విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి రీఫ్రెషర్‌ కోర్స్‌

విజ్ఞాన్స్‌లో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి రీఫ్రెషర్‌ కోర్స్‌

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డివిజన్‌ ఆఫ్‌ కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్, ఇండియన్‌ అకడమీ ఆఫ్‌ సైన్సెస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో 15 రోజుల పాటు నిర్వహించనున్న జాతీయస్థాయి రీఫ్రెషర్‌ కోర్సును శుక్రవారం నుంచి ప్రారంభించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషన్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘ సైన్స్‌ అకడెమీస్‌ రీఫ్రెషర్‌ కోర్స్‌ ఆన్‌ స్పెక్ట్రోస్కోపిక్‌ టెక్నిక్స్‌: న్యూ ఫాసెట్స్‌ ఇన్‌ కాంటెంపరరీ ఫీల్డ్స్‌ ఆఫ్‌ కెమికల్, మెటీరియల్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌’’ అనే అంశంపై ఈ కోర్సును ప్రారంభించామన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇండియన్‌ అకడమీ ఆఫ్‌ సైన్స్‌ కోర్సు డైరక్టర్‌ ప్రొఫెసర్‌ దిలిప్‌ ధవాలే మాట్లాడతూ సైన్స్‌లో వస్తున్న నూతన ఆవిష్కరణలు సమాజాభివృద్ధికి దోహదం చేస్తున్నాయని తెలిపారు. నిత్యజీవితంలో నానో మెటీరియల్స్‌ పాత్ర గణనీయంగా పెరిగిందన్నారు. మొక్కలు, ఆకులను ఉపయోగించి నానో పదార్థాలను తయారు చేయవచ్చునన్నారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సూపర్‌ కెపాసిటర్‌లు, గ్లాసు పదార్థాల తయారీ అంశాల్లో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిందన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన కోలకత్త ఐఏసీఎస్‌లోని డిపార్ట్‌మెంట్‌ ఆప్‌ మెటీరియల్స్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ నానోటెక్నాలజీ, నానో సైన్స్, ఎలక్ట్రోక్యాటలైసిస్, ఫోటోక్యాటలైసిస్, సెన్సార్‌ వంటి పరికరాలలో రోజు రోజుకు విపరీతమైన మార్పులు వచ్చి టెక్నాలజీలో వేగంగా దూసుకెళ్తున్నాయన్నారు. అంతేకాకుండా ప్రస్తుత సాంకేతిక యుగంలో మల్టీ ఫంక్షనల్‌ మెటీరియల్స్‌కు కూడా ప్రాధాన్యత గణనీయంగా పెరిగిందని తెలిపారు.  మల్టీ ఫంక్షనల్‌ మెటీరియల్స్‌ను మరింత ప్రయోజనకరంగా సమాజానికి అందుబాటులోకి తెచ్చేందుకు శాస్త్రవేత్తలు కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, కోర్సు కోఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ దేవనూరి నాగరాజు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, రీసెర్చ్‌ స్కాలర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.