విజ్ఞాన్స్‌లో ఘనంగా మాతృభాషా దినోత్సవం

విజ్ఞాన్స్‌లో ఘనంగా మాతృభాషా దినోత్సవం
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని వర్సిటీ ఇంచార్జి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ కేవీ క్రిష్ణకిషోర్‌ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘బహుళ భాషా అభ్యసనానికి సాంకేతిక వినియోగం: సవాళ్లు, అవకాశాలు’’ అనే ఇతివృత్తంతో 2022 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించాలని యునెస్కో పిలుపునిచ్చిందన్నారు. విద్యార్థులకు వీలైనంతవరకు మాతృభాషలోనే విద్యాభ్యాసం జరగాలన్నారు. 2020 ఫిబ్రవరిలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్వహించిన ఓ సర్వేలో 83 వేల మంది విద్యార్థుల్లో దాదాపు 44శాతం తమ మాతృభాషలో ఇంజినీరింగ్‌ చదివేందుకు ఆసక్తి చూపుతూ ఓటు వేశారని పేర్కొన్నారు. ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో వందలాది భాషలు, వేలాది మాండలికాలకు నిలయమని, భాషా సాంస్కృతిక వైవిధ్యమే ప్రపంచంలో మన దేశానికి ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టిందని తెలియజేసారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, నగదు బహుమతులను అందజేసారు.