ఖోఖో పోటీల్లో విజ్ఞాన్స్‌ వర్సిటీకు రెండు స్వర్ణాలు

ఖోఖో పోటీల్లో విజ్ఞాన్స్‌ వర్సిటీకు రెండు స్వర్ణాలు

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన ఖోఖో టీం విద్యార్థులు రెండు స్వర్ణ పతకాలు సాధించారని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం తెలిపారు. ఈ సందర్భంగా స్వర్ణాలు సాధించిన విద్యార్థులకు యూనివర్సిటీలో అభినందన సభను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లోని విద్యాజ్యోతి ఇంజినీరింగ్‌ కళాశాల జాతీయస్థాయిలో నిర్వహించిన ‘‘ఫోనిక్స్‌–2022’’లోని ఖోఖో పోటీల్లో స్వర్ణపతకం సాధించారని వెల్లడించారు. హైదరాబాద్‌లోని అనురాగ్‌ యూనివర్సిటీతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో తమ యూనివర్సిటీ జట్టు హోరాహోరీగా తలపడి 6 పాయింట్ల లీడ్‌తో విజయం సాధించారని పేర్కొన్నారు. అదే విధంగా హైదరాబాద్‌లోని మహీంద్ర యూనివర్సిటీ నిర్వహించిన ‘‘ఎయిరో: ఇంటర్‌ కాలేజ్‌ స్పోర్ట్స్‌ ఫెస్ట్‌’’లో భాగంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా స్వర్ణ పతకం సాధించారని వెల్లడించారు. హైదరాబాద్‌లోని సీఎంఆర్‌ పీసీ కళాశాలతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 10 పాయింట్ల లీడ్‌తో ఏకపక్ష విజయం సాధించారని తెలియజేసారు. స్వర్ణ పతకాలు సాధించిన విద్యార్థులను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యేకంగా అభినందించారు.