక్తదానం చేశారు.