ప్రతి విద్యార్థిలో మానవత్వం వెల్లివిరియాలి

ప్రతి విద్యార్థిలో మానవత్వం వెల్లివిరియాలి

  విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య

యూనివర్సిటీలో విద్యనభ్యసించే ప్రతి విద్యార్థిలో మానవత్వం వెల్లివిరియాలని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య పేర్కొన్నారు.  ‘యంగ్‌ జనరేషన్‌ వెల్ఫేర్‌ సొసైటీ’ పేరుతో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన కొందరు విద్యార్థులు విజయవాడ, గుంటూరు, తెనాలి, రాజమండ్రి, హైదరాబాద్, చీరాల ప్రాంతాలలో ప్రజలకు అవసరమైన 500 సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహించిన సందర్భంగా విద్యార్థులకు ప్రత్యేక అభినందన సభను ఏర్పాటుచేసారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ తమ యూనివర్సిటీకు చెందిన విద్యార్థులు 500 సామాజిక, సేవా కార్యక్రమాలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థి దశలోనే ఇటువంటి సేవాకార్యక్రమాలను నిర్వహించడం వలన వారిలో నైపుణ్యాలు మెరుగుపడుతాయన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా కరోనా సమయంలో అనాధలకు, రోడ్డు పక్కన నివసించే వారికి, వృద్ధులకు భోజనాలు పంచిపెట్టడంతో పాటు అవసరమైన వారికి కూరగాయలు, నిత్యావసర సరుకులు, బట్టలు అందించారన్నారు. అంతేకాకుండా అనాథ ఆశ్రమాలలో చదువుకుంటున్న విద్యార్థులకు బట్టలు, పుస్తకాలు పంచిపెట్టారని తెలియజేసారు. వివిధ రకాల వ్యాధులతో బాధపడే 200 మందికి దాదాపు రూ.11,65,350 పైగా అవసరమైన ఆర్థిక సహాయాలను కూడా అందించారని వెల్లడించారు. కరోనా సమయంలో పాజిటివ్‌ అయిన వారికి సాంకేతిక టెక్నాలజీను ఉపయోగించి హాస్పిటల్స్‌లలో బెడ్స్‌ ఏఏ ప్రాంతాలలో ఖాళీ ఉన్నాయో తెలియజేయడంతో పాటు ఆక్సిజన్‌ సిలిండర్లను కూడా అందజేసారు. ప్రమాదాల్లో గాయపడటం, గుండె ఆపరేషన్లకు అవసరమయ్యే రక్తాన్ని టీమ్‌ సభ్యులే స్వయంగా వెళ్లి ఇవ్వడంగానీ, ఏర్పాటు చేయడంగానీ చేస్తున్నారు. గుండె సమస్యలు, కిడ్నీ, రోడ్డు ప్రమాదాలు, జనరల్‌ మెడిసిన్‌ సమస్యలతో బాధపడే వారికి ఆర్థిక సహాయం అందజేసి వారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లోని పలు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి వారిని చైతన్యపరచడం, వివిధ రకాల సమస్యలపై వారికి అవగాహన కల్పించడం చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు, వికలాంగులకు మెడికల్‌ కిట్స్‌ను అందజేయడంతో పాటు వాటిని ఎలా వినియోగించాలో తెలియజేస్తున్నారు. దురదృష్టవశాత్తు వికలాంగులుగా మారిన వారికి యంగ్‌ జనరేషన్‌ టీమ్‌ సభ్యులు వీల్‌చైర్లు అందజేయడంతో పాటు వృద్ధులకు కర్రలు అందజేస్తున్నారు. నారీ శక్తి అనే పేరుతో మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలకు అవసరమైన పౌష్టిక ఆహార పదార్థాలు, మెడిసిన్‌ వంటివి అందిస్తున్నారు. పలు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి ఆడపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు శానిటరీ పాడ్స్‌ను అందజేసారు. గ్రీన్‌ యాత్ర అనే పేరుతో మొక్కలను నాటడం, వాటిని కాపాడటం, ప్రజలను చైతన్యపరచడం వంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. రోడ్డు పక్కన ఉండే జంతువులకు ఆహారాన్ని అందజేస్తున్నారు. పంట చేతికందిన సమయంలో అకాల వర్షాలతో ముంచెత్తిన నివార్‌ తుఫాన్‌ బాధిత రైతులకు అండగా నిలవడంతో పాటు పొలంలో తడిసిపోయిన పంటలను రైతులతో కలిసి కోత కోసి పంటను వారి ఇళ్లకు చేర్చారు. యంగ్‌ జనరేషన్‌ వెల్ఫేర్‌ సొసైటీ పేరుతో జాతీయస్థాయిలో రిజిస్ట్రేషన్‌ కూడా నమోదు చేసుకున్నారు. అనంతరం ‘యంగ్‌ జనరేషన్‌ వెల్ఫేర్‌ సొసైటీ’ ప్రెసిడెంట్‌ షేక్‌ సాధిక్, వైస్‌ ప్రెసిడెంట్‌ శశికిరణ్, సెక్రటరీ షేక్‌ సావేజ్, మెంటర్స్‌ సుష్మకొణికి, కాటూరి అహిమాంష్, లీల, 200 మంది సభ్యులకు ప్రశంసా పత్రాలను అందజేసారు.