విజ్ఞాన్స్‌లో ముగిసిన ఉచిత టీచర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌

విజ్ఞాన్స్‌లో ముగిసిన ఉచిత టీచర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో 40 రోజుల పాటు జరిగిన ఉచిత విద్యావాలంటీర్స్‌ టీచర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ ముగిసిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవారయలు ఎంపీగా ఉన్న నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలోని బొల్లాపల్లి, మాచవరం, వెల్దర్తి మండలాలకు చెందిన 53 మంది గిరిజిన విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఉచిత టీచర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించామన్నారు. నేటితో శిక్షణా కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్న వీరందరూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి వారి సొంత గ్రామాల్లో విద్యా వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తూ నెలకు రూ.8000 వేతనం అందుకోనున్నారని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలోని విద్యార్థులను తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్‌ మీడియంలో బలోపేతం చేయడానికి వీరు కృషి చేయాలన్నారు. అంతేకాకుండా మీ పరిసర గ్రామాల్లోని విద్యార్థులు డ్రాప్‌ అవుట్స్‌ అవ్వకుండా చూసుకోవాలన్నారు. వీరికి ప్రముఖ మల్టీనేషనల్‌ కంపెనీలైన టీసీఎస్, సింక్రోని, ఏపీటీ ఆన్‌లైన్‌ కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో నెలనెలా ఉపకార వేతనాన్ని ఇవ్వనున్నారని తెలియజేసారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌చైర్మన్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవారయలు మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించి వారిని అభివృద్ధి పథంలో నడపాలనే సదుద్ధేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. 40 రోజులపాటు జరిగిన శిక్షణా కార్యక్రమంలో నేర్చుకున్న విషయాలను వారి గ్రామాల్లో సమర్ధవంతంగా నిర్వహించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులకు టీచర్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌కు సంబంధించిన సర్టిఫికెట్‌లను అందజేసారు. ఈ 40 రోజుల కార్యక్రమానికి జాయింట్‌ డీన్‌ ఫ్యాకల్టీ అఫైర్స్‌ ప్రొఫెసర్‌ అల్లంనేని శారద డైరక్టర్‌గాను, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నాగేంద్రరావు హౌజి, డాక్టర్‌ విజయ్‌ కుమార్‌ చవాన్‌లు కోఆర్డినేటర్‌లుగా వ్యవహరించారు.