మానవాళికి యోగా అనిర్వచనీయం

మానవాళికి యోగా అనిర్వచనీయం

 _ ఆంధ్రప్రదేశ్‌ యోగా అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వీవీ రామారావు

ప్రపంచ మానవాళికి యోగా అనేది అనిర్వచనీయమైనదని ఆంధ్రప్రదేశ్‌ యోగా అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వీవీ రామారావు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విద్యార్థులు ఇంటర్నేషనల్‌ యోగా డేను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం యోగా డేను ‘‘ యోగా ఫర్‌ హార్మనీ అండ్‌ పీస్‌’’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్‌ యోగా అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ వీవీ రామారావు మాట్లాడుతూ యోగాతోనే సంపూర్ణ వికాసం సాధ్యమవుతుందన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వలన ఏ వ్యాధి దగ్గరకు రాదని, శరీరంలోని రుగ్మతలన్నీ తొలగిపోయి ప్రాణశక్తి పెరుగుతుందన్నారు. యోగా చేయడం వలన ఏకాగ్రత పెరుగడంతోపాటు శారీరక ధృఢత్వం, మానసిక ఒత్తిడి దూరమవుతుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనము నుంచే యోగాసనాలపై ఆసక్తిని కలుగుజేయాలని పిలుపునిచ్చారు. విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ యోగా అనేది శాస్త్రబద్ధమైన జీవన విధానమన్నారు. ఆధునిక జీవన శైలిలో ఒత్తిడిని తట్టుకుని ఆహ్లాదకరమైన జీవితాన్ని గడిపేందుకు నిత్యజీవితంలో విద్యార్థులు యోగాను సాధనంగా మార్చుకోవాలన్నారు. యోగాభ్యాసంతో మనసుపై నియంత్రణ సాధించడం వల్ల మానసిక శాంతితోపాటు క్రమశిక్షణ అలవడే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు ఆకట్టుకున్నాయి. ఇంటర్నేషనల్‌ యోగా డేను పురస్కరించుకుని నిర్వహించిన పలు పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులకు మెడల్స్‌తో పాటు నగదు బహుమతి, ప్రశంసా పత్రాలను అందజేసారు.