గుంటూరు జీజీహెచ్ ప‌రిస్థితుల‌పై ఆగ్ర‌హం


రంగంలోకి మంత్రి విడ‌ద‌ల ర‌జని

- జీజీహెచ్ ప‌రిస్థితుల‌పై ఆగ్ర‌హం

ఏపీలో మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రిగా ప‌ద‌విని ద‌క్కించుకున్న చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌దల ర‌జని మంత్రి హోదాలో విధి నిర్వ‌హ‌ణ‌లోకి దూకేశారు. బుధ‌వారం మంత్రి హోదాలో ఆమె గుంటూరు గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్ (జీజీహెచ్‌)ని త‌నిఖీ చేశారు. ఆసుప‌త్రిలోకి వెళ్లిన ఆమె మొత్తం ఆసుప‌త్రిలోని అన్ని విభాగాల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తూ సాగారు.ఈ సంద‌ర్భంగా అత్య‌వ‌స‌ర చికిత్సా విభాగంలో ఏసీలు ప‌నిచేయ‌ని తీరును గుర్తించిన మంత్రి... ఏసీలు ఎప్ప‌టి నుంచి ప‌నిచేయ‌డం లేద‌ని అధికారుల‌ను ప్ర‌శ్నించారు. 6 నెల‌లుగా ఏసీలు ప‌ని చేయ‌లేద‌ని తెలుసుకున్న ఆమె ఇంత‌కాలంగా ఏసీలు ప‌నిచేయ‌కుంటే మీరేం చేస్తున్నారంటూ ఎలక్ట్రిక్ విభాగం ఏఈని నిల‌దీశారు. ఇక‌పై విధి నిర్వ‌హ‌ణ‌లో నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తే స‌హించేది లేద‌ని ఆమె హెచ్చరిక‌లు జారీ చేశారు. ఆ త‌ర్వాత ఆసుప‌త్రిలోని అన్ని విభాగాల‌ను ర‌జని ఆయా విభాగాల్లోని స‌మ‌స్య‌లపై అధికారుల‌తో చ‌ర్చించారు.