ఆర్గానిక్‌ వ్యవసాయంతోనే సాధ్యం

ఆర్గానిక్‌ వ్యవసాయంతోనే సాధ్యం

  పద్మశ్రీ డాక్టర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు

  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా మహిళలకు శిక్షణా కార్యక్రమం

రైతులు లాభాలు గడించాలంటే ఆర్గానిక్‌ వ్యవసాయంతోనే సాధ్యమని రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని కెమికల్‌ ఇంజినీరింగ్, ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ సెల్, అగ్రికల్చర్‌ అండ్‌ హార్టీ కల్చర్‌ డిపార్టమెంట్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ పండ్లు కూరగాయల కోత అనంతరం వాటి నిలువ ఉంచే విధానాలు, వాటికి అదనపు విలువ జోడింపు’’ అనే అంశాలపై నారాకోడూరు, చేబ్రోలు మండలలోని మహిళలకు ప్రత్యేకంగా 3 రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ డాక్టర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వివిధ అధ్యయనాలు వెలువరించిన అంచనాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా రైతులు ఉత్పత్తి చేసిన ఆహారంలో మూడింట ఒక వంతు వృథాగా పోతుందని కార్యక్రమానికి హాజరైన మహిళలకు, విద్యార్థులకు తెలియజేసారు. రైతులు పంటను పండించిన తర్వాత వాటిని కోయడం, ప్రాసెసింగ్, గ్రేడింగ్, రవాణా, మార్కెటింగ్‌ చేసేలోగా కొంత పంటను నష్టపోతున్నారని తెలియజేసారు. అదే మనం ఆధునిక పద్ధతులను వినియోగించి వాటికి వాల్యూ అడిషన్‌ జోడించినట్లైతే పంటను ఎక్కువ కాలం నిల్వ ఉంచవచ్చునని తెలియజేసారు. ప్రాసెస్‌ చేసిన అనంతరం వాల్యూ అడిషన్‌ చేయడం వలన వాటిని దాదాపు ఏడాదిపాటు వినియోగానికి అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాలన్నారు. దీనివలన సమయం కలిసి రావడంతోపాటు పనులు కూడా త్వరగా పూర్తి అవుతాయని తెలియజేసారు.