ప్రణాళికతో కష్టపడితే సాధ్యమే

ప్రణాళికతో కష్టపడితే సాధ్యమే

 _ ఆలిండియా సివిల్స్‌ 157వ ర్యాంకర్‌ కే.మనోజ్‌ కుమార్‌

విద్యార్థులు ప్రణాళికబద్దంగా కష్టపడి చదివితే సివిల్స్‌లో ర్యాంకు సాధించడం సాధ్యమేనని ఆలిండియా సివిల్స్‌ 157వ ర్యాంకర్‌ కే.మనోజ్‌ కుమార్‌  తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని సివిల్స్‌ సర్వీసెస్‌ అకడమీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ‘‘సివిల్స్‌ పరీక్షను ఎలా అధిగమించవచ్చు?’’ అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ఏడాది సివిల్స్‌ ర్యాంకర్‌ మనోజ్‌ కుమార్‌ మాట్లాడుతూ  సివిల్స్‌ సాధించాలనే విద్యార్థులు ముందుగా సిలబస్‌ను పూర్తిగా అర్థం చేసుకోవాలన్నారు. తర్వాత మార్కెట్‌లో ఉన్న అనవసరమైన పుస్తకాలను చదవకుండా స్టాండర్డ్‌ పుస్తకాలను మాత్రమే చదవాలని, సాధించాలనే పట్టుదల కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. రోజుకు కనీసం 8 గంటలపైన ఇష్టంగా చదవగలిగే సామర్థ్యం కలిగి ఉండాలన్నారు. కరెంట్‌ అఫైర్స్, ప్రసుత పరిణామాలను ఎప్పటికప్పుడు వాటిపై పట్టు సాధిస్తూ ఉండాలన్నారు. మొట్టమొదటగా సివిల్స్‌ సాధించాలనే విద్యార్థులు సాధించగలమనే కాన్ఫిడెంట్‌ ఉండాలన్నారు. ఒకటి, రెండు ప్రయత్నాలలో రానంత మాత్రాన నిరుత్సాహపడకూడదని తెలిపారు. మనం ఈ రోజు ఈ స్థాయికి రావడానికి కృషి చేసిన ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను, శ్రేయోభిలాషులను ఎప్పటికీ మరువకూడదన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ సివిల్స్‌ ర్యాంక్‌ సాధించిన మనోజ్‌కుమార్‌ను అభినందించటంతో పాటు ప్రజలకు వినూత్న సేవలను అందించగలిగి ఆ పదవికి సార్ధకత తీసుకురావాలని కోరారు. అనంతరం సివిల్స్‌ ర్యాంకర్‌ కే.మనోజ్‌ కుమార్‌ను, అతని తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు.