మత్తుతో జీవితం చిత్తు

మత్తుతో జీవితం చిత్తు
- గుంటూరు ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ డీ.ఎన్‌.మహేష్‌

  దిశ చట్టంతో మహిళలకు రక్షణ : గుంటూరు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ ఎన్‌.అన్నపూర్ణ
  మత్తు పదార్థాల వాడకం ప్రాణాంతకం : అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ ఎం.మణికంఠ
  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో  డ్రగ్‌ అడిక్షన్‌ అండ్‌ అబ్యూజ్‌పై విద్యార్థులకు అవగాహన సదస్సు

మత్తు పదార్థాల వాడకంతో జీవితం చిత్తు చిత్తు అవుతుందని గుంటూరు ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ డీ.ఎన్‌.మహేష్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం గుంటూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ‘‘అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ డ్రగ్‌ అడిక్షన్‌ అండ్‌ అబ్యూజ్‌’’ అనే అంశంపై ‘‘ సే నో టు డ్రగ్స్‌’’ అని విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు ఎస్‌ఈబీ అడిషనల్‌ ఎస్పీ డీ.ఎన్‌.మహేష్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌ తీసుకోవడం సరదాగా మొదలుపెట్టే ఈ అలవాటు చివరకు వారిని బానిసను చేస్తుందన్నారు. డ్రగ్స్‌ కోసం నేరాలు చేసేందుకు కూడా బాధితులు వెనుకాడబోరన్నారు. స్నేహితులు, బంధువులు అందరినీ మరిచి ఒంటరిగా కృంగి కృశించిపోయి చివరకు ఆత్మహత్యలకు కూడా పాల్పడిన సందర్భాలున్నాయని విద్యార్థులకు వెల్లడించారు. మరికొంతమంది  మత్తు పదార్థాలను సేవించి వాహనాలను నడపటం వలన కూడా ఎక్కువ మంది యువత ప్రాణాలను కోల్పోయారన్నారు. యువత మత్తు పదార్థాలు సేవించడం లేక మత్తు పదార్థాలను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరవేయడం కూడా నేరమని, అందుకు తగిన శిక్షలను అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు.  మత్తు పదార్థాల సరఫరాకు సంబంధించి విద్యార్థుల వద్ద సమాచారం ఉన్నట్లైతే పోలీసుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. 
దిశ చట్టంతో మహిళలకు రక్షణ : గుంటూరు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ ఎన్‌.అన్నపూర్ణ
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూపొందించిన దిశ చట్టం మహిళకు రక్షణగా నిలుస్తుందని గుంటూరు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ ఎన్‌.అన్నపూర్ణ అన్నారు. దిశ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత రాష్టంలో మహిళలపై అత్యాచారాలు గణనీయంగా తగ్గాయన్నారు. మహిళలకు సమస్యలు ఎదురైనప్పుడు ప్రతి ఒక్కరూ మేమున్నామంటూ ముందువరుసలో నిలవాలన్నారు.
మత్తు పదార్థాల వాడకం ప్రాణాంతకం : అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ ఎం.మణికంఠ
మత్తు పదార్థాల వాడకం ప్రాణాంతకమని అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ ఎం.మణికంఠ అన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గంజాయి, గుట్కా, హెరాయిన్, కొకైన్‌ వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలన్నారు. మత్తుకు అలవాటుపడిన యువత క్రమేపీ వాటికి బానిసలవుతూ ఇతరులను హత్య చేయడం, డబ్బులేని సమయాలలో దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్స్‌ వంటి వాటికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.