విద్యార్థికి చదువే వ్యసనమవ్వాలి

విద్యార్థికి చదువే వ్యసనమవ్వాలి

పంచ సహస్రావధాని డాక్టర్‌ మేడసాని మోహన్‌

విద్యార్థులకు చదువే వ్యసనమవ్వాలని పంచ సహస్రావధాని డాక్టర్‌ మేడసాని మోహన్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో అవధానంపైన ప్రత్యేక ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ మేడసాని మోహన్‌ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజూ ధ్యానం చేయటం వలన ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంచుకోవచ్చన్నారు. ఏకాగ్రత, ధారణశక్తిని మించిన బలం విద్యార్థులకు ఏదీ లేదన్నారు. విద్యార్థులు దురలవాట్లకు లోను కాకూడదన్నారు. గురువు అనుగ్రహం ఉన్న విద్యార్థులు ఏదైనా సాధిస్తారని కితాబిచ్చారు. చదువుకోవడం వలన కలిగే ప్రయోజనాలు, చదువుకోక పోతే జరిగే అనర్థాలను రామాయణం, మహాభారతంలోని సన్నివేశాలను వివరిస్తూ విద్యార్థులకు తెలియజేసారు. ప్రతి విద్యార్థి నిబద్ధతతో మనస్సును లగ్నం చేసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ జీవితంతో వారి అంతిమ లక్ష్యాలను చేరుకోవాలని విద్యార్థులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్, విజ్ఞాన్స్‌ జూనియర్‌ కాలేజీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.