ఆస్తుల కంటే గుణం ముఖ్యం

ఆస్తుల కంటే గుణం ముఖ్యం

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ క్యాంపస్‌ రిలేషన్స్‌ హెడ్‌ ఆశిష్‌ భల్లా

జీవితాన్ని తేలికగా తీసుకోవద్దు: టీవీఎస్‌ సుందరం ఫాస్ట్నర్స్‌ లిమిటెడ్‌ సీనియర్‌ ప్లాంట్‌ ఇంచార్జ్‌ హెచ్‌ఆర్‌ పవన్‌కుమార్‌ అరవల్లి

విజ్ఞాన్‌లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మానం

ఆకట్టుకున్న శ్రీరామనవమి వేడుకలు

చదువు, ఆస్తుల కంటే మనిషికి గుణం ముఖ్యమని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ క్యాంపస్‌ రిలేషన్స్‌ హెడ్‌ ఆశిష్‌ భల్లా తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో చదువుతూ ఈ ఏడాది ప్రాంగణ ఎంపికల ద్వారా ఆయా సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఆదివారం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఘన సత్కారం కార్యక్రమం నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూనివర్సిటీలో ఈ ఏడాది మొత్తం 1314 మంది విద్యార్థులు ప్రాంగణ ఎంపికల ద్వారా 85 కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. మొత్తం మీద 90  శాతం మంది విద్యార్థులు ఆయా సంస్థల్లో కొలువులు కొల్లగొట్టారు. ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులందరినీ ఆదివారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ క్యాంపస్‌ రిలేషన్స్‌ హెడ్‌ ఆశిష్‌ భల్లా మాట్లాడుతూ భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని చెప్పారు. ఈ సృష్టి నడవడానికి ధర్మమే కారణమని తెలిపారు. ధర్మాన్ని తప్పకుండా పాటించేవారంతా సుఖసంతోషాలతో హాయిగా బతుకుతారని చెప్పారు. మన దేశానికి ఇప్పుడు కావాల్సింది ఒట్టి ఇంజినీర్లు కాదని, విలువలున్న ఇంజినీర్లని తెలిపారు. నైపుణ్యాలకంటే నైతిక విలువలే విద్యార్థులకు గొప  ఆస్తి అని తెలిపారు. పిల్లలందరి ఉనికికి తల్లిదండ్రులే కారమని పేర్కొన్నారు. తల్లిదండ్రుల త్యాగాలను ఎప్పటికీ మరువద్దని యువతకు సూచించారు. 

జీవితాన్ని తేలికగా తీసుకోవద్దు: టీవీఎస్‌ సుందరం ఫాస్ట్నర్స్‌ లిమిటెడ్‌ సీనియర్‌ ప్లాంట్‌ ఇంచార్జ్‌ హెచ్‌ఆర్‌ పవన్‌కుమార్‌ అరవల్లి
మరో అతిథిగా హాజరైన  పవన్‌కుమార్‌ అరవల్లి మాట్లాడుతూ జీవితం మనం అనుకున్నంత తేలికైనదేం కాదని తెలిపారు.  విద్యార్థులు శ్రమనే నమ్ముకోవాలన్నారు. ఐఐటీల నుంచి వస్తున్న వారి కంటే సాధారణ కళాశాలల నుంచి వస్తున్న విద్యార్థుల్లోనే క్షేత్రస్థాయిలో పని విషయంలో చాలా ఆసక్తి ఉంటోందన్నారు. 


విజ్ఞాన్‌ మాత్రమే ఇలా: లావు రత్తయ్య
విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ మన రాష్ట్రంలోనే ఒక్క విజ్ఞాన్‌ యూనివర్సిటీ మాత్రమే ఇలా తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమాన్ని శ్రీరామమనవమి పర్వదినాన అనవాయితీగా నిర్వహిస్తోందని తెలిపారు. విజ్ఞాన్‌ యూనివర్సిటీకి చెందిన 1314 మంది పిల్లలు చాలా పెద్ద సంఖ్యలో మంచి ఉద్యోగాలు సాధించగలిగారని ఆనందం వ్యక్తంచేశారు. వీరు ఉద్యోగాలు సాధించడం వలన 1314 కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. విద్యార్థుల వ్యక్తిత్వాన్ని మార్చడం, వర్సిటీలో చేరిన మొదటి నాలుగునెలల్లోనే విద్యార్థులను ఇంటర్‌ విద్యావ్యవస్థ నుంచి పూర్తిగా బయటకు వచ్చేలా చేయగలగడం, విజ్ఞాన్‌లో చేరే పిల్లల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచే వస్తున్నారనే ఉద్దేశంతో కేంబ్రిడ్జి యూనివర్సిటీ సహకారంతో ఆంగ్ల భాష నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడం, నాయకత్వ స్ఫూర్తి, సృజనాత్మకత, నైపుణ్యాలు పెంపొందించడం కోసం ప్రత్యేక శిక్షణలు కొనసాగించడం, విద్యార్థులతో అధ్యాపకబృందం నిరంతరం మద్దతుగా నిలబడటం లాంటి అంశాల వల్ల విద్యార్థులు విజయం సాధించగలిగారని వివరించారు. 

సవాళ్లను అధిగమించాలి : విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు
విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ విద్యార్థులు అన్ని అంశాల్లో చాలా బాగుండబట్టే ఈ స్థాయిలో ఉన్నత ఉద్యోగాలు సాధించగలిగారని తెలిపారు. ఈ ఉద్యోగంతోనే అంతా సాధించినట్టు కాదని, అసలు సిసలు జీవితం ఇక ఇప్పటి నుంచే మొదలు కానుందని విద్యార్థులను అప్రమత్తం చేశారు. మహానుభావుల జీవితాలను చదివి సవాళ్లను ఎలా అ«ధిగమించాలో నేర్చుకోవాలని సూచించారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. 

విజ్ఞాన్స్‌కు విద్యార్థులే అంబాసిడర్స్‌ : వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌
విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు విద్యార్థులే బ్రాండ్‌ అంబాసిడర్స్‌ని వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ పేర్కొన్నారు. మారుతున్న శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్న అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థి విజన్‌తో ముందుకెళ్లాలని, క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు. అనంతరం ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులందరికీ ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘన సత్కారం అందజేశారు. కార్యక్రమంలో కార్యక్రమంలో టీవీఎస్‌ సుందరం ఫాస్ట్నర్స్‌ లిమిటెడ్‌ సీనియర్‌ ప్లాంట్‌ ఇంచార్జ్‌ హెచ్‌ఆర్‌ పవన్‌కుమార్‌ అరవల్లి, విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య, విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు,  వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, కన్వీనర్‌ డీ.విజయక్రిష్ణ, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.